సాక్షి, కడప/ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఆయన వ్యవసాయ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఓ అధికారి. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతాడు. నకిలీ ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను విక్రయించకుండా నియంత్రించేందుకు అనుకుంటే పొరబాటే. మామూళ్ల వసూలు కోసం. ప్రతి షాపునుంచి తనకు అందాల్సిన మామూళ్లు పూర్తి మొత్తంలో అందితే ‘వరప్రసాదం’లా స్వీకరిస్తాడు.
అడిగినంత మొత్తం ఇచ్చుకోలేమని దుకాణదారులు విన్నవించుకుంటే వారికి చుక్కలు చూపిస్తాడు. ఏదో ఒక కారణం చూపి వారికి భారీ జరిమానాలు విధిస్తాడు. ఈ తంతు కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అతని అవినీతి చర్యలకు అడ్డులేకుండా పోయింది. దుకాణదారులకు వ్యవసాయశాఖలో ఏ పని జరగాలన్నా ముడుపులు చెల్లించుకోవాల్సింది. లేదంటే వారి ఫైలు ముందుకు కదలదు. ముడుపులు ఇవ్వకుంటే ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది.
షాపుల తనిఖీ పేరుతో ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణదారులను అష్టకష్టాలు పెడుతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా ఏదో ఒక వంక చూపి కేసులు, జరిమానాలు విధిస్తుండటంతో వ్యాపారులు హడలిపోతున్నారు. చేసేదేమీలేక బాధను దిగమింగుతూ ముడుపులిచ్చుకోవాల్సి వస్తోంది. ప్రతి ఏడాది మామూళ్ల సొమ్ము పెంచుతుండటంతో దిక్కుతోచక నరక యాతన అనుభవిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని దుకాణదారులు మౌనం వహిస్తున్నారు. దీంతో వ్యవసాయ శాఖకు చెందిన ఆ అధికారి ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయించిన రేటు ప్రకారం ముడుపులు సమర్పించుకోక తప్పడం లేదు.
జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు 324, పురుగు మందుల దుకాణాలు 350, విత్తన షాపులు 248 కలిపి మొత్తం 922 దుకాణాలున్నాయి. అయితే వీటి ను ంచి గతంలో వ్యవసాయ శాఖ వారు మామూళ్ల రూపంలో ఖర్చుల కోసం కాస్తోకూస్తో ఏటా వసూలు చేసేవారు. అయితే రెండేళ్లుగా జేడీ కార్యాలయంలోని ఓ అధికారి రేటు అమాంతం పెంచేశారు. ఒక దుకాణానికి మామూళ్ల క్రింద గత ఏడాది రూ.10వేల నుంచి 15వేలకు పెంచగా ఈ ఏడాది రూ.20వేలు ఇవ్వాల్సిందేనని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఆయన మామూళ్లు వసూలు చేశారు. మరికొందరు వ్యాపారుల నుంచి మామూళ్ల వసూలు కోసం ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు ఇదే అధికారిని ప్రశ్నిస్తే మీ షాపులో లొసుగులు ఉన్నాయని, కేసులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం.
అసలే ఎరువుల ధరలు పెరిగాయని, దీనికితోడు ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అప్పుగా ఇచ్చామని, వాటి వసూలే కష్టంగా ఉంటే మళ్లీ మామూళ్ల రూపంలో రూ.20వేలు ఎలా చెల్లించాలని దుకాణదారులు తలలు బాదుకుంటున్నారు. ఎటూ పాలుపోని కొంతమంది వ్యాపారులు డివిజన్ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులు తెలిసీ తెలియనట్లు ఆ అధికారి పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తప్పవు:
దుకాణదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు. లెసైన్సులను నిబంధనల ప్రకారం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. దుకాణాలపై ఏవైనా కేసులుంటే ఆ షాపుల లెసైన్స్ రద్దు చేసే అవకాశముంది. దుకాణదారులనుంచి మామూళ్లు రాబడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు. దీనిపై విచారణ చేపడతాం.
- జయచంద్ర, సంయుక్త సంచాలకులు,
జిల్లా వ్యవసాయ శాఖ.
అవినీతి పురుగు
Published Wed, May 28 2014 1:54 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement