ప్రా‘ధాన్య’మొచ్చే !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పంటకు తెగుళ్లు, దిగుబడి తగ్గిన కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ నామమాత్రంగానే ఉంటుందనుకున్నప్పటికీ..ఊహించని విధంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గతేడాది కంటే అధికంగా కొనుగోలు చేసి..మరింత ముమ్మరంగా సేకరిస్తుండడం విశేషం. జిల్లాలో పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతుల సరుకుతో కళకళలాడుతున్నాయి. ఈ సీజన్ పూర్తయ్యే నాటికి 48వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు తొలుత 91 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఈసారి దిగుబడి పడిపోయిందనే భావనతో మొత్తం 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలు 51 ఉండగా, ఐకేపీ కేంద్రాలు తొమ్మిది ఉన్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 39,323మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. గతేడాది 34,835మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. గ్రేడ్– ఏ రకం క్వింటా ధర రూ.1590, కామన్ రకానికి రూ.1540గా నిర్ణయించారు.
సుడిదోమ దెబ్బతో తగ్గిన దిగుబడి..
ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఖమ్మంజిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 60వేల హెక్టార్లలో వరిని సాగు చేశారు. ప్రతి ఏడాది ఎకరానికి 30నుంచి 32 బస్తాల దిగుబడి వచ్చేది. అయితే రైతులను ఈ ఏడాది సుడిదోమ దెబ్బతీయడంతో ఎకరానికి 6 నుంచి 8బస్తాల దిగుబడి తగ్గింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలను కూడా తగ్గించారు. కానీ..సేకరణ ఆశాజనకంగా ఉండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ముందు నుంచే సన్నద్ధం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆ శాఖాధికారులు ముందు నుంచే దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం రైతులను చైతన్యపరిచారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా నిర్ణయించగా..1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. అప్పుడు ఖమ్మం జిల్లాలోని 21మండలాల పరిధిలో 34,835.609మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించగా గతేడాది కంటే ఇప్పటి వరకు 5వేల మెట్రిక్ టన్నుల «ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 4,416మంది రైతుల నుంచి మొత్తం 39,323.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లయింది. అందులో గ్రేడ్ ఏ రకం– 32,103.760మెట్రిక్ టన్నులు, కామన్ రకం 7,219.280మెట్రిక్ టన్నుల «ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.62,23,48,624 చెల్లించాల్సి ఉంది. ఇందులో 4,259మంది రైతులకు రూ.61,80,86,124లు చెల్లింపులు చేయగా..157మంది రైతులకు సంబంధించిన రూ.42,62,500లు చెల్లించాల్సి ఉంది.
2016–17 వివరాలు ఇలా..
కొనుకోలు కేంద్రాలు 49
రైతులు 4,536
గ్రేడ్ ఏ రకం 24,955.903 మెట్రిక్ టన్నులు
కామన్ రకం 9879.706 మెట్రిక్ టన్నులు
మొత్తం కొనుగోళ్లు 34,835.609
గ్రేడ్ ఏ రకం క్వింటా ధర రూ.1,510
కామన్ రకం ధర రూ.1,470
చెల్లింపులు రూ. 52,20,65,813.50