అందరికీ ‘ఆసరా’ | MLA muthireddy yadagiri reddy reporter by sakshi | Sakshi
Sakshi News home page

అందరికీ ‘ఆసరా’

Published Mon, Dec 8 2014 4:10 AM | Last Updated on Tue, Oct 30 2018 5:26 PM

అందరికీ ‘ఆసరా’ - Sakshi

అందరికీ ‘ఆసరా’

తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం.. ఆ తర్వాత టీఆర్‌ఎస్ సర్కారు ఏర్పడి  ఆరు నెలలు అవుతోంది. కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, విధివిధానాలు, పథకాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వంటి అంశాలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారారు. టీఆర్‌ఎస్ పాలన, నియోజకవర్గ అభివృద్ధి, ప్రస్తుత సమస్యలపై అక్కడి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, రైతులు, మత్స్యకార్మికులు, మహిళలను అడిగి తెలుసుకున్నారు.
 
 కష్టాన్ని నమ్ముకుని ఆటోడ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యాను. పేదల కష్టాలు ఎట్లుంటయో తెలుసు. ప్రజల సంక్షేమమే ధ్యేయం. ‘సాక్షి’ వేదికగా నియోజకవర్గంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన సమస్యలపై స్పందిస్తా. నా స్థాయిలో ఉన్నవి తీరుస్తా. విధానాలకు సంబంధించిన వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. అన్నం పెట్టే అన్నదాతకు లో ఓల్టేజీ కరెంట్ కష్టాలు రావొద్దు. గానుగుపాడ్, వడ్లకొండ, బెక్కల్, మద్దూరులో సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో సమస్యను పరిష్కరిస్తా. సబ్‌స్టేషన్ల కోసం స్థల సేకరణ వేగంగా జరుగుతోంది. నిత్యం జనానికి అందుబాటులో ఉంటా. కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేస్తా.       - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

 
‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం అర్హులకు అందుతుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
బాల్దె విజయ : ‘ఆసరా’ అమలుతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మేలు జరుగుతుంది. గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇచ్చినా సరిపోక పోయేది. ఇప్పుడు ప్రభుత్వం వికలాంగులకు రూ.1500, మిగతా వారికి రూ.1000 ఇవ్వడం సంతోషంగా ఉంది. కొందరు అర్హులు పింఛన్ జాబితాలో పేరులేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అటువంటి వారికి పింఛన్ ఇవ్వాలి.
 
ముత్తిరెడ్డి : ‘కాకతీయ మిషన్’ ద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నారా?
మేకల కళింగరాజు : జనగామ నియోజకవర్గం మొదటి నుంచీ కరువు ప్రాంతమే. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువులను దేవాదుల నీటితో నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ‘కాకతీయ మిషన్’ ద్వారా చెరువుల్లోని పూడిక తీసి పొలాల్లో వేస్తే చెరువుల్లో నీటి నిల్వలు పెరుగుతారుు. అదేవిధంగా.. పంట పొలాలకు భూసారం పెరుగుతుంది. తద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నాం.
 
ముత్తిరెడ్డి : చెరువులు నింపడం ద్వారా మత్స్యకారులకు మేలు జరుగుతుందా?
చిన్నబోయిన నర్సయ్య :
చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. అలాగే.. మత్స్యకారులకు రుణాలు ఇవ్వాలి. చేప విత్తనాలు ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది.
 
ముత్తిరెడ్డి :
హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుతో జనగామ ప్రాంతానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు? పరిశ్రమలకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉన్నాయా?
బాల్దె సిద్ధులు : ఇండస్ట్రీయల్ కారిడార్‌తో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని నమ్ముతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రకటించిన కారిడార్‌నిర్ణయంపై యువత ఆశలు పెంచుకుంది. పరిశ్రమలకు సరిపడా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు పెంబర్తి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయాలి. ఇది రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం.
 
ముత్తిరెడ్డి : రిజర్వాయర్ కాల్వలకు డెలివరీ పాయింట్స్ పెట్టారా? వ్యవసాయానికి లో ఓల్టేజీ సమస్య ఉందా?
దాసరి రవి : గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెరువుల్లోకి దేవాదుల నీటి పంపింగ్‌లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అవసరమున్న చోట డెలివరీ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దేవాదుల నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపడం రైతుల్లో ఆనందం నింపుతోంది. నియోజకవర్గంలో ఉన్న లో ఓల్టేజీ సమస్యను నివారించాలి. ఇందుకు గానుగుపాడ్‌లో సబ్‌స్టేషన్, ట్రాన్స్‌పార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు వేగంగా చేయూలి.
 
ముత్తిరెడ్డి : జనగామ ప్రజలకు మునిసిపాలిటీ ద్వారా పాకు రు నీళ్లు సరఫరా అయ్యేవి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
తిప్పారపు ఆనంద్ : జనగామ ప్రజలు పాకురు నీళ్లు తాగలేక కొన్ని నెలల క్రితం అవస్థలు పడ్డారు. చీటకోడూరు రిజర్వాయర్ శుద్ధికి చర్యలు తీసుకోవడంతో ప్రజలకు శుద్ధమైన నీళ్లు సరఫరా అవుతున్నాయి.
 
ముత్తిరెడ్డి : చీటకోడూరు రిజర్వాయర్ నింపడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందా?  ఏమైనా చెరువులు నింపారా?
చిట్ల ఉపేందర్‌రెడ్డి : చీటకోడూరు రిజర్వాయర్ నింపడం ద్వారా భూగర్భజలాలు పెరిగాయి. రిజర్వాయర్ కాల్వ వెంట 170 మందికి పైగా రైతులు మోటార్లను బిగించుకుని పొలాలకు నీరు పారిచ్చుకున్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి 14 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ వెంట అశ్వరావుపల్లి రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేశారు. కాల్వ వెంట తెరిచిన తూములను మూసివేసేందుకు రైతులకు నచ్చజెప్పారు. రిజర్వాయర్ నిండిన తర్వాత చైడారం చెరువులను నింపడం సంతోషం. మిగతా చెరువులు నింపితే బాగుంటుంది.
 
ముత్తిరెడ్డి : జనగామలోని 53/1 సర్వే నంబర్‌లో ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నాయూ? పరిష్కారం అవుతాయన్న నమ్మకం మీకు ఉందా?
ఉల్లెంగల కృష్ణ : 53/1 సర్వే నంబర్‌లో ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారికి పట్టాలు రాలేదు. రుణాలు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలో సమస్య పరిష్కారమవుతుందని నమ్ముతున్నాం.
 
ముత్తిరెడ్డి : జనగామ ఏరియా ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందుతుందా? సమస్యలు పరిష్కారమయ్యాయా?
సేవెల్లి సంపత్ : గతంతో పోలిస్తే వైద్య సేవలు మెరుగయ్యాయి. వైద్యులు మెరుగైన విధంగా పనిచేయాలి. పీహెచ్‌సీలో వైద్యుల నిర్లక్ష్యం ఉంది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి వైద్యం అందించాలి.
 
ముత్తిరెడ్డి : సీఎం సహాయ నిధితో ఏమైనా లబ్ధి..?
మంద లక్ష్మణ్ : సీఎం సహాయ నిధి విషయంలో గతంలో నాయకులే దళారుల అవతారం ఎత్తేవారు. ఇప్పుడు అలా లేదు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.15 లక్షలకు పైగా నిధులు వచ్చినట్లు సమాచారం.
 
ముత్తిరెడ్డి :
పార్కుల పరిస్థితి ఎలా ఉంది?
మేడబోయిన అనిత : పార్క్‌లు సేద తీరేందుకు అనువుగా లేవు. పార్కులను అభివృద్ధి చేసి వాడకంలోకి తేవాలి.
 
ముత్తిరెడ్డి : మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?
ఆత్మకూరి రాణి : గతంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షల రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచారు. మహిళా సమాఖ్య భవనాలు పూర్తి చేయూలి. మహిళలు ఎదిగేందుకు ఇంకా ప్రోత్సాహం అందించాలి.
 
ముత్తిరెడ్డి :
హస్తకళల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? మనకు పెంబర్తి ఉంది కదా?
బుడిగె శ్రీనివాస్ : హస్త కళాకారులకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలి. కూర్చొని పనిచేయడం వల్ల నడుము, కాళ్ల నొప్పులు, కంటి చూపు సమస్యలు వస్తున్నారుు. దీని దృష్ట్యా 50 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గతంలో ఇక్కడి కళాకారులు శిక్షణ పొందారు. బ్యాంకులు ఇచ్చే రుణాలు సరిపోవడం లేదు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల రుణాలివ్వాలి. కళాకారులు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలి. ప్రభుత్వ వైబ్‌సైట్ ఏర్పాటు చేసి ప్రచారం కల్పించాలి.
మల్యాల వేణు : పెంబర్తి హస్త కళాక్షేత్రంలో వస్తువులు అమ్మకానికి(డిస్‌ప్లే) పెట్టే విషయంలో సమస్య ఉంది. రూ.20 లక్షల నిధులు కావాలి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. రుణాలు అందించి కళాకారులకు చేయూత నివ్వాలి.
 
ముత్తిరెడ్డి : కొమురవెల్లి ఆలయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి?
ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి : కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఆలయ అభివృద్ధికి  కేసీఆర్ కృషి చేయాలి.
 
ముత్తిరెడ్డి : గొర్ల కాపరుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
కోరె మల్లేష్ : గొర్రెలను పేంచేందుకు గ్రామ శివార్లలో పోరంబోకు భూములు కేటాయించాలి. రుణాలు అందించి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి.
 
ముత్తిరెడ్డి : మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా?
బోళ్ల సంపత్, తిప్పారపు ఆనంద్ :
అందుబాటులో ఉంటున్నాడు. గతంలో వారికంటే నయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement