జిల్లాలో పరిపాలన పడకేసింది. కీలకమైన శాఖలకు సైతం అధికారులు కరువయ్యారు. ప్రతి విభాగానికి ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన గాడి తప్పుతున్నా సరిదిద్దాలనే ఆలోచన పాలకుల్లో కలగడంలేదు. వెరసి జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతోంది.
సాక్షి, కడప : మండల స్థాయి కాదు.. నియోజకవర్గ స్థాయి అంతకన్నా కాదు.. జిల్లాస్థాయి అధికారులు. అందులోనూ ఆయా శాఖల్లో పనిచేసే కిందిస్థాయి అధికారులను పర్యవేక్షించే బాధ్యతతోపాటు, జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన ఉన్నతాధికారుల నియామకంలో ప్రభుత్వ అలక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి, అరా అయితే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ చాలా శాఖల్లో ప్రధాన అధికారులు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది.
ఏడాదిగా వ్యవసాయశాఖకు ఇన్‌ఛార్జి జేడీ
పల్లెలు అభివృద్ధి చెందాలంటే అందుకు రైతులే పట్టుగొమ్మలు. అలాంటిది వ్యవసాయ పరంగా రాణించాలంటే కీలక అధికారుల నియామకం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు రైతులకు సక్రమంగా చేరాలంటే వ్యవసాయ పరంగా ప్రతి సంద ర్భంలోనూ జిల్లాలో జాయింట్ డెరైక్టర్ (జేడీ) పాత్ర కీలకం. సుమారు ఏడాదికిపై ఇన్‌ఛార్జి జేడీనే కొనసాగిస్తున్నారు. ఎఫ్‌టీసీ డీడీగా పనిచేస్తున్న జ్ఞానశేఖరం వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి జేడీగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడాదికి పైగా అవుతున్నా ప్రభుత్వం ఎందుకు రెగ్యులర్ జేడీ నియామకంలో జాప్యం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏజేసీ, పీఓ, డీసీహెచ్‌ఓ, సీఈఓ,
ఆర్డీ పోస్టులకు ఇన్‌ఛార్జిలే దిక్కు
జిల్లా అభివృద్ధిలో అదనపు జేసీ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. కడపలో పనిచేస్తున్న అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వం ఐదు నెలల క్రితం బదిలీ చేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్‌ఛార్జి ఏజేసీలే కొనసాగుతున్నారు. విద్యారంగంలో కీలకపాత్ర పోషించే రాజీవ్ విద్యా మిషన్‌కు సంబంధించి ప్రాజెక్టు ఆఫీసర్ నియామకంలో అధికారులను నియమించినా రాకుండా అటునుంచి అటే ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ప్రాజెక్టు ఆఫీసర్ వీరబ్రహ్మం తిరుపతికి బదిలీ అయిన నాటినుంచి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రతిభాభారతి ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఇంతవరకు రెగ్యులర్ అధికారి నియామకం జరగలేదు. వైద్య ఆరోగ్యశాఖ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రెగ్యులర్ ఆర్డీ లేక దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే డీసీహెచ్‌ఎస్‌గా కూడా ఇన్‌ఛార్జి అధికారే పనిచేస్తున్నారు. ఇలా వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన రెండు పోస్టుల్లోనూ ఇన్‌ఛార్జి అధికారులే పనిచేస్తుండటం గమనార్హం. జెడ్పీ సీఈఓను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో మరొక రెగ్యులర్ అధికారిని నియమించ పోవడంతో ఇన్‌ఛార్జితోనే కాలాన్ని నెట్టుకొస్తున్నారు. అలాగే ఉద్యాన శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌ను, ఐజీ కార్ల్‌కు సంబంధించి రెగ్యులర్ డీడీని ఇంతవరకు ప్రభుత్వం నియమించలేదు.
ఇన్‌చార్జిలే దిక్కు
Published Mon, Mar 9 2015 3:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement