- శాక్స్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్
మందుల కొరత లేకుండా చర్యలు
Published Mon, Jan 30 2017 12:14 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
తాడితోట (రాజమహేంద్రవరం) :
ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (శాక్స్)S జాయింట్ డైరెక్టర్ పి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వాహణ తీరును ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మందుల కొరత ఏర్పడిందని, ఉద్యోగులకు మూడు నెలల పాటు జీతాలు చెల్లిచలేకపోయామన్నారు. దేశంలో పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించేందు పల్స్‌పోలియో చేపట్టినా గత ఏడాది హైదరాబాద్‌లోని నీటి కుంటలలోని నీటి పరీక్షించినపుడు పోలియో క్రిమి ఉన్నట్లు గుర్తించారని, అది వినియోగించిన సిరంజిల ద్వారా వచ్చినట్లు గుర్తించారని తెలిపారు. దేశంలో పోలియో లేకపోయినా పొరుగుదేశాల్లో ఉందని, అక్కడికి రాకపోకలు సాగించేవారి నుంచి వ్యాధి రాకుండా ఉండడానికే పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు. రెండో విడత ఏప్రిల్ 2 న నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల పనితీరు, శుభ్రత, రోగులకు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. జిల్లాలో రెండు రోజులు గా ఆస్పత్రులకు పరిశీలిస్తున్నామని శనివారం అమలాపురం, రామచంద్రపురాల్లో పరిశీలించామన్నారు. ఆదివారం రంపచోడవరం, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది హెచ్‌ఐవి రోగులు
రాష్ట్ర వ్యాప్తంగా 1.2 లక్షల మంది హెచ్‌ఐవి రోగులు ఉన్నారని, వారిలో 40 వేల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. 70 వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మెడికల్ స్టోర్స్‌ను విజయవాడకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఏఆర్‌టీ సెంటర్ నిర్వాహణ అధ్వానంగా ఉందన్నారు. 2012 నుంచి ఇక్కడ రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ప్రస్తుతం మరో వైద్యుడిని ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఏఆర్‌టీ సెంటర్‌లో రికార్డులు పూర్తి స్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. క్వాలిటీ ప్రాసెసింగ్ సీనియర్ అధికారి ప్రభాకరరావు, కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ భువన కుమార్, డీసీహెచ్ డాక్టర్ రమేష్ కిషోర్, ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మశ్రీ పాల్గొన్నారు.
Advertisement