ఆధునిక హంగులు | Modern arrangements | Sakshi
Sakshi News home page

ఆధునిక హంగులు

Published Mon, Dec 29 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

ఆధునిక హంగులు

ఆధునిక హంగులు

కర్నూలు వైద్య కళాశాల (కేఎంసీ). రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన వైద్యులను తీర్చిదిద్దిన ఘనతను సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవాలంటే.. ముందుగు గుర్తొచ్చే కళాశాల ఇదే. 100 ఎకరాల విస్తీర్ణం.. అత్యుత్తమ ప్రమాణాలు.. నిష్ణాతులైనప్రొఫెసర్లు.. ఫ్యాకల్టీకి పెట్టింది పేరు కేఎంసీ. రెండున్నరేళ్ల క్రితం ప్రిన్సిపాల్‌గా డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాయిలో కర్నూలు వైద్య కళాశాలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
 
  వైద్య విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించడంలో కీలకభూమిక పోషించారు.  కర్నూలు ప్రభుత్వాసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టింగ్ చేశారు. వైద్య కళాశాలలోని హాస్టళ్లను స్వయంగా పరిశీలించి..  వైద్య విద్యార్థులసమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి హామీ ఇస్తూ..  అభివృద్ధిపై తన అంతరంగం ఆవిష్కరించారు.
 
  ప్రిన్సిపాల్ : నీ పేరేంటి ? సమస్యలేమైనా ఉన్నాయా?
 విద్యార్థిని : సార్.. నా పేరు స్రవంతి. 2013 బ్యాచ్. మెస్‌లో టోకెన్ విధానం తీసుకురావాలి. సెలవుల్లో లేదా మూడు, నాలుగు రోజులు ఇంటికి వెళితే ఆ రోజులకు సంబంధించి మెస్ డబ్బు తిరిగివ్వడం లేదు.
  ప్రిన్సిపాల్ : మెన్స్ హాస్టల్‌లో సమస్య లేదు. అక్కడ విద్యార్థుల తరఫున కార్యదర్శి ఉంటాడు. మహిళా హాస్టల్ సమస్య నా దృష్టికి రాలేదు. సమస్య ఎక్కడుందో తెలుసుకుని పరిష్కరిస్తా.
 
  ప్రిన్సిపాల్ : హాస్టల్ పరంగా ఇంకా ఏమైనా సమస్యలున్నాయా ?
  నివేదిత, విద్యార్థిని : హాస్టల్ గదులకు బాడుగ రూ.700 వసూలు చేస్తున్నారు. ఎక్కువగా ఉంది. ఒక్కో గదిలో ముగ్గురు, నలుగురు ఉండటం ఇబ్బందికరం. సంఖ్య తగ్గిస్తే చదువుకునేందుకు వీలుగా ఉంటుంది.
 
  ప్రిన్సిపాల్ : సమస్య వాస్తవమే. కళాశాలలో సీట్ల సంఖ్య పెరిగినా.. అందుకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించాల్సి ఉంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆసుపత్రి ప్రాంగణంలోనే కొత్తగా పీజీ హాస్టళ్ల భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
 
  డాక్టర్ చందన, అనస్తీషియా వైద్య విద్యార్థిని :  సార్. హాస్టల్‌లో మంచినీటి సమస్య ఉంది. యూజీ హాస్టల్ నుంచి తెచ్చుకుంటున్నాం.
 
  ప్రిన్సిపాల్ : వెంటనే పరిష్కరిస్తా. కళాశాల డెవలప్‌మెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్తా. స్వచ్ఛమైన నీటిని అందించే ఏర్పాటు చేస్తా.
 
  ప్రిన్సిపాల్ : అమ్మాయి(రాజరాజేశ్వరి) స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటున్నావా ?
  విద్యార్థిని : సార్.. ప్రతి శనివారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటున్నాం. సూపర్ స్పెషాలిటీ వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా శుభ్రపరుస్తున్నాం. చెత్తను తొలగిస్తున్నాం.
 
  డాక్టర్ లక్ష్మీప్రియ : సార్ సి.బ్లాక్ అధ్వానంగా ఉంది. వర్షం వస్తే నరకం కనిపిస్తోంది.
 ప్రిన్సిపాల్ : చాలా ఏళ్ల క్రితం నిర్మించిన క్వార్టర్లు కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. సి-బ్లాక్ సమస్యను వెంటనే ఇంజినీరింగ్(ఏపీఎంఎస్‌ఐడీసీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయిస్తా.
 
  డాక్టర్ భానుప్రదీప్(పీజీ వైద్య విద్యార్థి) : మెన్స్ హాస్టల్‌లో 60 గదులున్నా చాలడం లేదు. రెండో అంతస్తు అధ్వానంగా తయారైంది. వంటగది నిరుపయోగంగా మారింది. రీడింగ్ రూమ్, కారు షెడ్డు, స్పోర్ట్స్ సౌకర్యాలు కల్పించాలి.
 
  ప్రిన్సిపాల్ : కర్నూలు వైద్య కళాశాలకు 120 నుంచి 150 సీట్లు పెరిగాయి. గదుల కొరత ఉంది. పాత బ్లాక్ కావడంతో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే డీఎంఈకి సమస్యను విన్నవించా. అదనంగా 20 గదులు నిర్మిస్తాం. పీజీ క్వార్టర్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. క్వార్టర్లలో మౌలిక సదుపాయాలు, కారుషెడ్డు, పార్కింగ్ సమస్య పరిష్కరిస్తా.
 
 డాక్టర్ భరత్ : పీజీ, యూజీ సీట్లు పెంచారు. వైద్య విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయినా గదుల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. హాస్టల్ ప్రాంగణంలోనే బయటి వ్యక్తులు మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ సమస్య ఉంది.
  ప్రిన్సిపాల్ : 1500 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆధునీకరిస్తాం. విద్యుత్ అధికారులతో మాట్లాడతా. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ భారత్‌లో ప్రతి పీజీ వైద్య విద్యార్థి పాల్గొనాలి.
 
 డాక్టర్ పృధ్వీరాజ్(వైద్య విద్యార్థి): వీధిలైట్లు లేవు. సెక్యూరిటీ కరువైంది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
 
  ప్రిన్సిపాల్ : ఇంటర్నల్ రోడ్లు వేయిస్తాం. సూపరింటెండెంట్‌తో మాట్లాడతా. సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం. వీధి లైట్లు వేయిస్తాం.
 
 బి.లింగేశ్వరి(వైద్య విద్యార్థిని): మెడికల్ కళాశాల అంతర్గత గేటు సాయంత్రం 4 గంటలకే మూసేస్తున్నారు. చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. స్టైఫెండ్ అందడం లేదు.
  ప్రిన్సిపాల్ : భద్రత చర్యల్లో భాగంగా సాయంత్రం త్వరగా మూసేస్తున్నాం. బడ్జెట్ వస్తే స్టైఫెండ్ సమస్య పరిష్కారమవుతుంది.
 
  సమష్టి కృషితో కర్నూలు వైద్య కళాశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. అత్యుత్తమ ఫ్యాకల్టీతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. యూజీ సీట్లు 150 నుంచి 200, పీజీ సీట్లు 60 నుంచి 96కు పెంచగలిగాం. క్యాంపస్‌లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ మెరుగుపరిచాం. ఎంసీహెచ్ బ్లాక్ మంజూరైంది. రూ.8కోట్లతో మెటర్నిటీ బ్లాక్ పూర్తయింది. వైద్య విద్యార్థుల సౌకర్యార్థం నెట్ జర్నల్ ఏర్పాటు చేశాం. బాస్కెట్ బాల్ కోర్టు, జిమ్, వీడియో కాన్ఫరెన్స్ రూము ఏర్పాటుకు కృషి చేస్తున్నా. ఇందుకోసం రూ.75 లక్షలు వెచ్చించనున్నాం. 13వ ఆర్థిక సంఘం నిధులతో పరిపాలన భవనం నిర్మించాల్సి ఉంది. ఆసుపత్రి ప్రాంగణంలోనే పీజీ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తాం. రూ.5 కోట్లతో పారా మెడికల్ కోర్సులకు సంబంధించి భవన నిర్మాణం, సౌకర్యాల కల్పనకు రూ.5 కోట్లు వెచ్చిస్తున్నాం.
 - ‘వీఐపీ రిపోర్టర్’
 డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్, కేఎంసీ ప్రిన్సిపాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement