రామగుండం యూరియా ప్లాంటుకు పూర్వవైభవం
న్యూఢిల్లీ: యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే చర్యలను కేంద్రం చేపట్టింది. మూతపడిన ప్రభుత్వ రంగ యూరియా కర్మాగారాల పునరుద్ధరణకు పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. రామగుండం, తాల్చేర్‌లలో మూతపడిన యూరియా ప్లాంట్లను రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పునరుద్ధరించే ప్రతిపాదనలను గత వందరోజుల్లో ఆమోదించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. సింద్రిలోని మరో మూతపడిన ప్లాంటు పునరుద్ధరణ యత్నాలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
అస్సాంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (బీవీఎఫ్‌సీఎల్) ప్రాంగణంలో యూరియా - అమోనియా ప్లాంటును కొత్తగా నిర్మించే యత్నాల్లో ఉన్నట్లు వివరించారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం గత దశాబ్దంలో ఇదే ప్రథమమని అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఒక్క ఎరువుల ప్లాంటును కూడా నిర్మించలేదని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేసేందుకు జగదీశ్‌పూర్-హల్దియా గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణంపై పెట్రోలియం మంత్రితో ఇప్పటికే రెండుసార్లు చర్చించానని అనంత్‌కుమార్ వెల్లడించారు.