మందుల్లేవ్!
నో స్టాక్
- గుంటూరు జీజీహెచ్‌లో మందుల్లేక రోగుల ఇక్కట్లు
- ఆస్పత్రి ప్రారంభించినప్పటి బడ్జెట్టే నేటికీ అమలు..
- రోగులు పెరుగుతున్నా బడ్జెట్ పెంచని ప్రభుత్వం
- తక్కువ ధర మందులైతేనే.. లేదంటే బయట కొనాల్సిందే!
- టెండర్లు పిలిచే వరకు రోగులకు తప్పని అవస్థ
సాక్షి, గుంటూరు : అపర సంజీవనిగా పేరొందిన ఆస్పత్రిలోనే మందుల కొరత వెంటాడుతోంది. కోస్తాంధ్ర ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంలో చూపించుకుని వెళ్దామని వచ్చిన వారికి కూడా మందులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వార్డుల్లో చేరిన వారి పరిస్థితి మరింత దారుణం. మందుల కొనుగోలుకు ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు కేటాయించిన బడ్జెట్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో రెట్లు రోగులు పెరిగినా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆ స్థాయిలో మందులు రాక పోవడంతో వైద్యాధికారులు సైతం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
ధర తక్కువైతే ఇక్కడ.. లేదంటే బయట..
జీజీహెచ్‌కి వివిధ సమస్యలతో నిత్యం వేలాది మంది పేద రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో 1175 పడకలు ఉన్నప్పటికీ అవి కూడా చాలక ఒక్కొక్క బెడ్‌కు ఇద్దరు చొప్పున రోగులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. వార్డుల్లో రోగులకు వైద్యుల సూచనల మేరకు మందులు వేయాల్సిన స్టాఫ్ నర్సులు అవి తమ వద్ద లేవని బయట కొనుక్కోమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు.
ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన పేద రోగులు, వారి బంధువులు మందులు బయట కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఏవో తక్కువ ధరకు దొరికే మందులు మాత్రం ఆసుపత్రిలో ఉంటున్నాయని, అధిక ధరవైతే స్టాక్ లేవని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు.
సూపర్ స్పెషాలిటీ వార్డుల్లో మరింత తీవ్రం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా కాని మందులను హెచ్‌డీఎస్ నిధుల ద్వారా కొనుగోలు చేసే వీలుంటుంది. కానీ అవి టెండర్ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ టెండర్లు ఏడు నెలలుగా పిలవకపోవడంతో ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రమయింది. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్ వంటి విభాగాల్లో మందుల కొరత క్కువగా ఉందని చెబుతున్నారు. వీటిని బయట కొనుగోలు చేయాలంటే అధిక ధరలు ఉంటాయని, దీంతో పేద ప్రజలకు భారంగా మారుతుందని పలువురు ఆక్షేపిస్తున్నారు.
మందులపై పర్యవేక్షణ కరవు... మందుల స్టాక్ రూమ్ నుంచి వివిధ వార్డులకు రోజూ మందులు సరఫరా అవుతుంటాయి. ఆ మందులు ఎవరికి వేశారనేది ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి. ఆ మందులు ఏ రోగికి వినియోగించారో రోజూ ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలియజేస్తే కావాల్సిన మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించే వీలు ఉంటుంది.
ఏ వార్డులో ఎన్ని మందులు ఉన్నాయి. ఏయే మందులు ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియడంలేదు. రోజూ ఎవరో ఒక ఉన్నతాధికారి వార్డులను పరిశీలించి అక్కడ ఏయే మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. రోగులకు అందుబాటులేని మందులను కొనుగోలు చేసి అందించే అవకాశం ఉంటుంది.
కొరత గుర్తించి కొనుగోలు చేస్తున్నాం.. జీజీహెచ్‌లో మందుల కొరత తలెత్తుతూనే ఉంది. వాటిని గుర్తించి వెంటనే కొనుగోలు చేస్తున్నాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి కొన్ని మందులు రానప్పుడు టెండర్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కొన్ని నెలలుగా టెండర్‌లు పెండింగ్‌లో పడ్డాయ్. దీనిపై కలెక్టర్‌కు లేఖ రాస్తాం. రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి.- డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్