సేవలపై ఆరా.. సమస్యలపై దృష్టి | VIP Reporting GGH Superintendent Doctor Venkata Buddha | Sakshi
Sakshi News home page

సేవలపై ఆరా.. సమస్యలపై దృష్టి

Published Sun, Nov 23 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

సేవలపై ఆరా.. సమస్యలపై దృష్టి

సేవలపై ఆరా.. సమస్యలపై దృష్టి

 తెల్లకోటు.. చేతిలో మైకు ఉభయగోదావరి జిల్లాల నుంచి నిత్యం 2,000 మందికి పైగా రోగులు వచ్చే కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) అది. శనివారం ఉదయం 10.15 గంటల సమయంలో తెల్లకోటు వేసుకుని, చేతిలో ‘సాక్షి’ మైకు పట్టుకుని ఒక పెద్దాయన వార్డుల్లో కలయతిరుగుతూ రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, సాధకబాధకాలు ఆరా తీస్తున్నారు. వైద్యులను, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ‘చూస్తే డాక్టర్‌లా ఉన్నారు. చేస్తున్నదేమో విలేకరి డ్యూటీలా ఉంది’ అని అంతా ఆశ్చర్యపోతుండగానే పీడియాట్రిక్, పీడియాట్రిక్ డెంగీ, న్యూ బోరన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ప్రసూతి, మెడికల్, ఎనస్తీషియా, ఆర్థోపెడిక్, డెంగీ ప్రత్యేక వార్డులను చుట్టేశారు. ఆయనే డాక్టర్ పి.వెంకటబుద్ధ. ‘సాక్షి’ అభ్యర్థన మేరకు ‘వీఐపీ రిపోర్టింగ్’కు సమ్మతించిన ఆయన ఉదయం 10.15 గంటల నుంచి 11 గంటల వరకు ఆ పాత్రను పోషించారు. రోగుల సమస్యలను సావధానంగా ఆలకించారు. కేవలం ఆస్పత్రి అధిపతిగానే కాక ఒక వైద్యుడిగా స్పందించారు.                                                
 ఆ వివరాలు...
 
 సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ : ఏంటయ్యా.. నీ బాధ.. ఏమైంది?
 రోగి బంధువు : సార్ నా పేరు లక్ష్మయ్యండి. మా అన్నయ్య పేరు అక్కయ్య. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. మా అన్నయ్యకు ఆరోగ్యం బాగా లేదు. 25 రోజుల కిందట ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాం సార్. మీరు సూపరింటెండెంట్ అని ఎవరో చెబితే పరుగెత్తుకు వచ్చాను సార్. నా అన్నకు ఏమైందని అడుగుతున్నా డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు. మీరే ఏదైనా సాయం చేయండి సార్.
 సూపరింటెండెంట్ : (ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ కె.లక్ష్మోజీనాయుడును ఉద్దేశించి)ఆ వివరాలు ఏమిటో చూడండి. (లక్ష్మయ్యను ఉద్దేశించి) డాక్టర్ గారికి వివరాలు చెప్పి వైద్యం చేయించుకోండి.
 సూపరింటెండెంట్ : అనస్థీషియా మేడమ్ గారూ.. బాగున్నారా? రోజుకు ఎన్ని ఎలక్టోరల్ సర్జరీలు చేస్తున్నారు?  
 అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి : బాగున్నాను సార్. రోజూ 19 నుంచి 25 సర్జరీలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో 50కి పైగా సర్జరీలు చేస్తున్నాం.
 సూపరింటెండెంట్ : సమస్యలేమైనా ఉన్నాయా?
 డాక్టర్ : ఆర్‌ఐసీయూకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ సకాలంలో అందుబాటులోకి రావడం లేదు. ఆ ఒక్క ప్రాబ్లమ్‌ను రెక్టిఫై చేయండి సార్ చాలు.
 సూపరింటెండెంట్ : మెడికల్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగించండి. అన్నీ హెచ్‌ఓడీ చూసుకోవాలంటే కష్టం కదా. మెడిసిన్   
 
 విషయంలో డ్యూటీలో ఉండే మెడికల్ ఆఫీసర్‌ను కూడా ఇన్‌వాల్వ్ చేయండి. మీ సమస్య తీరిపోతుంది. వారు బాధ్యత తీసుకోకపోతే బాధ్యతలేని చోటకు పంపించేద్దాం ఓకేనా!
 సూపరింటెండెంట్ : -ఏమిటి.. ఆ గోడలపై పిచ్చిమొక్కలు అలా పెరిగిపోయాయి.. మీరేం చేస్తున్నారు?
 హెల్త్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు : ఆ మొక్కలు పీకించమని చెప్పాను సర్.
 సూపరింటెండెంట్ : -మొక్కలను పీకేయడం కాదు, మళ్లీ పెరగకుండా కిరోసిన్ పోసి కాల్చండి.
 వెంకటేశ్వరరావు : అలాగే సర్.
 సూపరింటెండెంట్ : -ఇదేమిటి నేను వస్తున్నానని తెలిసి  పీడియాట్రిక్ వార్డులో ఫినాయిల్ చల్లి శుభ్రం చేస్తారా.. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు? ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడండి.
 శానిటేషన్ సిబ్బంది : అన్నీ సక్రమంగా చూసుకుంటాం సార్.
 సూపరింటెండెంట్ : ఏమ్మా..! నీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు.
 చిన్నారి తల్లి : మమత సార్!  ఆకివీడు నుంచి వచ్చామండి.
 సూపరింటెండెంట్ : ఎందుకు వచ్చారు? ఏమైంది.
 మమత : మా 12 నెలల బాబు కృపావరుణ్‌కు మెదపువాపు వ్యాధి వచ్చింది సార్. 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామండి.
 సూపరింటెండెంట్ : వైద్యం బాగా అందుతోందా?
 మమత : ఫర్వాలేదు సార్.. బాగానే చూస్తున్నారు.
 సూపరింటెండెంట్ :(స్టాఫ్ నర్సును ఉద్దేశించి) ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎవరు?  మెడికల్ ఆఫీసర్ ఎన్‌ఐసీయూలో ఉండాలి కదా. ఎక్కడికి వెళ్లిపోయారు. పిలవండి.
 సూపరింటెండెంట్ :ఏమ్మా! మీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు?
 చిన్నారి బంధువు : దారా శ్రీలక్ష్మి అయ్యా, కడియం నుంచి వచ్చామండి
 సూపరింటెండెంట్ : ఎందుకొచ్చారు? బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది?
 శ్రీలక్ష్మి : నాకు మొదటి కాన్పులోనే బిడ్డ బలహీనంగా పుట్టాడండి. మా ఊళ్లో డాక్టర్లు కాకినాడ తీసుకెళ్లమంటే తీసుకొచ్చాం. ఇప్పుడు ఫర్వాలేదండి.
 సూపరింటెండెంట్ : డాక్టర్లు బాగా చూస్తున్నారా?
 శ్రీలక్ష్మి : చూస్తున్నారండి.
 సూపరింటెండెంట్ : ఇబ్బందులేమైనా ఉంటే నా చాంబర్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. సరేనామ్మా..! (పీడియాట్రిక్ వైద్యురాలిని ఉద్దేశించి) మీకేమైనా సమస్యలున్నాయా చెప్పండి మేడమ్!
 పీడియాట్రిక్ డాక్టర్ మాణిక్యాంబ : సార్.. పీడియాట్రిక్ వార్డులో బాత్‌రూమ్‌లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోగులు, అంతా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా పరిష్కారం ఆలోచించండి సార్.
 సూపరింటెండెంట్ : వాటికి మరమ్మతులు చేయించాలి. ఏపీఎంఐడీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం లెండి. నేను వాళ్లకు చెబుతాను. వాళ్లు వచ్చి చూసి సమస్యను పరిష్కరిస్తారు.
 సూపరింటెండెంట్ : (ఓ బాలికను ఉద్దేశించి) ఏరా తల్లీ..నీ పేరు ఏంటి? ఏ ఊరు నుంచి వచ్చారు?
 బాలిక : స్రవంతి సర్, వాసాలరేవు నుంచి వచ్చాం.
 సూపరింటెండెంట్ : ఏమైంది నీకు?
 స్రవంతి : జరమొచ్చింది.
 సూపరింటెండెంట్ : ఇప్పుడు తగ్గిందా?
 స్రవంతి : తగ్గింది సర్
 సూపరింటెండెంట్ : మందులు వేసుకుంటున్నావా?
 స్రవంతి : ఏసుకుంటున్నాను సర్
 సూపరింటెండెంట్ : ఆస్పత్రిలో ఎవరైనా డబ్బులు అడిగారా?
 స్రవంతి తల్లి : లేదు సార్
 (సూపరింటెండెంట్ : డెంగీ వార్డుకు వెళ్లారు)
 ఆ వార్డు వైద్యురాలుశ్రీదేవి : -సర్ మొత్తం 13 పాజిటివ్ కేసులున్నాయి. మిగిలిన వాటిని మరోసారి చూసి చెబుతాం. నర్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం సర్.
 సూపరింటెండెంట్ : -నర్సులు కావాల్సినంత మంది లేరు. డెంగీ వార్డుకు ప్రత్యేకంగా నర్సులు కేటాయిస్తే మిగిలిన విభాగాల్లో రోగులు ఇబ్బందులు పడతారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి నర్సులను పంపించాలని కోరదాం. (అక్కడి నుంచి ఆయన బాలింతల వార్డుకు వెళ్లారు)
 సూపరింటెండెంట్ : ఏమ్మా.. నీపేరేంటి?
 బాలింత : లక్ష్మీదుర్గ సార్
 సూపరింటెండెంట్ : డెలివరీ ఎప్పుడు అయింది?
 లక్ష్మీదుర్గ : నాలుగు రోజుల క్రితం సార్. మగ బిడ్డ పుట్టాడు.
 సూపరింటెండెంట్ : ఆపరేషన్ చేశారా?
 లక్ష్మీదుర్గ : లేదుసార్.. నార్మల్ డెలివరీనే.
 సూపరింటెండెంట్ : సమస్యలేమైనా ఉన్నాయా?
 లక్ష్మీదుర్గ : ఏమీ లేవు సార్.
 సూపరింటెండెంట్ : ఆస్పత్రిలో 1500 మంది రోగులు ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సమస్యలు అడగడం సాధ్యం కాదు. మీ సమస్యలేమైనా ఉంటే నా ఆఫీసుకు వచ్చి చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, సరిగా వైద్యం చేయకపోయినా నాకు ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాను. సరేనా... (అక్కడి నుంచి ఆయన మెడికల్ వార్డుకు వెళ్లారు)
 సూపరింటెండెంట్ : ఏమిటది.. ఆమెను అలా వీల్‌చైర్‌పై మోసుకెళుతున్నారేమిటి? అలా అయితే రోగులు ఇబ్బందులు పడతారు కదా?
 ఆస్పత్రి సిబ్బంది : లిఫ్ట్ పనిచేయడం లేదు సర్, మేం కూడా మోయలేకపోతున్నాం సర్. లిఫ్ట్ బాగు చేయించండి.
 సూపరింటెండెంట్ : ఏపీఎంఐడీసీ ఇంజనీర్లతో మాట్లాడి, కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయిస్తాను. ట్రాలీతో పాటు కలిపి వెళ్లేలా ట్రాలీ లిఫ్ట్ ఏర్పాటు చేయిద్దాం. (అక్కడి నుంచి ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్లారు)
 సూపరింటెండెంట్ : ఏమిటయ్యా.. ఇలా పగిలిపోయింది. అంతగా పై నుంచి నీరు కారిపోతోంది. ఏమిటిదంతా..
 శానిటేషన్ కాంట్రాక్టర్ ప్రతినిధి : శ్లాబ్ దెబ్బ తింది.. సరి చేస్తాం సర్.
 సూపరింటెండెంట్ : ఏమయ్యా! నీ పేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ బాధ ఏంటి?
 రోగి : తుమ్మలపల్లి దానియేలు సర్, ప్రత్తిపాడు మండలం రాచపల్లి నుంచి వచ్చానండి, కాలికి ఆపరేషన్ చేశారండి.
 సూపరింటెండెంట్ : ఎలా చూస్తున్నారమ్మా?
 దానియేలు భార్య రాజామణి : ఏం చూస్తున్నారయ్యా, రెండు రోజుల నుంచి ఇంజక్షన్ చేయడం లేదండి.
 సూపరింటెండెంట్ : అవసరమైతేనే ఇంజక్షన్ చేస్తారమ్మా, మందులిస్తున్నారు కదా అవి వాడండి.
 ప్రజెంటర్స్ :
 లక్కింశెట్టి శ్రీనివాసరావు, మంత్రి సతీష్
 ఫొటోలు : గరగ ప్రసాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement