సూర్యాపేట మున్సిపాలిటీ / సూర్యాపేటటౌన్, న్యూస్‌లైన్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న అన్నదాతపై కేంద్రప్రభుత్వం భారం మోపింది. పం టల సాగుకు అవసరమైన యూరియా ధరను పెంచేసింది. యూరియా టన్నుకు *350 పెంచుతూ ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గసమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులపై రూ.2.89 కోట్ల అదనపు భారం పడనుంది. యూరియా ధర పెరగడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చిన్నకారు రైతులు 2.82 లక్షల మంది, సన్నకారు రైతులు 1.45లక్షల మంది, పెద్ద రైతులు 70వేల మంది ఉన్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీసీజన్లకు కలిపి లక్షా 27 వేల మెట్రిక్ టన్నుల యూరి యాను రైతులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో యూరియా ధర టన్నుకు రూ.5684 ఉండేది. కేంద్రప్రభుత్వం దీనికి రూ.350 అదనంగా పెంచింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని రైతులపై రూ. 2.89 కోట్ల అదనపు భారం పడనుంది.
50 కిలోల బస్తాకు అదనంగా రూ17.50
ప్రస్తుతం నీమ్‌కోటెడ్ యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298, నాగార్జున యూరియా రూ. 283.85, క్రిబ్‌కో రూ. 284కి మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. తాజాగా పెరిగిన ధరతో ఒక్కో యూరియా బస్తాపై రూ. 17.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇక నుంచి నీమ్‌కోటెడ్ యూరియా బస్తాకు రూ. 315.50 చెల్లించాలి. రిటైల్ వ్యాపారులు రవాణా, హమాలీ చార్జీలను కలుపుకొని విక్రయించనున్నందున ఈ ధర ఇంకా పెరగనుంది. ఇక ప్రయివేటు వర్తకుల ధరలు చెప్పనవరం లేదు.
ఆందోళనలో రైతులు
యారియా ధరను పెంచడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. తమ నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో లోవోల్టేజీ, విద్యుత్ కోతలు, అకాల వర్షాలతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక, కొద్దిపాటి పంటకు మద్దతు ధర లభించక రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రబీలోనైనా ఎక్కువ దిగుబడులు వచ్చి అప్పులు తీర్చవచ్చనుకుంటున్న రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. యూరియా ధర పెంచి భారం మోపిందని అన్నదాతలు మండిపడుతున్నారు.
దురదృష్టకరం
పెరిగిన విత్తనా లు, ఎరవులు, కూలీల ధరలతో రైతులు అప్పు ల్లో కూరుకుపోతుంటే యూరియా ధర పెంచడం దురదృష్టకరం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సబ్సిడీలిచ్చి రైతులను ప్రోత్సహించాలి. రై తులపై భారం మోపితే వ్యవసాయం ముందుకు సాగదు.
- ఏరెడ్ల జగదీశ్వర్‌రెడ్డి, రైతు
యూరియా.. భారమయా
Published Fri, Mar 7 2014 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement