రాయచూరు టౌన్: జిల్లా రైతులకు అవసరమైన యూరియా కేటాయింపులో పాలకులు చూపుతున్న పక్షపాతంపై పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల్లో ఇప్పటి వరకు 55 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే విడుదలైంది. నెలరోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల ఫలితంగా ఉన్నఫళంగా యూరియాకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ఎదుట రైతులు రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.
జిల్లాకు వచ్చిన 55 వేల టన్నుల ఎరువుల్లో సగం బీఎస్‌ఎన్‌ఎస్ ద్వారాను, మిగిలిన సగం ఎరువుల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లా, తాలూకా, ఫిర్కాకేంద్రాల్లో పక్షం రోజులు గడిచినా రైతులకు యూరియా దొరకడంలేదు. దీంతో దెబ్బతింటున్న తమ పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం 8 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రాగా, మరో రెండు రోజుల్లో 1500 మెట్రిక్ టన్నులు రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ విషయమై జిల్లాధికారి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ మేరకు ఓ లేఖద్వార పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా కొప్పళకు మాత్రం కేటాయించిన 43వేల మెట్రిక్ టన్నులకన్నా అధికంగా ఇప్పటి వరకు 54 వేల టన్నులు విడుదల చేశారు. అంటే ఆ జిల్లాకు కేటాయించిన దానికంటే 11వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఆ జిల్లాకు లభించింది. కేంద్రం, రాష్ట్రంలో వే ర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉండడం వల్లే ఇలా జరుగుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. కొప్పళ జిల్లా ఎంపీ బీజేపీ నాయకుడు కాగా, రాయచూరు ఎంపీ కాంగ్రెస్ అన్న విషయం తెలిసిందే.
యూరియా కేటాయింపులో పక్షపాతం
Published Tue, Sep 23 2014 2:47 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement