స్వచ్ఛ ఆసుపత్రి దిశగా... జీజీహెచ్
-
పరిసరాల పరిశుభ్రత కోసం డస్ట్ బిన్నులు, ఉమ్మి తొట్టెల ఏర్పాటు
కాకినాడ వైద్యం:
పరిసరాల పరిశుభ్రత ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న జాతిపిత మహ్మత్మాగాంధీ ఆశయ సాధన కోసం జీజీహెచ్ సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకున్నారు.
.
పరిసరాల పరిశుభ్రత కోసం చర్యలు
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలి వస్తూంటారు. నిత్యం ఇక్కడ వైద్యసేవల కోసం సుమారు 3 వేలు దాకా రోగులు వస్తూంటారు. ఆసుపత్రిలో అధికారికంగా ఉన్న 1065 బెడ్లకు 1,800 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఉపయోగించే మందులు, మాస్క్‌లు, గ్లౌజులు, క్లాత్, ఐవీలు,టాబ్లెట్ల స్టిప్పులు, ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు వాడి పారేసిన చెత్త, వ్యర్థాలు కలిపి రోజుకి సుమారు 3 టన్నుల వరకూ చేరుతున్నట్టు శానిటేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి నిల్వ కోసం ఆసుపత్రి డంపింగ్ యార్డు ఆవరణలో కాకినాడ నగరపాలక సంస్థ రెండు డంపర్లను ఏర్పాటు చేసింది. ఆసుపత్రి పరిసరాల్లో రోజురోజుకీ పెరిగిపోతుండడంతో రోగులు మరింత అనారోగ్యాలకు గురవుతారనే ఉద్దేశంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు పలు ప్రధానమైన వార్డుల బయట డస్ట్ బిన్నులు, ఉమ్మి తొట్టెలను ఏర్పాటు చేయించారు. రోగులతోపాట వస్తున్న రోగుల సహాయకులు చెత్త బుట్టల్లోనే వ్యర్థాలు వేయాలని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మి ఉమ్మరాదని, అలా చేయడం వల్ల గాలి ద్వారా వైరస్ సోకి మరింత మంది అనారోగ్యాలకు గురవుతారని అవగాహన కల్పిస్తున్నారు.
.
పరిసరాల పరిశుభ్రతకు దోహదం
ఆసుపత్రి ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేసిన తొట్టెలు పరిసరాల పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఆసుపత్రికొచ్చే రోగులు, సహాయకులు చెత్తా, వ్యర్థాలను బయట వేయకూడదు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సామాజిక బాధ్యతతో సహకరించాలి. - పలివెల వీరబాబు, సీపీఎం నగర కార్యదర్శి,కాకినాడ
.
అందుబాటులో ఏర్పాటు చేశారు
చెత్తా, వ్యర్థాలు వేసేందుకు అందుబాటులో డస్ట్ బిన్నులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మితొట్టెల ఏర్పాటు చేయడం మంచి పరిణామం. - జి.దుర్గాప్రసాద్ ,ప్రతాప్‌నగర్
.
స్వచ్ఛాసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు
కాకినాడ ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ సహకారంతో స్వచ్ఛాసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలపై రోగులు, సహాయకులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నా.
- డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్
.