దండేపల్లి, న్యూస్‌లైన్ :
లక్ష్యం ఘనం.. ఆచరణ శూన్యం అన్న చందంగా తయారైంది దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం దుస్థితి. ఉన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభిస్తే ఐదేళ్లు గడుస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయడం లేదు. ఫలితంగా నిర్మాణ పనులు నత్తకంటే హీనంగా నడుస్తున్నాయి. దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న ఎత్తిపోతల ఫథకం పనులు నత్తకంటే అధ్వానం గా నడుస్తున్నాయి.. ఐదేళ్లుగా నిర్మాణ పనులు సా...గుతూనే ఉన్నాయి. రూ.125 కోట్ల వ్య యంతో నిర్మించే ఈ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009, జన వరి 27న శంకుస్తాపన చేశారు.
2011లోనే పనులు పూర్తి కావాల్సి ఉన్నా నేటికీ అలాగే నడుస్తున్నాయి. గడువు ముగిసి మూడేళ్లవుతున్నా పనులు వేగవంతం కనిపించడంలేదు. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జిల్లా కు కేటాయించిన 3 టీఎంసీల నీటిని కడెం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలకు సాగునీరందించడానికి గోదావరి ఒడ్డున ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించారు. ఆయన మరణానంతరం ఈ పథకం నిర్మాణంపై పట్టించుకునే వారు కరువయ్యారు. సదరు కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తిచేయడం లేదు.
పనులిలా..
గూడెం గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్ నుంచి తానిమడుగు వరకు 11 కిలోమీటర్ల పొడవున 2.30 మీటర్ల వ్యాసం గల పైపులైన్ నిర్మిస్తున్నారు. తానిమడుగు వద్ద నిర్మించిన డెలివరీ పాయింట్ ద్వారా నీటిని కడెం ప్రధాన కాల్వలో అనుసంధానం చేయనున్నారు. అక్కడ నుంచి కడెం ఆయకట్టు చివరిదాక సాగునీరు వెళ్తుంది. పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తయ్యింది. మోటార్లు బిగించారు. పైపులైను నిర్మాణ పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ అంతంతా మాత్రంగానే ఉండడంతో పనుల్లో నాణ్యత లోపిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. పంప్‌హౌజ్ సమీపంలో ఒకటి, రెబ్బనపల్లి మరొక నెగెటివ్ ప్రెషర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. అయితే.. పంప్‌హౌజ్ సమీపంలోని ట్యాంకు నిర్మాణం చివరి దశకు చేరుకోగా రెబ్బనపల్లి వద్ద నిర్మించిన ట్యాంకుకు ఇప్పుడే పైపులు బిగిస్తున్నారు. ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేకంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అసంపూర్తి పనులన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికి నీరందడం కష్టంగానే కనిపిస్తోంది.
వచ్చే ఖరీఫ్‌కు నీరందిస్తాం..
వచ్చే ఖరీఫ్‌కు ఎత్తిపోతల పథకం నీరందిస్తాం. నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. వాటిని త్వరలో పూర్తిచేస్తాం. భూ సేకరణలో కొంత ఆలస్యం జరగడంతో నిర్మాణంలోనూ జాప్యం జరిగింది. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయ్యేలోగా మిగిలిన పనులు పూర్తి చేస్తాం.
- కనకేశ్, ఎల్లంపల్లి ఈఈ
ఉత్తిపోతలు..
Published Sun, Feb 2 2014 2:27 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement