మన ఎలుకల మిత్రులందరికీ ఇదే నా ఆహ్వానం. ఇప్పటికే పంట పొలాల్లో లింగాకర్షక బుట్టలు, మందులూ అంటూ రైతులు మన ఉసురు తీస్తున్నారు. భయపడుతూ అక్కడ బతకొద్దు. ఎలుకలకు సమృద్ధిగా ఆహారం, చక్కగా నివాసం, రక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తున్న గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రికి రండి. ఇక్కడ ఓ పసిపిల్లాడిని కొరికికొరికి చంపేసినా, ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖా మంత్రివర్యులే సెలవిచ్చినా ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. అందుకే యథేచ్ఛగా వార్డులన్నీ తిరిగేస్తున్నాం. కావల్సిన రోగుల్ని పీక్కుతింటున్నాం. ఆస్పత్రిలో మనదే రాజ్యం. మిత్రులారా త్వరగా వచ్చేయండి. జీజీహెచ్‌లో హాయిగా జీవించేద్దాం.
గుంటూరు మెడికల్: ‘అయ్యా డాక్టర్ గారూ వార్డులో చికిత్స కోసం వారం రోజుల క్రితం చేరాం.వార్డుల్లో పడకలపైకి సైతం ఎలుకలు వచ్చి కరుస్తున్నాయి. వార్డులో ఉండాలంటే భయంగా ఉంది అంటూ పలువురు రోగులు గుంటూరు జీజీహెచ్‌లో ఈ నెల పదో తేదీన ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎలుకలు తిరుగుతోంది క్యాన్సర్ వార్డు రోగులు కావడంతో సూపరింటెండెంట్ అవ్వాక్కయారు. ఈ ఫిర్యాదు అందిన ఐదు రోజుల్లోనే 15వ తేదీన ఆస్పత్రిలో జరిగిన ఇన్‌ఫెక్షన్ నియంత్రణ కమిటీ సమావేశంలో సైతం పలువురు వైద్యులు, వైద్య విభాగాధిపతులు ఎలుకల బెడత గురించి, దోమల మోత గురించి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజూ 10 నుంచకి 20 వరకు ఎలుకలు పట్టుబడుతూ ఉన్నాయి.
ఎలుకల నియంత్రణ అంతంతమాత్రమే
గుంటూరు జీజీహెచ్‌లో 2015 ఆగష్టులో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందటంతో ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్‌ను తొలగించి పద్మావతి హాస్పిటల్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అనే సంస్థకు సెక్యూరిటీ, శానిటేషన్, క్రిమి కీటకాల నియంత్రణ బాధ్యతలను టెండర్లు ద్వారా అప్పగించింది. గతంలో ఉన్న కాంట్రక్టర్‌కు రూ. 17 లక్షలు చెల్లించిన ప్రభుత్వం పద్మావతి సంస్థకు రూ. 40 లక్షలకుపైగా చెల్లించింది. అయినా ఎలుకలు, పాములు ప్రత్యక్షమవ్వటంతో ప్రభుత్వం పద్మావతి సంస్థకు టెండర్ రద్దు చేసింది. అనంతరం సెక్యూరిటీ జైబాలజీకి, శానిటేషన్ ఏ1కు అప్పగించి కేవలం క్రిమికీటకాల బాధ్యతలను పద్మావతి సంస్థకు అప్పగించింది. 2016 మే నుంచి ఆస్పత్రిలో ఎలుకలు, క్రిమికీటకాల నియంత్రణ బాధ్యతలు పద్మావతి సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ప్రభుత్వం నెలకు రూ. 3,10,876 చెల్లిస్తోంది. అయితే సంస్థ పని తీరు సక్రమంగా లేకపోవటం వల్లే మళ్లీ నేడు ఎలుకలు వార్డులో తిరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ప్రతిష్ట దిగజారినా
ఎలుకల వల్లే 2015లో గుంటూరు జీజీహెచ్ ప్రతిష్ట మసకబారిపోయి దేశ వ్యాప్తంగా జీజీహెచ్ గురించి నెగిటివ్‌గా చర్చించుకున్నారు. ఎలుకల వల్ల దిగజారిన ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆస్పత్రిలో మోకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అనేక సందర్భాల్లో సభల్లో ప్రస్తావించారు. ఆస్పత్రి అధికారుల వైఖరి వల్ల మరలా ఎలుకలు ఆస్పత్రిలో వీర విహారం చేస్తున్నాయి. ఎలుకల నియంత్రణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన బుట్టలు కూడా అన్ని చోట్లా లేవు. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ కూడా రెగ్యులర్‌గా చేయకుండా మిన్నకుండి పోవటం వల్లే దోమలు విపరీతంగా పెరిగి రాత్రి వేళల్లో రోగులు వార్డులో ఉండలేని దుస్థితి నెలకొంది. రోగులు ఫిర్యాదులు చేసినా, వైద్యులు, వైద్య సిబ్బంది ఫిర్యాదులు చేసినా ఆస్పత్రి అధికారులు మాత్రం పద్మావతి సంస్థపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు ఎలుకలు, క్రిమికీటకాల నియంత్రణ కోసం సరైన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment