కొండెక్కిన టెంకాయ
కొబ్బరికాయలు దేవస్థానం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశించి, అమలయ్యేలా గట్టి చర్యలు తీసుకుంటాను. అధిక ధరలకు అమ్మితే లెసైన్సు రద్దు చేయడానికి కూడా వెనుకాడను. వ్రతపురోహితులు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, అధికారులు, ఇతర సిబ్బంది కలిపి దాదాపు వెయ్యిమంది పనిచేస్తున్నారు. వారందరి సంక్షేమానికీ చర్యలు తీసుకుంటాను. ట్రస్టు బోర్డు సమావేశంలో చర్చించి అన్నదానం విస్తరిలో ప్రసాదం పెట్టేలా చూస్తాను. పుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో మరుగుదొడ్లు, స్నానపు గదులు, షామియానాలు ఏర్పాటు చేస్తాం. భక్తుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అభినందనీయం. - ఈరంకి జగన్నాథరావు ఈఓ (ఎఫ్‌ఏసీ)
ఈఓ జగన్నాథరావు : ఏమండీ మీపేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? వ్రతం, దర్శనం ఎలా జరిగాయి? మీరేమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
భక్తుడు : సార్ నా పేరు చలసాని రవీంత్రనాథ్ ఠాగూర్. విశాఖపట్నం నుంచి వచ్చామండి. వ్రతం, దర్శనం బాగానే జరిగిందండి. మీరేమో అధికారిలా ఉన్నారు. ‘సాక్షి’ మైకు పట్టుకున్నారు. ఏమనుకోనంటే ఒక్క సమస్య చెబుతాను.. ఒక్క కొబ్బరికాయ రూ.20 పెట్టి కొనాలంటే ఎలాగో మీరే చెప్పండి. ఇంత దారుణంగా అమ్ముతున్నారే. కొబ్బరికాయ, ఇతర సామగ్రి సెట్టుకు రూ.150 పైనే తీసుకొంటున్నారు. మాలాంటి మధ్యతరగతి వాళ్లకు ఇబ్బంది కదా సార్.. ఏదైనా ధరలు తగ్గించేలా చూడండి. కేశఖండన శాలలో సిబ్బంది రూ.10 డిమాండ్
చేస్తున్నారు. మీరే చర్యలు తీసుకోవాలి.
ఈఓ : ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. కొబ్బరికాయలతో పాటు ఇతర వస్తువుల ధరలు నియంత్రిస్తాను. (మరొకరితో) అబ్బాయి నీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? భోజనం క్యూలైన్‌లో ఉన్నారు కదా, ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండి చెప్పండి.
భక్తుడు : నాపేరు రామారావు. మాది కడియం సర్. ఇప్పటికే అరగంట నుంచి క్యూలైన్‌లోనే ఉన్నాం. ఇంత సమయం ఉండాలంటే వృద్ధులు, పిల్లల తల్లులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఈఓ : ఏమి చేస్తే ఆ ఇబ్బందులు తొలగిపోతాయో మీరే సూచించండి. అవకాశమున్న మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.
రామారావు : సర్.. వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
ఈఓ భోజన శాలలో) : బాబూ నీపేరేంటి ? మీదే ఊరు? భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయా?
భక్తుడు: నాపేరు శ్రీనివాస్ సర్. మా ఊరు తుని మండలం తేటగుంట సర్. భోజన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటే వెలితి.. గతంలో భోజనం విస్తరాకులో పెట్టేవారు. ఇప్పుడు పెట్టడం లేదు. ఆకులో పెడితే అదో సంతృప్తి సార్.. ఒక్కసారి ఆలోచించండి.
ఈఓ : ఇదివరకు ఆకులో ప్రసాదం వేయడం నిజమే. బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటాం.. సరేనా? (మరొకరితో) నీ పేరేమిటి, ఉద్యోగిలా ఉన్నావు, ఏ విభాగంలో పనిచేస్తున్నావు. అన్నదాన సత్రంలో ఏర్పాట్లు ఏమిటి? ఇబ్బందులేంటి?
ఉద్యోగి : గుడ్‌మార్నింగ్ సర్ నా పేరు భాస్కరరావు. భోజనశాలలో సూపరింటెండెంట్‌ను. పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తున్నారు. రెండు చోట్ల భోజన సత్రాలు నిర్వహిస్తున్నాం. భక్తులందరికీ ఒకే చోట పెట్టేలా భవనం ఉంటే బాగుంటుంది సర్,
ఈఓ : ఏమయ్యా నీపేరేమిటి? భోజనం వద్ద ఏమైనా ఇబ్బందికరంగా ఉందా?
భక్తుడు : నా పేరు వెంకటేశ్వరరావు సర్. భోజనం క్యూలైన్లలో ఎక్కువమంది ఉన్నప్పుడు కొందరు ఎండలో ఇబ్బంది పడుతున్నారు సర్. పాత భోజన శాల నుంచి కొత్త భోజనశాలకు మధ్య ఎండలో పిల్లలు మాడిపోతున్నారు సర్.
ఈఓ : రెండు చోట్లా భోజన ఏర్పాట్లకు, రెండింటికీ మధ్య షెడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. (మరొకరితో) మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? సత్యదేవుని వ్రతం, దర్శనం చేసుకున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
భక్తుడు : నాపేరు ఇల్ల సత్యనారాయణండీ. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం నుంచి వచ్చామండీ. నోములు బాగానే చేసుకున్నాం. దర్శనం కూడా బాగానే అయ్యింది. సౌకర్యాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి.
ఈఓ : మీకు ధన్యవాదాలు. స్వామివారిని మరోసారి దర్శించుకోండమ్మా. (మరొకరితో) మీపేరేంటి స్వామీ? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై సమస్యలేమైనా ఎదుర్కొన్నారా?
భక్తుడు : సర్ నాపేరు రాంబాబు. గన్నవరం నుంచి వచ్చాము. భక్తులకు మెట్ల మార్గంలో సరైన తాగునీటి ఏర్పాట్లు లేవు. అంతరాలయ దర్శనానికి రూ.100 టిక్కెట్టు మరీ ఎక్కువ సారూ. సాధారణ దర్శనం చేసుకున్నాం.
ఈఓ : ఆ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఓకేనా. (ప్రసాదం తయారీ విభాగంలో) నీ పేరేమిటి బాబూ? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం సెక్షన్లో పనిచేస్తున్నావు? ప్రసాదం తయారీ, ప్యాకింగ్‌లో ఇబ్బందులున్నాయా?
ఉద్యోగి : నమస్కారం సారూ. నా పేరు లింగంపల్లి చిన్నారావండీ. ప్రసాదం ప్యాకరుగా 1986 నుంచి పనిచేస్తున్నాను సర్. ప్రసాదం గతంలో పుల్లల పొయ్యిపై తయారయ్యేది. పాలు వినియోగించే వారు. ఎక్కువకాలం నిల్వ కోసం పాలు వేయడం మానేశారు.
ఈఓ : మీకు ఏప్రాతిపదికన వేతనం ఇస్తున్నారు?
ఉద్యోగి : అమ్మకం జరిగిన ప్యాకెట్టుపై 35 పైసల చొప్పున ఇస్తే మేమంతా పంచుకుంటున్నామండీ. కమీషన్ పద్ధతి తీసేసి జీతాలివ్వాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. కాస్త పుణ్యం కట్టుకోండయ్యా.
ఈఓ : ఎలాగూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామంటున్నారు కదా.. నేను కూడా నా వంతు ప్రయత్నిస్తాలే (మరొకరితో) ఏమయ్యా నీపేరు? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం కావిళ్లు మోస్తున్నావు? జీతమెంత?
ఉద్యోగి : నాపేరు నంబారు కాగితమ్మ. సుమారుగా 24 ఏళ్లుగా పనిచేస్తున్నా. కమీషన్‌గా నెలకు ప్రసాదం అమ్మకాన్ని బట్టి ఆరేడు వేలు వస్తోందయ్యా. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందయ్యా. ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామయ్యా.. కమీషన్ పెంచాలయ్యా.
ఈఓ : మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. (భక్తురాలితో) అమ్మా మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా?
భక్తురాలు : నాపేరు కృష్ణవేణి సార్, మాది రాజమండ్రి. వ్రతం, దర్శనం చేసుకున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదండీ.
- ప్రజెంటర్స్ :
లక్కింశెట్టి శ్రీనివాసరావు,
పోతుల జోగేష్, తోట చక్రధర్.
- ఫొటోలు : గరగ ప్రసాద్