థియేటర్‌లోనే కాదు ఓటీటీలోనూ అదరగొడుతోంది బలగం సినిమా. మార్చి 3న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు రావడంతో పాటు పెద్దపెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ, అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది.
ఈ పాత్రలో అద్భుతంగా నటించిన విజయలక్ష్మి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'నేను నాటకాలు వేస్తుంటాను. నంది సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా చెప్పేదాన్ని. నేను చేసిన తొలి చిత్రం బలగం. ఇది యదార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంతమంచి పేరు రావడానికి కారణం వేణుగారే. ఈ సినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు.
ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. నా భర్త చనిపోయాక నా పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదమది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం, ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు వదలడంతో ఎంతో బాధపడ్డాను. ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నాను' అంటూ ఎమోషనలైంది విజయ లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment