సాక్షి, కర్నూలు:
బిగిసిన ఉద్యమ పిడికిళ్లు.. గర్జించే గళాలు.. పోరుబాట వీడని అడుగులు.. జిల్లాలో సమైక్యోద్యమం ఉద్ధృతమవుతోంది. రెండు నెలలు గడిచినా.. ఆందోళనలతో ఇబ్బందులు తలెత్తుతున్నా భావి తరాల భవిష్యత్ దృష్ట్యా మౌనంగా భరిస్తూనే అన్ని వర్గాల ప్రజలు.. ఉద్యోగులు.. కార్మికులు సమైక్య వాణిని బలంగా వినిపిస్తున్నారు. విద్యార్థులు మేము సైతం అంటూ కదంతొక్కుతున్నారు. శుక్రవారం కర్నూలులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు సమరభేరి మ్రోగించారు. నంద్యాలలో ఇరిగేషన్ అధికారులు గంజి పంపిణీ చేసి విభజన జరిగితే మిగిలేది ఇదేనంటూ నిరసన తెలిపారు. పట్టణంలో చేపట్టిన రిలే దీక్షలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ-1, 2 ఎస్‌ఈలు జయప్రకాష్, నరసింహమూర్తి, వెంకటరమణతో పాటు కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించగా.. ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు.
ఆదోనిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఉద్యోగులు రోడ్డుపైనే స్నానాలు చేశారు. ఆళ్లగడ్డలో చిన్నకందుకూరు రైతులు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహరం నిర్మించారు. చాగలమర్రిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. శిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆలూరులో గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా.. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మద్దతు పలికారు. హొళగుందలో పోస్టాఫీసు, టెలికం కార్యాలయాలను ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్‌జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. తపాలా, బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ కార్యలయాలను మూసివేయించారు.
ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్లపైనే పాఠాలు బోధించారు. వివిద పాఠశాలల విద్యార్థులు ర్యాలీగా వచ్చి సోమప్ప సర్కిల్‌లో మానవహరంగా ఏర్పడ్డారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్యర్యంలో ఉద్యోగులు, వ్యాపారులు, హమాలీల ఆధ్వర్యంలో ముఖానికి నల్ల రిబ్బన్‌లు కట్టుకుని పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కర్నూలు-గుంటూరు రహదారిపైనే బోధన నిర్వహించి నిరసన తెలిపారు. డోన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. ముస్లింలు ర్యాలీ నిర్వహించగా.. పీఈటీ టీచర్ల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
సమైక్యోద్యమం
Published Sat, Sep 28 2013 2:39 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement