రైతు నెత్తిన పిడుగు
యూరియా ధర మెట్రిక్ టన్నుకు రూ. 350ల పెంపు
ఏటా జిల్లా రైతాంగంపై రూ. 12.24 కోట్ల అదనపు భారం
ఆందోళన చెందుతున్న రైతులు,
రైతుసంఘాల నాయకులు
సత్తెనపల్లి, న్యూస్‌లైన్: ఎడాపెడా పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇప్పటికే సతమతమవుతున్న రైతులపై మరో పిడుగు పడింది. యూరియా ధరలు పెరగడం రైతులకు భరించలేని భారంగా మారింది. ప్రస్తుతం సాగుకు ఎంతో కీలకమైన యూరియా ఎరువు ధరను గణనీయంగా పెంచుతూ కేంద్ర మంత్రి మండలి సమావేశం మూడు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయారు. యూరియా ధరను ఒక్కసారిగా టన్నుకు రూ. 350ల వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రైతులు తీవ్రఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఏటా ఖరీఫ్,రబీ సీజన్‌లకు కలిపి 3,49,807 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగిస్తున్నారు.
ఈ రబీలో 1,95,476 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఖరీఫ్‌లో 1,54,311 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది.
{పస్తుతం రబీ సాగు కీలక దశకు చేరుకుంది. ఇలాంటి తరుణంలో యూరియా మెట్రిక్ టన్నుకు రూ. 350ల వరకు పెంచడంతో జిల్లాలోని రైతులపై ఏడాదికి రూ.12.24 కోట్ల వరకు భారం పడనుంది.
వ్యవసాయ చేస్తున్నవారిలో అధిక శాతం సన్న, చిన్నకారు రైతులే. వారిలో చాలా మంది ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు.
మంత్రి మండలి నిర్ణయం ప్రకారం 50 కిలోల బస్తాకు రూ. 17.50 పైసలు పెరిగినట్లయింది. బస్తా ధర ప్రస్తుతం రూ. 280.85 వరకుఉండగా, అది కాస్తా రూ.301.35లకు చేరనుంది.
జిల్లాలో పత్తి, మిర్చి, వరి సాగు ఎక్కువగా ఉంది. అన్ని పంటలకు దాదాపుగా యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది.
కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు, రైతు సంఘ నాయకులు కోరుతున్నారు.