గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ఈ సారి ఖరీఫ్‌లో రైతన్న వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేసరికి సాగునీరు సమస్య వచ్చి పడింది. జిల్లాలో 2.55లక్షల హెక్టార్లలో ఆగస్టు నెలకల్లా వరినాట్లు పడాల్సి ఉంది. కానీ ఇప్పటికి 2.20లక్షల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. ఇంకా 35వేల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. సాగునీటి విడుదల్లో జాప్యం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. ఏటా ఆగస్టు నాటికల్లా జిల్లావ్యాప్తంగా నాట్లు పూర్తయ్యేవి. సాగునీటి ఇబ్బందులు... సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల తిప్పలు తప్పటం లేదు. జిల్లాలోని నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, అవనిగడ్డ, మోపిదేవి, పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నాట్లు పడలేదు.
తప్పని సాగునీటి ఇబ్బందులు....
ఒక్క గుడ్లవల్లేరు పుల్లేటి కాల్వ కింద సాగయ్యే 1.60లక్షల ఎకరాల్లో ఎక్కువగా శివారు భూములున్నాయి. ఈ రైతులకు ఇప్పటికీ సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగానే మారింది. క్యాంప్‌బెల్ కాల్వ కింద 46వేల ఎకరాల రైతులకు కష్టకాలం వచ్చిపడింది. ఈ కాల్వ నుంచి 705క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉండగా కేవలం 400 క్యూసెక్కులే విడుదలవుతున్నాయి. దీంతో ఎకరానికి రూ.1,500నుంచి రూ.2వేలు ఖర్చు చేసి, పొలాలకు ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుకుని ఆకుమళ్లను బతికించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు కూడా కరువవుతోందని శివారు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఖరీఫ్ రైతుకు కష్టకాలం’
Published Wed, Sep 4 2013 5:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement