జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నిరసన ర్యాలీలో ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయులు
జనగామ: బీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్‌కు చెందిన బీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి..
లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు జనగామ బీఆర్‌ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు.
ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్‌రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి
సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు.
ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment