సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్:
అష్టకష్టాలు పడి రైతాంగం పండించిన ధాన్యం మార్కెటింగ్ సంక్షోభం అంచున నిలబడింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లోకి ధాన్యం వారం రోజుల్లో వెల్లువలా రానుంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లకు ఏర్పాట్లు ఇంకా పూర్తి చేయలేదు. పైగా మద్దతు ధరపై సందిగ్ధం నెలకొంది.
ఈ ఖరీఫ్ సీజన్‌లో వచ్చే బాయిల్డ్(కామన్) ధాన్యం మద్దతు ధరను ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 1,315 గా, ఎ గ్రేడ్ ధాన్యం (సన్న రకం )కు రూ. 1,340 గా మద్దతు ధరను ప్రకటించింది. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో వరి పంట జోరుమీద ఉంది. సిద్దిపేటలోని మార్కెట్ జిల్లాలోనే అతి పెద్దది కావడం.. జిల్లాలోని 50 గ్రామాలతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ధాన్యం సిద్దిపేటకు రానుంది. ఈ క్రమంలో వ్యాపారులు ధాన్యం ధరలను క్రమంగా తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా ఎఫ్‌సీఐ కామన్ రకాన్ని మాత్రమే ఖరీదు చేయాలని, సివిల్ సప్లయిస్ సంస్థ సన్నరకం ధాన్యాన్ని ఖరీదు చేయాలని ప్రభుత్వం కొత్తగా నిర్ణయించింది. ఇక ఐకేపీ కొనుగోలు కేంద్రాలు సన్నరకం ధాన్యాన్ని ఖరీదు చేసి కస్టమ్ మిల్లింగ్‌కు పంపాలని అధికారులు నిర్ణయించారు.
ఏర్పాట్లు ఏవీ?
సిద్దిపేట మార్కెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు ధాన్యం ఖరీదు చేయడానికి ఇంతవరకు ఏర్పాట్లు చేయలేదు. బార్‌దాన్, సుతిలీ సిద్ధం చేసుకోవడంతో పాటు హమాలీలను, రవాణా ఏర్పాట్లను, గ్రేడింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాలోస్తే టార్పాలిన్లు సైతం సిద్ధం చేసుకోవాలి. కాని అధికార యంత్రాంగం ఇందుకు సిద్ధం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వ్యాపారులకు పరీక్షే..
ఈ ఖరీఫ్ సీజన్‌లో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి జిల్లాకు ధాన్యం భారీగా దిగుమతి కానుంది. ఆయా రాష్ట్రాల్లో మద్దతు ధర నిబంధనలు లేకపోవడంతో తక్కువ ధరలకే ధాన్యం ఇక్కడికి దిగుమతి అయ్యే అవకాశం ఉంది.
ఈ నేఫథ్యంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టకపోతే మార్కెట్‌లో ధాన్యానికి మద్దతు ధర లభించడం కష్టం. రైతులు రోడ్డెక్కడం అనివార్యం. వెల్లువెత్తిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర ఇప్పించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న క్రమంలో వరి ధాన్యం సిద్దిపేట మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలు పొంచి ఉన్నాయి
ధాన్యం.. దైన్యం
Published Fri, Oct 18 2013 12:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement