VIP Reporting
-
ప్రజల పక్షాన పోరాటం
ప్రజల కష్టాలను అమ్మలా అర్థం చేసుకుని.. తోబుట్టువులా తోడు నిలుస్తూ పార్టీలకు అతీతంగా తన వంతు సహాయం చేయడమే గౌరు చరితారెడ్డిని ప్రజాప్రతినిధిగా నిలబెట్టింది. సాధారణ గృహిణిగా ఉన్న ఆమె.. 2004లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో రాజకీయ రంగప్రవేశం చేసి నందికొట్కూరు ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఈమె స్వగ్రామం నందికొట్కూరు మండలంలోని కొణిదేల గ్రామం. భర్త గౌరు వెంకటరెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు సేకరించిన ఎమ్మెల్యేల్లో ఈమెది రెండో స్థానం. చరిత పనితీరుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పాణ్యం అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై గెలుపొందారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తనను ఆదరించిన ప్రజల పక్షాన ప్రభుత్వంపై అలుపెరుగని పోరుకు ఆమె సర్వసన్నద్ధమయ్యారు. ప్రజల కష్టాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ‘సాక్షి’ తరపున కర్నూలు శివారులోని వీకర్ సెక్షన్ కాలనీ, లెప్రసీ కాలనీల్లో పర్యటించి వీఐపీ రిపోర్టింగ్ చేశారు. చరితారెడ్డి : ఏమ్మా బాగున్నారా. మీ పేర్లేంటి? కాలనీలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కాలనీవాసులు : నా పేరు జ్యోతి మేడం, నా పేరు రజియా.. మా రేషన్‌కార్డులు తొలగించారు. వ్యక్తి మరుగుదొడ్లు లేక.. మహిళలు బహిర్భూమికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. చరితారెడ్డి : అమ్మా.. మీరు రెండు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. మీ రేషన్‌కార్డులు ఎందుకు తొలగించారనే విషయం పౌరసరఫరాల శాఖ అధికారులతో మాట్లాడుతా. ప్రతి ఇంటికీ వ్యక్తి మరుగుదొడ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటాను. ప్రభుత్వం రూ.12 వేలు మంజూరు చేస్తోంది. కాబట్టి అందరూ కట్టించుకోవాలి. చరితారెడ్డి : ఏమన్నా.. నీ సమస్య ఏమిటి? అంజి : నేను డ్రైవర్‌గా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంటికి వచ్చే సమయం ఏ అర్ధరాత్రో అవుతుంది. వీధిలో లైట్లు వెలగకపోవడంతో చీకటిగా ఉంటోంది. కుక్కల బెడద కూడా ఉంది. చరితారెడ్డి : అన్నా మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి ఇక్కడ వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తా. చరితారెడ్డి : అవ్వా బాగున్నావా? మీ పేరెంటి? నీకున్న సమస్యలు చెప్పు? వృద్ధురాలు : అమ్మా నా పేరు గొల్ల సుంకులమ్మ, నాకు, నా భర్తకు గతంలో రెండొందలు పింఛను వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. పింఛను వచ్చేలా చూడమ్మా.. నీకు పుణ్యముంటాది. బియ్యం కార్డు ఉన్నా డీలరు బియ్యం వేయడం లేదు. చరితారెడ్డి : అవ్వా, నీకు తాతకు ఎందుకు పింఛను తీసేశారో అధికారులను అడిగి తెలుసుకుంటా. మీరు నాకు దరఖాస్తు ఇవ్వండి.. కచ్చితంగా పింఛను వచ్చేలా చూస్తా. అలాగే మీ డీలరుతో మాట్లాడి బియ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తా. చరితారెడ్డి : అవ్వా పిల్లానికేమయింది? నాగమ్మ : వీడు నా మనుమడమ్మా. పుట్టుకతోనే నడువలేని పరిస్థితి. ఇప్పుడు వీడి వయస్సు ఆరేళ్లు. వీడికి ఏదైనా ఆదరవు చూపించమ్మా. చరితారెడ్డి : అధికారులతో మాట్లాడి వికాలంగుల పింఛను వచ్చే ఏర్పాటు చేస్తానవ్వా. చరితారెడ్డి : అయ్యా, కాలువ నీరు ఇలా పారుతోందేమిటిప్రసాద్ : మేడమ్, కాలనీపై నుంచి మురుగు నీరంతా దిగువకు వస్తోంది. ఉదయం పూట ఈ కాలువనీరు రోడ్డుపై పారుతోంది మేడమ్. చిన్న పిల్లలున్నారు. బయటకు పంపాలంటే భయమేస్తోంది. దోమలు బెడద కూడా ఎక్కువగా ఉంది. చరితారెడ్డి : కాలువ చిన్నది కావడం.. మురుగునీరు భారీగా వస్తుండడం వల్లే ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఎగువ నుంచి వచ్చే మురుగునీరు సామర్థ్యానికి తగినట్లు మురుగుకాలువలు మరమ్మతు చేయాల్సి ఉంది. మున్సిపల్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా. చరితారెడ్డి : అన్నా మీ సమస్య ఏమిటి? ఈశ్వరయ్య : మేడమ్. మా అమ్మకు 79 ఏళ్లు. ఐదెకరాల పొలం ఉందని సాకు చూపి వస్తున్న పింఛన్‌ను తొలగించారు. మాకు ఎక్కడా సెంటు స్థలం కూడా లేదు. చరితారెడ్డి : అన్నా మీ బాధ నాకు అర్థమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అందరికీ ప్రతినెలా పింఛను అందేది. ఇప్పుడు ఒక్కరికి పింఛను ఇవ్వడం కోసం చంద్రబాబు నలుగురికి కోత పెడుతున్నారు. అయినా అధికారులతో మాట్లాడి, అవసరమైతే పోట్లాడైనా మీ అమ్మకు పింఛను వచ్చేలే చేస్తాను. చరితారెడ్డి: అమ్మాయిలూ.. మీ పేర్లేంటి? ఏమి చదువుతున్నారు? ఇబ్బందులేమన్నా ఉన్నాయా? విద్యార్థినిలు : మేడం.. మా పేర్లు ఆదిలక్ష్మీ, షేకూన్. ఇద్దరం కేవీఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ఇక్కడి నుంచి కళాశాలకు ఆటోలో వెళ్లలేకపోతున్నాం. ఆకతాయిలు ఎక్కి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయించండి. చరితారెడ్డి : కచ్చితంగా ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతా. ఇక్కడే కాలేజీ ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. ఆటోల్లో ఆకతాయిల బెడదపైనా పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటా. చరితారెడ్డి : ఏమయ్యా చిన్నరాజు బాగున్నావా.... చిన్నరాజు : అమ్మా మీ చలువ వల్ల బాగున్నా. మీ ద్వారా వికలాంగుల పింఛన్ పొందుతున్నాను. ట్రై సైకిల్ పాతదైంది. కొత్తది ఇప్పించే ఏర్పాటు చేయండి. రేషన్‌కార్డు కూడా ఇప్పించండి. చరితారెడ్డి : అలాగే అయ్యా.. రేషన్‌కార్డు, ట్రై సైకిల్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తా. మద్దయ్య : అమ్మా.. మురుగునీరు పెద్ద ఎత్తున వస్తోంది. కాలువలు చిన్నవి కావడంతో మురుగునీరు ఇళ్లలోకి వస్తోంది. దుర్వాసన భరించలేకపోతున్నాం. చరితారెడ్డి : నిజమే.. కాలువలు పెద్దగా నిర్మించాలి. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా. చరితారెడ్డి : అవ్వా బాగున్నావా? మీకేమైనా సమస్య ఉందా? సుబ్బమ్మ : అమ్మా.. మా కాలనీవాసులు ఇక్కడకు చెత్త తెచ్చి వేస్తున్నారు. బహిరంగ ప్రదేశం కావడంతో పందులు వచ్చి చెత్తాచెదారాన్ని చిందరవందర చేస్తున్నాయి. చెత్తకుండీ ఏర్పాటు చేయించండి. చరితారెడ్డి : అలాగే అవ్వా.. ఇక్కడ చెత్తకుండీ ఏర్పాటు చేయిస్తాను. చరితారెడ్డి : ఆదర్శ(లెప్రసీ) కాలనీ బాగుందా... పాపయ్యా. పాపయ్య : కాలనీలో తాగునీటి సౌకర్యం లేదమ్మా. పక్క వీధుల్లో కుళాయిలకు నీళ్లు వచ్చినప్పుడు... అదీ ఇతరులెవరూ లేనప్పుడు మాత్రమే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందమ్మా. 8 మందికి వేలి ముద్రలు సరిగా లేవని పింఛన్లు ఇవ్వట్లేదమ్మా... కాళ్లు, చేతులు కుచించుకుపోయాయి. చరితారెడ్డి : మీరన్నది నిజమే. దివంగత నేత వైఎస్సార్ ఉన్నప్పుడే అందరికీ పింఛన్లు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా మీ అందరికీ పింఛన్ల వచ్చేలా కృషి చేస్తాను. చరితారెడ్డి : మీ సమస్య ఏంటి బాబు? రవికుమార్ : మేడమ్, శ్మశాన వాటికకు స్థలం లేదు. కాలనీలో 15 సెంట్ల స్థలం మాత్రమే ఉంది. ఈ కాలనీలో ఎవరు చనిపోయినా అందులోనే గుంతలు తవ్వి పూడుస్తున్నాం. దయచేసి మరికొంత స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించండి. చరితారెడ్డి : అధికారులతో మాట్లాడి శ్మాశన వాటికకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చూస్తాను. చరితారెడ్డి : చౌక దుకాణాల్లో సరుకులు సరిగా ఇస్తున్నారా? ఆంజనేయులు: సరుకులు సరిగా ఇవ్వడం లేదు. ఇక్కడ చౌక దుకాణ డీలరును తొలగించడంతో ఇతర దుకాణానికి సరుకులు కేటాయించారు. ఆ దుకాణం కాలనీకి చాలా దూరంగా ఉంది. చరితారెడ్డి : ఇక్కడే డీలరు ఉండేలా చర్యలు తీసుకుంటాను. -
కొండెక్కిన టెంకాయ
కొబ్బరికాయలు దేవస్థానం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశించి, అమలయ్యేలా గట్టి చర్యలు తీసుకుంటాను. అధిక ధరలకు అమ్మితే లెసైన్సు రద్దు చేయడానికి కూడా వెనుకాడను. వ్రతపురోహితులు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, అధికారులు, ఇతర సిబ్బంది కలిపి దాదాపు వెయ్యిమంది పనిచేస్తున్నారు. వారందరి సంక్షేమానికీ చర్యలు తీసుకుంటాను. ట్రస్టు బోర్డు సమావేశంలో చర్చించి అన్నదానం విస్తరిలో ప్రసాదం పెట్టేలా చూస్తాను. పుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో మరుగుదొడ్లు, స్నానపు గదులు, షామియానాలు ఏర్పాటు చేస్తాం. భక్తుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అభినందనీయం. - ఈరంకి జగన్నాథరావు ఈఓ (ఎఫ్ఏసీ) ఈఓ జగన్నాథరావు : ఏమండీ మీపేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? వ్రతం, దర్శనం ఎలా జరిగాయి? మీరేమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? భక్తుడు : సార్ నా పేరు చలసాని రవీంత్రనాథ్ ఠాగూర్. విశాఖపట్నం నుంచి వచ్చామండి. వ్రతం, దర్శనం బాగానే జరిగిందండి. మీరేమో అధికారిలా ఉన్నారు. ‘సాక్షి’ మైకు పట్టుకున్నారు. ఏమనుకోనంటే ఒక్క సమస్య చెబుతాను.. ఒక్క కొబ్బరికాయ రూ.20 పెట్టి కొనాలంటే ఎలాగో మీరే చెప్పండి. ఇంత దారుణంగా అమ్ముతున్నారే. కొబ్బరికాయ, ఇతర సామగ్రి సెట్టుకు రూ.150 పైనే తీసుకొంటున్నారు. మాలాంటి మధ్యతరగతి వాళ్లకు ఇబ్బంది కదా సార్.. ఏదైనా ధరలు తగ్గించేలా చూడండి. కేశఖండన శాలలో సిబ్బంది రూ.10 డిమాండ్ చేస్తున్నారు. మీరే చర్యలు తీసుకోవాలి. ఈఓ : ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. కొబ్బరికాయలతో పాటు ఇతర వస్తువుల ధరలు నియంత్రిస్తాను. (మరొకరితో) అబ్బాయి నీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? భోజనం క్యూలైన్లో ఉన్నారు కదా, ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండి చెప్పండి. భక్తుడు : నాపేరు రామారావు. మాది కడియం సర్. ఇప్పటికే అరగంట నుంచి క్యూలైన్లోనే ఉన్నాం. ఇంత సమయం ఉండాలంటే వృద్ధులు, పిల్లల తల్లులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈఓ : ఏమి చేస్తే ఆ ఇబ్బందులు తొలగిపోతాయో మీరే సూచించండి. అవకాశమున్న మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. రామారావు : సర్.. వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఈఓ భోజన శాలలో) : బాబూ నీపేరేంటి ? మీదే ఊరు? భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయా? భక్తుడు: నాపేరు శ్రీనివాస్ సర్. మా ఊరు తుని మండలం తేటగుంట సర్. భోజన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటే వెలితి.. గతంలో భోజనం విస్తరాకులో పెట్టేవారు. ఇప్పుడు పెట్టడం లేదు. ఆకులో పెడితే అదో సంతృప్తి సార్.. ఒక్కసారి ఆలోచించండి. ఈఓ : ఇదివరకు ఆకులో ప్రసాదం వేయడం నిజమే. బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటాం.. సరేనా? (మరొకరితో) నీ పేరేమిటి, ఉద్యోగిలా ఉన్నావు, ఏ విభాగంలో పనిచేస్తున్నావు. అన్నదాన సత్రంలో ఏర్పాట్లు ఏమిటి? ఇబ్బందులేంటి? ఉద్యోగి : గుడ్‌మార్నింగ్ సర్ నా పేరు భాస్కరరావు. భోజనశాలలో సూపరింటెండెంట్‌ను. పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తున్నారు. రెండు చోట్ల భోజన సత్రాలు నిర్వహిస్తున్నాం. భక్తులందరికీ ఒకే చోట పెట్టేలా భవనం ఉంటే బాగుంటుంది సర్, ఈఓ : ఏమయ్యా నీపేరేమిటి? భోజనం వద్ద ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? భక్తుడు : నా పేరు వెంకటేశ్వరరావు సర్. భోజనం క్యూలైన్లలో ఎక్కువమంది ఉన్నప్పుడు కొందరు ఎండలో ఇబ్బంది పడుతున్నారు సర్. పాత భోజన శాల నుంచి కొత్త భోజనశాలకు మధ్య ఎండలో పిల్లలు మాడిపోతున్నారు సర్. ఈఓ : రెండు చోట్లా భోజన ఏర్పాట్లకు, రెండింటికీ మధ్య షెడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. (మరొకరితో) మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? సత్యదేవుని వ్రతం, దర్శనం చేసుకున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? భక్తుడు : నాపేరు ఇల్ల సత్యనారాయణండీ. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం నుంచి వచ్చామండీ. నోములు బాగానే చేసుకున్నాం. దర్శనం కూడా బాగానే అయ్యింది. సౌకర్యాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఈఓ : మీకు ధన్యవాదాలు. స్వామివారిని మరోసారి దర్శించుకోండమ్మా. (మరొకరితో) మీపేరేంటి స్వామీ? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై సమస్యలేమైనా ఎదుర్కొన్నారా? భక్తుడు : సర్ నాపేరు రాంబాబు. గన్నవరం నుంచి వచ్చాము. భక్తులకు మెట్ల మార్గంలో సరైన తాగునీటి ఏర్పాట్లు లేవు. అంతరాలయ దర్శనానికి రూ.100 టిక్కెట్టు మరీ ఎక్కువ సారూ. సాధారణ దర్శనం చేసుకున్నాం. ఈఓ : ఆ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఓకేనా. (ప్రసాదం తయారీ విభాగంలో) నీ పేరేమిటి బాబూ? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం సెక్షన్లో పనిచేస్తున్నావు? ప్రసాదం తయారీ, ప్యాకింగ్‌లో ఇబ్బందులున్నాయా? ఉద్యోగి : నమస్కారం సారూ. నా పేరు లింగంపల్లి చిన్నారావండీ. ప్రసాదం ప్యాకరుగా 1986 నుంచి పనిచేస్తున్నాను సర్. ప్రసాదం గతంలో పుల్లల పొయ్యిపై తయారయ్యేది. పాలు వినియోగించే వారు. ఎక్కువకాలం నిల్వ కోసం పాలు వేయడం మానేశారు. ఈఓ : మీకు ఏప్రాతిపదికన వేతనం ఇస్తున్నారు? ఉద్యోగి : అమ్మకం జరిగిన ప్యాకెట్టుపై 35 పైసల చొప్పున ఇస్తే మేమంతా పంచుకుంటున్నామండీ. కమీషన్ పద్ధతి తీసేసి జీతాలివ్వాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. కాస్త పుణ్యం కట్టుకోండయ్యా. ఈఓ : ఎలాగూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామంటున్నారు కదా.. నేను కూడా నా వంతు ప్రయత్నిస్తాలే (మరొకరితో) ఏమయ్యా నీపేరు? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం కావిళ్లు మోస్తున్నావు? జీతమెంత? ఉద్యోగి : నాపేరు నంబారు కాగితమ్మ. సుమారుగా 24 ఏళ్లుగా పనిచేస్తున్నా. కమీషన్‌గా నెలకు ప్రసాదం అమ్మకాన్ని బట్టి ఆరేడు వేలు వస్తోందయ్యా. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందయ్యా. ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామయ్యా.. కమీషన్ పెంచాలయ్యా. ఈఓ : మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. (భక్తురాలితో) అమ్మా మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా? భక్తురాలు : నాపేరు కృష్ణవేణి సార్, మాది రాజమండ్రి. వ్రతం, దర్శనం చేసుకున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదండీ. - ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, పోతుల జోగేష్, తోట చక్రధర్. - ఫొటోలు : గరగ ప్రసాద్ -
ఆధునిక హంగులు
కర్నూలు వైద్య కళాశాల (కేఎంసీ). రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన వైద్యులను తీర్చిదిద్దిన ఘనతను సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవాలంటే.. ముందుగు గుర్తొచ్చే కళాశాల ఇదే. 100 ఎకరాల విస్తీర్ణం.. అత్యుత్తమ ప్రమాణాలు.. నిష్ణాతులైనప్రొఫెసర్లు.. ఫ్యాకల్టీకి పెట్టింది పేరు కేఎంసీ. రెండున్నరేళ్ల క్రితం ప్రిన్సిపాల్‌గా డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాయిలో కర్నూలు వైద్య కళాశాలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వైద్య విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించడంలో కీలకభూమిక పోషించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టింగ్ చేశారు. వైద్య కళాశాలలోని హాస్టళ్లను స్వయంగా పరిశీలించి.. వైద్య విద్యార్థులసమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి హామీ ఇస్తూ.. అభివృద్ధిపై తన అంతరంగం ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ : నీ పేరేంటి ? సమస్యలేమైనా ఉన్నాయా? విద్యార్థిని : సార్.. నా పేరు స్రవంతి. 2013 బ్యాచ్. మెస్‌లో టోకెన్ విధానం తీసుకురావాలి. సెలవుల్లో లేదా మూడు, నాలుగు రోజులు ఇంటికి వెళితే ఆ రోజులకు సంబంధించి మెస్ డబ్బు తిరిగివ్వడం లేదు. ప్రిన్సిపాల్ : మెన్స్ హాస్టల్లో సమస్య లేదు. అక్కడ విద్యార్థుల తరఫున కార్యదర్శి ఉంటాడు. మహిళా హాస్టల్ సమస్య నా దృష్టికి రాలేదు. సమస్య ఎక్కడుందో తెలుసుకుని పరిష్కరిస్తా. ప్రిన్సిపాల్ : హాస్టల్ పరంగా ఇంకా ఏమైనా సమస్యలున్నాయా ? నివేదిత, విద్యార్థిని : హాస్టల్ గదులకు బాడుగ రూ.700 వసూలు చేస్తున్నారు. ఎక్కువగా ఉంది. ఒక్కో గదిలో ముగ్గురు, నలుగురు ఉండటం ఇబ్బందికరం. సంఖ్య తగ్గిస్తే చదువుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రిన్సిపాల్ : సమస్య వాస్తవమే. కళాశాలలో సీట్ల సంఖ్య పెరిగినా.. అందుకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించాల్సి ఉంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆసుపత్రి ప్రాంగణంలోనే కొత్తగా పీజీ హాస్టళ్ల భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ చందన, అనస్తీషియా వైద్య విద్యార్థిని : సార్. హాస్టల్లో మంచినీటి సమస్య ఉంది. యూజీ హాస్టల్ నుంచి తెచ్చుకుంటున్నాం. ప్రిన్సిపాల్ : వెంటనే పరిష్కరిస్తా. కళాశాల డెవలప్మెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్తా. స్వచ్ఛమైన నీటిని అందించే ఏర్పాటు చేస్తా. ప్రిన్సిపాల్ : అమ్మాయి(రాజరాజేశ్వరి) స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటున్నావా ? విద్యార్థిని : సార్.. ప్రతి శనివారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటున్నాం. సూపర్ స్పెషాలిటీ వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా శుభ్రపరుస్తున్నాం. చెత్తను తొలగిస్తున్నాం. డాక్టర్ లక్ష్మీప్రియ : సార్ సి.బ్లాక్ అధ్వానంగా ఉంది. వర్షం వస్తే నరకం కనిపిస్తోంది. ప్రిన్సిపాల్ : చాలా ఏళ్ల క్రితం నిర్మించిన క్వార్టర్లు కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. సి-బ్లాక్ సమస్యను వెంటనే ఇంజినీరింగ్(ఏపీఎంఎస్ఐడీసీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయిస్తా. డాక్టర్ భానుప్రదీప్(పీజీ వైద్య విద్యార్థి) : మెన్స్ హాస్టల్లో 60 గదులున్నా చాలడం లేదు. రెండో అంతస్తు అధ్వానంగా తయారైంది. వంటగది నిరుపయోగంగా మారింది. రీడింగ్ రూమ్, కారు షెడ్డు, స్పోర్ట్స్ సౌకర్యాలు కల్పించాలి. ప్రిన్సిపాల్ : కర్నూలు వైద్య కళాశాలకు 120 నుంచి 150 సీట్లు పెరిగాయి. గదుల కొరత ఉంది. పాత బ్లాక్ కావడంతో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే డీఎంఈకి సమస్యను విన్నవించా. అదనంగా 20 గదులు నిర్మిస్తాం. పీజీ క్వార్టర్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. క్వార్టర్లలో మౌలిక సదుపాయాలు, కారుషెడ్డు, పార్కింగ్ సమస్య పరిష్కరిస్తా. డాక్టర్ భరత్ : పీజీ, యూజీ సీట్లు పెంచారు. వైద్య విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయినా గదుల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. హాస్టల్ ప్రాంగణంలోనే బయటి వ్యక్తులు మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉంది. ప్రిన్సిపాల్ : 1500 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ను ఆధునీకరిస్తాం. విద్యుత్ అధికారులతో మాట్లాడతా. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ భారత్‌లో ప్రతి పీజీ వైద్య విద్యార్థి పాల్గొనాలి. డాక్టర్ పృధ్వీరాజ్(వైద్య విద్యార్థి): వీధిలైట్లు లేవు. సెక్యూరిటీ కరువైంది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రిన్సిపాల్ : ఇంటర్నల్ రోడ్లు వేయిస్తాం. సూపరింటెండెంట్‌తో మాట్లాడతా. సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం. వీధి లైట్లు వేయిస్తాం. బి.లింగేశ్వరి(వైద్య విద్యార్థిని): మెడికల్ కళాశాల అంతర్గత గేటు సాయంత్రం 4 గంటలకే మూసేస్తున్నారు. చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. స్టైఫెండ్ అందడం లేదు. ప్రిన్సిపాల్ : భద్రత చర్యల్లో భాగంగా సాయంత్రం త్వరగా మూసేస్తున్నాం. బడ్జెట్ వస్తే స్టైఫెండ్ సమస్య పరిష్కారమవుతుంది. సమష్టి కృషితో కర్నూలు వైద్య కళాశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. అత్యుత్తమ ఫ్యాకల్టీతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. యూజీ సీట్లు 150 నుంచి 200, పీజీ సీట్లు 60 నుంచి 96కు పెంచగలిగాం. క్యాంపస్‌లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ మెరుగుపరిచాం. ఎంసీహెచ్ బ్లాక్ మంజూరైంది. రూ.8కోట్లతో మెటర్నిటీ బ్లాక్ పూర్తయింది. వైద్య విద్యార్థుల సౌకర్యార్థం నెట్ జర్నల్ ఏర్పాటు చేశాం. బాస్కెట్ బాల్ కోర్టు, జిమ్, వీడియో కాన్ఫరెన్స్ రూము ఏర్పాటుకు కృషి చేస్తున్నా. ఇందుకోసం రూ.75 లక్షలు వెచ్చించనున్నాం. 13వ ఆర్థిక సంఘం నిధులతో పరిపాలన భవనం నిర్మించాల్సి ఉంది. ఆసుపత్రి ప్రాంగణంలోనే పీజీ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తాం. రూ.5 కోట్లతో పారా మెడికల్ కోర్సులకు సంబంధించి భవన నిర్మాణం, సౌకర్యాల కల్పనకు రూ.5 కోట్లు వెచ్చిస్తున్నాం. - ‘వీఐపీ రిపోర్టర్’ డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్, కేఎంసీ ప్రిన్సిపాల్ -
ఇరుకు గదుల్లో ఇక్కట్లు..
‘గుడ్లు, బియ్యం, నూనె ఇవ్వడం కన్నా రోజూ భోజనం పెడితే బాగుంటుంది. ఇరుకు గదుల్లో పిల్లలతో కలిసి కూర్చోవాలన్నా, ఆరోగ్య సమస్యలు చెప్పుకోవాలన్నా నానా తిప్పలు పడుతున్నాం’ అంటూ బాలింతలు, గర్భిణులు, పిల్లల తల్లులు స్త్రీ, శిశుసంక్షేమశాఖ (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పి.విజయలక్ష్మికి మొరబెట్టుకున్నారు. జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 5,143 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 86,721 మంది గర్భిణులు, బాలింతలు, 85,935 మంది 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులు, 1,46,780 మంది ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు ఉన్నారు. వారి ఇబ్బందులను తెలుసుకోవాలనుకున్న ‘సాక్షి’ మీడియా..ఆ బాధ్యతను నిర్వర్తిం చాలని కోరగా ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి శనివారం ‘వీఐపీ రిపోర్టింగ్’ చేశారు. ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి (స్వామినగర్‌లో) : ఇక్కడ బాధ్యులెవరు? ఎంత మంది పిల్లలుండాలి? ఇప్పుడెంత మంది ఉన్నారు? ఆ హాజరు పట్టీ ఇలా ఇవ్వండి. అంగన్వాడీ వర్కర్ భాగ్యలక్ష్మి : 15 మంది ఉన్నారు మేడమ్. 30 మంది పిల్లలుండాలి. తల్లులు వచ్చి తీసుకువెళ్లారు మేడమ్. పీడీ : మరి నీవేం చేస్తున్నావు? ఆటా, పాటా అన్నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? వర్కర్ : పాటలు నేర్పిస్తున్నాను, వాళ్లు పాడుతున్నారు మేడమ్. పీడీ : ఏమమ్మా నీ పేరేమిటి? నీకు ఎన్నో నెల? ఈ అంగన్వాడీ కేంద్రం ఎలా పనిచేస్తోంది? ఆహారం బాగా అందిస్తున్నారా? బాలింత : నాపేరు పద్మండీ. ఎనిమిదో నెలండీ. వారానికి నాలుగు గుడ్లు ఇస్తున్నారు. కేంద్రం బాగానే ఉంది. రెండు టీటీ ఇంజక్షన్లు కూడా చేశారు. పీడీ : మీకు బియ్యం, నూనె, కందిపప్పు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మీకెవరైనా చెప్పారా? బాలింత : బరువు పెరగడానికే కదండీ.. ఎవరూ చెప్పలేదు మేడమ్! పీడీ : మీ బరువు పెరగడానికి కాదు తల్లీ.. కడుపులో ఉన్న బిడ్డ బరువు, పెరిగి ఆరోగ్యంగా ఉంటుందని. అశ్రద్ధ చేయకండి సుమా. బాలింత : సరే మేడమ్! పీడీ : నీ పేరేమిటి, ఏమైనా సమస్యలున్నాయా? బాలింత : అనురాధండీ. మేడమ్! పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో చిన్ని గదిలో చాలా ఇరుకిరుగ్గా కూర్చుంటున్నారండీ. కనీసం వెలుతురు కూడా రావడం లేదు. పీడీ : పిల్లలందరికీ సరిపోయేలా కొత్త భవనం నిర్మించేందుకు అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపిస్తాను. పీడీ : ఏవమ్మా నీ పేరేమిటి, పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారు? పిల్లలంతా వస్తున్నారా? బాలింత : దేవి మేడమ్. పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు కానీ.. వాళ్లు ఆడుకోవడానికి కేంద్రంలో అవకాశం కనిపించడం లేదండీ. మీరే ఏదైనా చేయాలి. పీడీ : పిల్లల ఇబ్బందులు నేను కూడా చూశాను కదా. మీరు చెప్పినట్టే ప్రీ స్కూల్ పిల్లల కోసం కాస్త విశాలంగా ఉండే గది ఏర్పాటు చేయిస్తాను. వారు ఆడుకోవడానికి కూడా ఏదైనా చూద్దాం మరి. (మరొకరిని ఉద్దేశించి) నీ పేరేమిటి? ఏదైనా చెప్పదలుచుకున్నావా, పర్లేదు చెప్పమ్మా. నీ పేరు కేంద్రంలో నమోదు చేసుకున్నారా? క్రమం తప్పకుండా ఏఎన్ఎం చెకప్చేస్తున్నారా, లేదా? బాలింత : రామలక్ష్మి మేడమ్. పేరు నమోదు చేసుకున్నారు. ఏఎన్ఎం వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు కానీ మేడమ్.. వారానికి నాలుగు గుడ్లు, కందిపప్పు, బియ్యం కాకుండా మాకు ప్రతి రోజు భోజనం పెట్టే ఏర్పాటు చేయండి చాలు. పీడీ : మంచి ఐడియా ఇచ్చావు తల్లీ. అది నా పరిధిలో ఉండదమ్మా. కానీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. పీడీ : ఏమ్మా బియ్యం, కందిపప్పు, నూనె ఎంతెంత ఇస్తున్నారు? అన్ని సక్రమంగానే అందుతున్నాయా? భయపడకుండా చెప్పండి. ఒకేసారి నాలుగు గుడ్లు ఉడికించి ఇస్తున్నారా లేక మామూలు గుడ్లు ఇస్తున్నారా. బాలింత : అన్నీ ఇస్తున్నారు మేడమ్. గుడ్లు ఉడికించి వారానికి నాలుగు ఇస్తున్నారు. పీడీ: నీ పేరేటమ్మా, నీకు ఎన్నో నెల, కేంద్రం ఎలా పనిచేస్తోంది, అన్ని సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా తేడాలున్నాయా? బాలింత : లావణ్య మేడమ్. ఎనిమిదో నెలండీ. బియ్యం, నూనె సక్రమంగానే అందుతున్నాయి. పీడీ: మీరెవరు? ఇప్పుడు వచ్చారేమిటి? సూపర్వైజర్: మేడమ్.. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇటీవలే జాయిన్ అయ్యాను.. అందుకే ఆలస్యమైంది మేడమ్. పీడీ (కాకినాడ అర్బన్ ముత్తానగర్‌లో) : ఏమమ్మా నీ పేరేమిటి, పౌష్టికాహారం బాగా అందుతోందా? బాలింత : కావేరి అండీ. గర్భిణులకు పండ్లు, పాలు, డ్రైప్రూట్స్ వంటివి సరఫరా చేయాలి. పౌష్టికాహారంగా ఇస్తున్న బియ్యం, పప్పు, నూనె వారం రోజులకు కూడా సరిపోవడం లేదండీ. నెలలో 20 రోజులకు సరిపడా పౌష్టికాహారం అందించేలా చూడండి మేడమ్. పీడీ : ప్రభుత్వం నుంచి అందే పౌష్టికాహారం పూర్తిగా అందేలా చూస్తాను. నెలలో 20 రోజుల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానమ్మా. (మరొకరిని ఉద్దేశించి):నీ పేరేమిటమ్మా, ఏమైనా సమస్యలున్నాయా? బాలింత : గౌరి అండీ. పక్కా భవనం లేక గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలతో పాటు కూర్చుని ఆరోగ్యసమస్యలు తెలుసుకుందామంటే ఇబ్బందమ్మా. నెలవారీ ఇంజక్షన్లు అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా మున్సిపల్ స్కూలుకు వెళ్లి చేయించుకుంటున్నామమ్మా. పీడీ : మీ సమస్య అర్థమైంది. సొంత భవనాల విషయంపై చర్యలు తీసుకుంటాను. (మరో మహిళతో) నీ సమస్య ఏమిటమ్మా? మహిళ : మణి అండీ. నాలుగేళ్ల మా బాబు గౌతమ్ కిరణ్ రెండుకాళ్లూ చచ్చుబడిపోయాయి. నడవలేడు, మాట్లాడలేడు. చాలా మంది డాక్టర్లకు చూపించానమ్మా. క్రమేపీ నడుస్తాడని చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. పిల్లవాడికి పౌష్టికాహారం అందించలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ కేంద్రం ద్వారా ఇస్తున్న ఫుడ్ తీసుకొని పెడుతున్నాను. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలమ్మా. పీడీ : అధికారులకు నివేదించి సాధ్యమైనంత వరకు సాయమందేలా చూస్తాను. పొద్దుపోతోంది వెళ్లొస్తా... - ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, అనుసూరి ఆనందరావు, పళ్ల రమేష్‌బాబు అన్ని కేంద్రాలకూ శాశ్వత భవనాలు.. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్నీ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్ది అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనేదే మా లక్ష్యం. దశలావారీగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉన్నాం. 2013-14 లో 372 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు మంజూరు చేశాం. 2014-15లో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న కేంద్రాలకు అనువైన స్థలాలను సేకరిస్తున్నాం. ఐదేళ్లలో జిల్లాలోని అన్ని కేంద్రాలకూ పక్కా భవనాలు నిర్మించాలనేది లక్ష్యం. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే పట్టణాల్లో ఇప్పుడిస్తున్న రూ.3వేలను త్వరలో రూ.5 వేలకు పెంచే ప్రతిపాదన ఉంది. గ్రామాల్లో ఇంటి అద్దె కింద రూ.750 ఇస్తున్నాం. మానసిక వికలాంగులైన విద్యార్థులను గుర్తించి, అవసరమైన వైద్యసాయంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని బిడ్డకు, తల్లికి అందజేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న బియ్యం, పప్పులను మర ఆడించి నూనె కలుపుకొని తింటే గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా తయారవుతారు. తల్లి కడుపులోని బిడ్డకు ఏ విధమైన పౌష్టికాహార లోపం రాకూడదన్న ఉద్దేశంతో వారానికి అందజేస్తున్న నాలుగు గుడ్లు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే తల్లులు తినాలి. అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారాన్ని అందజేయకుంటే నా దృష్టికి తీసుకురండి. - పి.విజయలక్ష్మి, పీడీ -
అందరికీ ‘ఆసరా’
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం.. ఆ తర్వాత టీఆర్ఎస్ సర్కారు ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, విధివిధానాలు, పథకాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వంటి అంశాలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారారు. టీఆర్ఎస్ పాలన, నియోజకవర్గ అభివృద్ధి, ప్రస్తుత సమస్యలపై అక్కడి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, రైతులు, మత్స్యకార్మికులు, మహిళలను అడిగి తెలుసుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని ఆటోడ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యాను. పేదల కష్టాలు ఎట్లుంటయో తెలుసు. ప్రజల సంక్షేమమే ధ్యేయం. ‘సాక్షి’ వేదికగా నియోజకవర్గంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన సమస్యలపై స్పందిస్తా. నా స్థాయిలో ఉన్నవి తీరుస్తా. విధానాలకు సంబంధించిన వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. అన్నం పెట్టే అన్నదాతకు లో ఓల్టేజీ కరెంట్ కష్టాలు రావొద్దు. గానుగుపాడ్, వడ్లకొండ, బెక్కల్, మద్దూరులో సబ్స్టేషన్ల ఏర్పాటుతో సమస్యను పరిష్కరిస్తా. సబ్స్టేషన్ల కోసం స్థల సేకరణ వేగంగా జరుగుతోంది. నిత్యం జనానికి అందుబాటులో ఉంటా. కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేస్తా. - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం అర్హులకు అందుతుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బాల్దె విజయ : ‘ఆసరా’ అమలుతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మేలు జరుగుతుంది. గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇచ్చినా సరిపోక పోయేది. ఇప్పుడు ప్రభుత్వం వికలాంగులకు రూ.1500, మిగతా వారికి రూ.1000 ఇవ్వడం సంతోషంగా ఉంది. కొందరు అర్హులు పింఛన్ జాబితాలో పేరులేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అటువంటి వారికి పింఛన్ ఇవ్వాలి. ముత్తిరెడ్డి : ‘కాకతీయ మిషన్’ ద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నారా? మేకల కళింగరాజు : జనగామ నియోజకవర్గం మొదటి నుంచీ కరువు ప్రాంతమే. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువులను దేవాదుల నీటితో నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ‘కాకతీయ మిషన్’ ద్వారా చెరువుల్లోని పూడిక తీసి పొలాల్లో వేస్తే చెరువుల్లో నీటి నిల్వలు పెరుగుతారుు. అదేవిధంగా.. పంట పొలాలకు భూసారం పెరుగుతుంది. తద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ముత్తిరెడ్డి : చెరువులు నింపడం ద్వారా మత్స్యకారులకు మేలు జరుగుతుందా? చిన్నబోయిన నర్సయ్య : చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. అలాగే.. మత్స్యకారులకు రుణాలు ఇవ్వాలి. చేప విత్తనాలు ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది. ముత్తిరెడ్డి : హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుతో జనగామ ప్రాంతానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు? పరిశ్రమలకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉన్నాయా? బాల్దె సిద్ధులు : ఇండస్ట్రీయల్ కారిడార్‌తో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని నమ్ముతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రకటించిన కారిడార్నిర్ణయంపై యువత ఆశలు పెంచుకుంది. పరిశ్రమలకు సరిపడా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు పెంబర్తి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయాలి. ఇది రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం. ముత్తిరెడ్డి : రిజర్వాయర్ కాల్వలకు డెలివరీ పాయింట్స్ పెట్టారా? వ్యవసాయానికి లో ఓల్టేజీ సమస్య ఉందా? దాసరి రవి : గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెరువుల్లోకి దేవాదుల నీటి పంపింగ్‌లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అవసరమున్న చోట డెలివరీ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దేవాదుల నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపడం రైతుల్లో ఆనందం నింపుతోంది. నియోజకవర్గంలో ఉన్న లో ఓల్టేజీ సమస్యను నివారించాలి. ఇందుకు గానుగుపాడ్లో సబ్‌స్టేషన్, ట్రాన్స్పార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు వేగంగా చేయూలి. ముత్తిరెడ్డి : జనగామ ప్రజలకు మునిసిపాలిటీ ద్వారా పాకు రు నీళ్లు సరఫరా అయ్యేవి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? తిప్పారపు ఆనంద్ : జనగామ ప్రజలు పాకురు నీళ్లు తాగలేక కొన్ని నెలల క్రితం అవస్థలు పడ్డారు. చీటకోడూరు రిజర్వాయర్ శుద్ధికి చర్యలు తీసుకోవడంతో ప్రజలకు శుద్ధమైన నీళ్లు సరఫరా అవుతున్నాయి. ముత్తిరెడ్డి : చీటకోడూరు రిజర్వాయర్ నింపడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందా? ఏమైనా చెరువులు నింపారా? చిట్ల ఉపేందర్‌రెడ్డి : చీటకోడూరు రిజర్వాయర్ నింపడం ద్వారా భూగర్భజలాలు పెరిగాయి. రిజర్వాయర్ కాల్వ వెంట 170 మందికి పైగా రైతులు మోటార్లను బిగించుకుని పొలాలకు నీరు పారిచ్చుకున్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి 14 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ వెంట అశ్వరావుపల్లి రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేశారు. కాల్వ వెంట తెరిచిన తూములను మూసివేసేందుకు రైతులకు నచ్చజెప్పారు. రిజర్వాయర్ నిండిన తర్వాత చైడారం చెరువులను నింపడం సంతోషం. మిగతా చెరువులు నింపితే బాగుంటుంది. ముత్తిరెడ్డి : జనగామలోని 53/1 సర్వే నంబర్లో ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నాయూ? పరిష్కారం అవుతాయన్న నమ్మకం మీకు ఉందా? ఉల్లెంగల కృష్ణ : 53/1 సర్వే నంబర్లో ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారికి పట్టాలు రాలేదు. రుణాలు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలో సమస్య పరిష్కారమవుతుందని నమ్ముతున్నాం. ముత్తిరెడ్డి : జనగామ ఏరియా ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందుతుందా? సమస్యలు పరిష్కారమయ్యాయా? సేవెల్లి సంపత్ : గతంతో పోలిస్తే వైద్య సేవలు మెరుగయ్యాయి. వైద్యులు మెరుగైన విధంగా పనిచేయాలి. పీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం ఉంది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి వైద్యం అందించాలి. ముత్తిరెడ్డి : సీఎం సహాయ నిధితో ఏమైనా లబ్ధి..? మంద లక్ష్మణ్ : సీఎం సహాయ నిధి విషయంలో గతంలో నాయకులే దళారుల అవతారం ఎత్తేవారు. ఇప్పుడు అలా లేదు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.15 లక్షలకు పైగా నిధులు వచ్చినట్లు సమాచారం. ముత్తిరెడ్డి : పార్కుల పరిస్థితి ఎలా ఉంది? మేడబోయిన అనిత : పార్క్‌లు సేద తీరేందుకు అనువుగా లేవు. పార్కులను అభివృద్ధి చేసి వాడకంలోకి తేవాలి. ముత్తిరెడ్డి : మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఆత్మకూరి రాణి : గతంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షల రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచారు. మహిళా సమాఖ్య భవనాలు పూర్తి చేయూలి. మహిళలు ఎదిగేందుకు ఇంకా ప్రోత్సాహం అందించాలి. ముత్తిరెడ్డి : హస్తకళల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? మనకు పెంబర్తి ఉంది కదా? బుడిగె శ్రీనివాస్ : హస్త కళాకారులకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలి. కూర్చొని పనిచేయడం వల్ల నడుము, కాళ్ల నొప్పులు, కంటి చూపు సమస్యలు వస్తున్నారుు. దీని దృష్ట్యా 50 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. డీఆర్డీఏ ఆధ్వర్యంలో గతంలో ఇక్కడి కళాకారులు శిక్షణ పొందారు. బ్యాంకులు ఇచ్చే రుణాలు సరిపోవడం లేదు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల రుణాలివ్వాలి. కళాకారులు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలి. ప్రభుత్వ వైబ్‌సైట్ ఏర్పాటు చేసి ప్రచారం కల్పించాలి. మల్యాల వేణు : పెంబర్తి హస్త కళాక్షేత్రంలో వస్తువులు అమ్మకానికి(డిస్ప్లే) పెట్టే విషయంలో సమస్య ఉంది. రూ.20 లక్షల నిధులు కావాలి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. రుణాలు అందించి కళాకారులకు చేయూత నివ్వాలి. ముత్తిరెడ్డి : కొమురవెల్లి ఆలయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి : కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఆలయ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేయాలి. ముత్తిరెడ్డి : గొర్ల కాపరుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? కోరె మల్లేష్ : గొర్రెలను పేంచేందుకు గ్రామ శివార్లలో పోరంబోకు భూములు కేటాయించాలి. రుణాలు అందించి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి. ముత్తిరెడ్డి : మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా? బోళ్ల సంపత్, తిప్పారపు ఆనంద్ : అందుబాటులో ఉంటున్నాడు. గతంలో వారికంటే నయం. -
సేవలపై ఆరా.. సమస్యలపై దృష్టి
తెల్లకోటు.. చేతిలో మైకు ఉభయగోదావరి జిల్లాల నుంచి నిత్యం 2,000 మందికి పైగా రోగులు వచ్చే కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) అది. శనివారం ఉదయం 10.15 గంటల సమయంలో తెల్లకోటు వేసుకుని, చేతిలో ‘సాక్షి’ మైకు పట్టుకుని ఒక పెద్దాయన వార్డుల్లో కలయతిరుగుతూ రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, సాధకబాధకాలు ఆరా తీస్తున్నారు. వైద్యులను, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ‘చూస్తే డాక్టర్లా ఉన్నారు. చేస్తున్నదేమో విలేకరి డ్యూటీలా ఉంది’ అని అంతా ఆశ్చర్యపోతుండగానే పీడియాట్రిక్, పీడియాట్రిక్ డెంగీ, న్యూ బోరన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ప్రసూతి, మెడికల్, ఎనస్తీషియా, ఆర్థోపెడిక్, డెంగీ ప్రత్యేక వార్డులను చుట్టేశారు. ఆయనే డాక్టర్ పి.వెంకటబుద్ధ. ‘సాక్షి’ అభ్యర్థన మేరకు ‘వీఐపీ రిపోర్టింగ్’కు సమ్మతించిన ఆయన ఉదయం 10.15 గంటల నుంచి 11 గంటల వరకు ఆ పాత్రను పోషించారు. రోగుల సమస్యలను సావధానంగా ఆలకించారు. కేవలం ఆస్పత్రి అధిపతిగానే కాక ఒక వైద్యుడిగా స్పందించారు. ఆ వివరాలు... సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ : ఏంటయ్యా.. నీ బాధ.. ఏమైంది? రోగి బంధువు : సార్ నా పేరు లక్ష్మయ్యండి. మా అన్నయ్య పేరు అక్కయ్య. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. మా అన్నయ్యకు ఆరోగ్యం బాగా లేదు. 25 రోజుల కిందట ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాం సార్. మీరు సూపరింటెండెంట్ అని ఎవరో చెబితే పరుగెత్తుకు వచ్చాను సార్. నా అన్నకు ఏమైందని అడుగుతున్నా డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు. మీరే ఏదైనా సాయం చేయండి సార్. సూపరింటెండెంట్ : (ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ కె.లక్ష్మోజీనాయుడును ఉద్దేశించి)ఆ వివరాలు ఏమిటో చూడండి. (లక్ష్మయ్యను ఉద్దేశించి) డాక్టర్ గారికి వివరాలు చెప్పి వైద్యం చేయించుకోండి. సూపరింటెండెంట్ : అనస్థీషియా మేడమ్ గారూ.. బాగున్నారా? రోజుకు ఎన్ని ఎలక్టోరల్ సర్జరీలు చేస్తున్నారు? అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి : బాగున్నాను సార్. రోజూ 19 నుంచి 25 సర్జరీలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో 50కి పైగా సర్జరీలు చేస్తున్నాం. సూపరింటెండెంట్ : సమస్యలేమైనా ఉన్నాయా? డాక్టర్ : ఆర్ఐసీయూకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ సకాలంలో అందుబాటులోకి రావడం లేదు. ఆ ఒక్క ప్రాబ్లమ్‌ను రెక్టిఫై చేయండి సార్ చాలు. సూపరింటెండెంట్ : మెడికల్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగించండి. అన్నీ హెచ్ఓడీ చూసుకోవాలంటే కష్టం కదా. మెడిసిన్ విషయంలో డ్యూటీలో ఉండే మెడికల్ ఆఫీసర్‌ను కూడా ఇన్వాల్వ్ చేయండి. మీ సమస్య తీరిపోతుంది. వారు బాధ్యత తీసుకోకపోతే బాధ్యతలేని చోటకు పంపించేద్దాం ఓకేనా! సూపరింటెండెంట్ : -ఏమిటి.. ఆ గోడలపై పిచ్చిమొక్కలు అలా పెరిగిపోయాయి.. మీరేం చేస్తున్నారు? హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు : ఆ మొక్కలు పీకించమని చెప్పాను సర్. సూపరింటెండెంట్ : -మొక్కలను పీకేయడం కాదు, మళ్లీ పెరగకుండా కిరోసిన్ పోసి కాల్చండి. వెంకటేశ్వరరావు : అలాగే సర్. సూపరింటెండెంట్ : -ఇదేమిటి నేను వస్తున్నానని తెలిసి పీడియాట్రిక్ వార్డులో ఫినాయిల్ చల్లి శుభ్రం చేస్తారా.. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు? ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడండి. శానిటేషన్ సిబ్బంది : అన్నీ సక్రమంగా చూసుకుంటాం సార్. సూపరింటెండెంట్ : ఏమ్మా..! నీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు. చిన్నారి తల్లి : మమత సార్! ఆకివీడు నుంచి వచ్చామండి. సూపరింటెండెంట్ : ఎందుకు వచ్చారు? ఏమైంది. మమత : మా 12 నెలల బాబు కృపావరుణ్కు మెదపువాపు వ్యాధి వచ్చింది సార్. 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. సూపరింటెండెంట్ : వైద్యం బాగా అందుతోందా? మమత : ఫర్వాలేదు సార్.. బాగానే చూస్తున్నారు. సూపరింటెండెంట్ :(స్టాఫ్ నర్సును ఉద్దేశించి) ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎవరు? మెడికల్ ఆఫీసర్ ఎన్ఐసీయూలో ఉండాలి కదా. ఎక్కడికి వెళ్లిపోయారు. పిలవండి. సూపరింటెండెంట్ :ఏమ్మా! మీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నారి బంధువు : దారా శ్రీలక్ష్మి అయ్యా, కడియం నుంచి వచ్చామండి సూపరింటెండెంట్ : ఎందుకొచ్చారు? బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది? శ్రీలక్ష్మి : నాకు మొదటి కాన్పులోనే బిడ్డ బలహీనంగా పుట్టాడండి. మా ఊళ్లో డాక్టర్లు కాకినాడ తీసుకెళ్లమంటే తీసుకొచ్చాం. ఇప్పుడు ఫర్వాలేదండి. సూపరింటెండెంట్ : డాక్టర్లు బాగా చూస్తున్నారా? శ్రీలక్ష్మి : చూస్తున్నారండి. సూపరింటెండెంట్ : ఇబ్బందులేమైనా ఉంటే నా చాంబర్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. సరేనామ్మా..! (పీడియాట్రిక్ వైద్యురాలిని ఉద్దేశించి) మీకేమైనా సమస్యలున్నాయా చెప్పండి మేడమ్! పీడియాట్రిక్ డాక్టర్ మాణిక్యాంబ : సార్.. పీడియాట్రిక్ వార్డులో బాత్రూమ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోగులు, అంతా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా పరిష్కారం ఆలోచించండి సార్. సూపరింటెండెంట్ : వాటికి మరమ్మతులు చేయించాలి. ఏపీఎంఐడీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం లెండి. నేను వాళ్లకు చెబుతాను. వాళ్లు వచ్చి చూసి సమస్యను పరిష్కరిస్తారు. సూపరింటెండెంట్ : (ఓ బాలికను ఉద్దేశించి) ఏరా తల్లీ..నీ పేరు ఏంటి? ఏ ఊరు నుంచి వచ్చారు? బాలిక : స్రవంతి సర్, వాసాలరేవు నుంచి వచ్చాం. సూపరింటెండెంట్ : ఏమైంది నీకు? స్రవంతి : జరమొచ్చింది. సూపరింటెండెంట్ : ఇప్పుడు తగ్గిందా? స్రవంతి : తగ్గింది సర్ సూపరింటెండెంట్ : మందులు వేసుకుంటున్నావా? స్రవంతి : ఏసుకుంటున్నాను సర్ సూపరింటెండెంట్ : ఆస్పత్రిలో ఎవరైనా డబ్బులు అడిగారా? స్రవంతి తల్లి : లేదు సార్ (సూపరింటెండెంట్ : డెంగీ వార్డుకు వెళ్లారు) ఆ వార్డు వైద్యురాలుశ్రీదేవి : -సర్ మొత్తం 13 పాజిటివ్ కేసులున్నాయి. మిగిలిన వాటిని మరోసారి చూసి చెబుతాం. నర్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం సర్. సూపరింటెండెంట్ : -నర్సులు కావాల్సినంత మంది లేరు. డెంగీ వార్డుకు ప్రత్యేకంగా నర్సులు కేటాయిస్తే మిగిలిన విభాగాల్లో రోగులు ఇబ్బందులు పడతారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి నర్సులను పంపించాలని కోరదాం. (అక్కడి నుంచి ఆయన బాలింతల వార్డుకు వెళ్లారు) సూపరింటెండెంట్ : ఏమ్మా.. నీపేరేంటి? బాలింత : లక్ష్మీదుర్గ సార్ సూపరింటెండెంట్ : డెలివరీ ఎప్పుడు అయింది? లక్ష్మీదుర్గ : నాలుగు రోజుల క్రితం సార్. మగ బిడ్డ పుట్టాడు. సూపరింటెండెంట్ : ఆపరేషన్ చేశారా? లక్ష్మీదుర్గ : లేదుసార్.. నార్మల్ డెలివరీనే. సూపరింటెండెంట్ : సమస్యలేమైనా ఉన్నాయా? లక్ష్మీదుర్గ : ఏమీ లేవు సార్. సూపరింటెండెంట్ : ఆస్పత్రిలో 1500 మంది రోగులు ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సమస్యలు అడగడం సాధ్యం కాదు. మీ సమస్యలేమైనా ఉంటే నా ఆఫీసుకు వచ్చి చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, సరిగా వైద్యం చేయకపోయినా నాకు ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాను. సరేనా... (అక్కడి నుంచి ఆయన మెడికల్ వార్డుకు వెళ్లారు) సూపరింటెండెంట్ : ఏమిటది.. ఆమెను అలా వీల్‌చైర్‌పై మోసుకెళుతున్నారేమిటి? అలా అయితే రోగులు ఇబ్బందులు పడతారు కదా? ఆస్పత్రి సిబ్బంది : లిఫ్ట్ పనిచేయడం లేదు సర్, మేం కూడా మోయలేకపోతున్నాం సర్. లిఫ్ట్ బాగు చేయించండి. సూపరింటెండెంట్ : ఏపీఎంఐడీసీ ఇంజనీర్లతో మాట్లాడి, కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయిస్తాను. ట్రాలీతో పాటు కలిపి వెళ్లేలా ట్రాలీ లిఫ్ట్ ఏర్పాటు చేయిద్దాం. (అక్కడి నుంచి ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్లారు) సూపరింటెండెంట్ : ఏమిటయ్యా.. ఇలా పగిలిపోయింది. అంతగా పై నుంచి నీరు కారిపోతోంది. ఏమిటిదంతా.. శానిటేషన్ కాంట్రాక్టర్ ప్రతినిధి : శ్లాబ్ దెబ్బ తింది.. సరి చేస్తాం సర్. సూపరింటెండెంట్ : ఏమయ్యా! నీ పేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ బాధ ఏంటి? రోగి : తుమ్మలపల్లి దానియేలు సర్, ప్రత్తిపాడు మండలం రాచపల్లి నుంచి వచ్చానండి, కాలికి ఆపరేషన్ చేశారండి. సూపరింటెండెంట్ : ఎలా చూస్తున్నారమ్మా? దానియేలు భార్య రాజామణి : ఏం చూస్తున్నారయ్యా, రెండు రోజుల నుంచి ఇంజక్షన్ చేయడం లేదండి. సూపరింటెండెంట్ : అవసరమైతేనే ఇంజక్షన్ చేస్తారమ్మా, మందులిస్తున్నారు కదా అవి వాడండి. ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, మంత్రి సతీష్ ఫొటోలు : గరగ ప్రసాద్