‘మృగశిర’ మురిపించేనా! | Preparing For Kharif Cultivation | Sakshi
Sakshi News home page

‘మృగశిర’ మురిపించేనా!

Published Wed, Jun 19 2019 12:03 PM | Last Updated on Wed, Jun 19 2019 12:04 PM

Preparing For Kharif Cultivation - Sakshi

ఖరీఫ్‌ సాగుకు కోటి ఆశలతో అన్నదాత సన్నద్ధమయ్యాడు. తెల్లవారుజాము కోడి కూత మొదలుకొని హలం పట్టి పొలం దున్నడానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు. మరోపక్క వ్యవసాయశాఖ ఖరీఫ్‌కు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా గతేడాది వర్షాభావ పరిస్థితుల పుణ్యమా అని పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొని చినుకు రాలలేదు.  అన్నదాత తీవ్ర స్థాయిలో నలిగిపోయాడు. ఈసారి ఖరీఫ్‌కు సంబంధించి సాగుకు అన్నదాత సిద్ధమయ్యాడు. అందులోనూ రోహిణికార్తె సమయంలో రోళ్లు సైతం పగలిపోతాయని నానుడి ఉంది. రోహిణికార్తె పోయి మృగశిర వచ్చింది. ప్రస్తుతం ఆశలన్నీ మృగశిరపైనే నెలకొన్నాయి.

సాక్షి కడప : జిల్లాలో అన్నదాతలు ప్రస్తుతం పొలాలను దున్ని.. పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఎక్కువగా వేరుశనగ, వరి పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌లో వర్షాధారం కింద ఒకపక్క, ఇంకోపక్క కేసీ కెనాల్‌ కింద కూడా వరి పంటను కూడా సాగు చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉండగా..1,79,929 హెక్టార్లలో పంటల సాగు చేసే అవకాశముందని వ్యవసాయశాఖ గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ప్రస్తుతం మృగశిర కార్తె మురిపిస్తుందని రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది జూన్‌లో వర్షాలు రావడం, సాగుతోపాటు పంటలు వేయడం జరుగుతుంది. అయితే గత రెండు, మూడేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఈసారి వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్న నేపధ్యంలో వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

రోహిణిని మరిపిస్తున్న ఎండలు
జిల్లాలో రోహిణికార్తె శకం ముగిసినా ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. జూన్‌ నె ల ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఎండల వేడి మాత్రం తగ్గలేదు. పైగా వేడిగాలులు కూడా భయపెడుతున్నాయి. ఒకప్రక్క ఎండలు, మరోప్రక్క వేడిగాలులు, ఇంకోప్రక్క ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రోహిణికార్తె సమయంలోనే ఎండలు అధికంగా ఉంటాయి. అలాంటిది కార్తె పోయినా కూడా మరిపించేలా ఇప్పుడు ఎండలు కనిపిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఏది ఏమైనా భారీ వర్షాలు కురిస్తే తప్ప ఉపశమనం కనిపించడం లేదు.

రుతు పవనాలపైనే ఆశలు
రాష్ట్రంలోకి నైరుతి రుతు వపనాలు నాలుగైదు రోజుల్లో ప్రవేశించనున్నాయి. రుతు పవనాల రాకతో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి వర్షాలు కురిస్తే ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగా ప్రారంభించవచ్చని అన్నదాతలు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అక్కడక్కడ తొలకరి జల్లులు మాత్రమే కురిశాయి. కొంతమేర భారీ వర్షాలు వస్తేనే ప్రస్తుత ఖరీప్‌ సీజన్‌లో సాగుకు అనుకూల పరిస్థితి ఉంటుంది. ఆకాశం మేఘావృతం అవుతున్నా గా>లులు, ఇతర కారణాలతో సరైన వర్షపాతం నమోదు కాలేదు. ప్రస్తుతం జూన్‌కు సంబంధించి 73.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా....ఇప్పటివరకు 14.9 మి.మీ. కురిసింది. మరో 58.5 మి.మీ. లోటు వర్షపాతం కురిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాలపైనే రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు.

వ్యవసాయశాఖ సన్నద్దం
ఖరీఫ్‌సాగుకు వ్యవసాయశాఖ సన్నద్దమైంది. అందుకు సంబంధించి ప్రభుత్వం సరఫరా చేసే వేరుశనగ విత్తనకాయల ధరలను నిర్ణయించగా....ఇప్పటికే విత్తన కాయలను మండలాలను మంజూరు చేశారు. జిల్లాకు 32,175 క్వింటాళ్లను కేటాయించారు. అంతేకాకుండా వేరుశనగతోపాటు మిగతా అన్ని రకాల పంటలకు సంబంధించి వ్తితనాలను కలుపుకుని మరో 49 వేల క్వింటాళ్లు అవసరమని ప్రణాళికలు రూపొందించారు. విత్తనాలను అందించి రైతన్నలను సిద్దం చేయడం ద్వారా ఎప్పుడు వర్షం పడినా అప్పటికప్పుడు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంతేకాకుండా 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కూడా అవసరమని ఇప్పటికే వ్యవసాయశాఖ జూన్‌ మొదటివారంలోనే నివేదికలు పంపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement