జిల్లాలో వేసవి వచ్చిందంటే చాలు తాగునీటికి ఇక్కట్లు పడాల్సిందే. ప్రభుత్వం తీసుకుంటున్న నామమాత్రపు చర్యలు పల్లె ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి.
సాక్షి, కడప : జిల్లాలో వేసవి వచ్చిందంటే చాలు తాగునీటికి ఇక్కట్లు పడాల్సిందే. ప్రభుత్వం తీసుకుంటున్న నామమాత్రపు చర్యలు పల్లె ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. అధికారులు సైతం తాత్కాలికంగా ఉపశమన మార్గాలు వెతుకుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవడం మినహా శాశ్వత చర్యలపై దృష్టిసారించిన దాఖలాలు కనిపించడంలేదు.
దీంతో గ్రామీణుల దాహార్తి తీర్చే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది మొత్తం మీద జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తడం గమనార్హం. రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య వర్ణనాతీతం. గత ఏడాదితో పోలిస్తే కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కొంత మేర ఊరట లభించింది.
తాగునీటి గండం :
జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రాజంపేట, రైల్వేకోడూరుల్లో నీటి గండం ఏర్పడింది. ముఖ్యంగా రాజంపేట మండలంలోని ఆరు పంచాయతీల్లో చావలవారిపల్లె, పల్లంవారిపల్లె, మిట్టమీదపల్లె, వరదయ్యగారిపల్లె, ఊటుకూరు పంచాయతీల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. 1000 అడుగులకు పైగా లోతుకు బోర్లను వేసినా నీరు పడని పరిస్థితి నెలకొంది. ఈ పంచాయతీల పరిధిలోని 18 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలాఖరుకు ఈ సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. ఈ గ్రామాల ప్రజలు తాగునీరు దొరకక అల్లాడుతున్నారు.
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె మండలాల్లో సైతం ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సమస్య తీవ్రమైంది. రాయచోటి నియోజకవర్గంలో ప్రతి ఏడాది షరా మామూలుగానే ఉంది. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా ఇక్కడ సాధారణ వర్షపాతం లేనందునే భూగర్భ జలాలు అడుగంటి గడ్డు పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక్కడ తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.