సత్తుపల్లి, న్యూస్‌లైన్:
అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన కష్టార్జితాన్ని దళారులు దోచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలులో పడికట్టు కాంటాతో కనికట్టు చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని తరుగు పేరుతో బస్తాకు మూడు కేజీలు అదనంగా కాంటా వేసుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 77కిలోల బస్తాకు సంచి కింద ఒక కేజీ, తరుగు కింద రెండు కేజీలు అదనంగా కాంటా వేసుకుంటున్నారని, పడికట్టు కాంటాలో మోసాలు జరుగుతున్నాయని లారీలను నిలిపివేసి.. పంచాయితీలు జరిగినా దళారులు మాత్రం మళ్లీ అదే తరహాలో కాంటాలు వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
నామమాత్రంగా కొనుగోళ్లు
ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు ఆసక్తి కనబర్చకపోవటంతో వాటిలో కొనుగోళ్లు నామమాత్రంగానే జరుగుతున్నాయి. సత్తుపల్లి మండలం కిష్టారం, సదాశివునిపాలెం, గంగారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కిష్టారం మినహా ఇతర కొనుగోలు కేంద్రాలు మూతపడ్డాయి. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల, కోండ్రుపాడు.., వేంసూరు మండలంలోని అడసర్లపాడు.., కల్లూరు మండలంలో కల్లూరు, చెన్నూరు, కొర్లగూడెం, పోచారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా ఫలితం కనిపించటం లేదు. తల్లాడ మండలంలో అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్నే ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం మద్దతు ధర ఫైన్క్రం(ఏ-గ్రేడ్) వందకేజీల బస్తాకు రూ.1345, కామన్క్రం రూ.1310 చెల్లిస్తోంది. ఫైన్ రకంలో సాంబమసూరి, 1010, జేజేలు, రాజహంస, కామన్క్రంలో స్వర్ణ, 1001 రకాలు తీసుకుంటారు. ప్రభుత్వం మద్దతు ధర కంటే అదనంగా బయట మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.75ల వరకు చెల్లిస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావటానికి రైతులు ఆసక్తి చూపటం లేదు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఇంకా కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
తాలు, బెరుకుల దెబ్బకు.. :
ఈ ఏడాది ఖరీఫ్‌లో అన్నదాతకు కొలుకోలేని దెబ్బ పడింది. పంట చేతికొచ్చే సమయంలో సాంబమసూరి బీపీటీ 5204 విత్తనం వందలాది ఎకరాలలో బెరుకులు రాగా మరికొన్నిచోట్ల తాలుకంకులు వచ్చి పంట చేతికిరాలేదు. బెరుకులు వచ్చిన రకాన్ని ఫైన్ క్వాలిటీ నుంచి తప్పించి కామన్క్రం కింద కొనుగోలు చేయటంతో రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లటానికి ఇంటివద్దే తూర్పారబట్టాలి.. తేమశాతం 17 ఉండాలి.. తాలు, మట్టిపెడ్డలు 3శాతం మాత్రం ఉండాలనే నిబంధనలు ఉండటంతో చాలామంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా దళారులకు విక్రయిస్తున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకున్న దళారులు కాంటాలలో పాల్పడుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని ైరె తులు కోరుతున్నారు.
పడికట్టు.. కనికట్టు..
Published Wed, Dec 25 2013 4:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement