షరతులు వర్తిస్తాయి! | jntu affiliation for engineering, pharmacy colleges | Sakshi
Sakshi News home page

షరతులు వర్తిస్తాయి!

Published Thu, Sep 11 2014 2:36 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

jntu affiliation for engineering, pharmacy colleges

* 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీలకు షరతులతో అఫిలియేషన్
* పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు చేరిన కళాశాలల జాబితా
* లోపాలున్న కాలేజీలకు మళ్లీ నోటీసులిచ్చిన జేఎన్‌టీయూహెచ్
* రేపటిలోగా వివరాలు సమర్పించాలని ఆదేశం
* గేట్, జీప్యాట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా
 
సాక్షి, హైదరాబాద్: పీజీ కళాశాలల అఫిలియేషన్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోపాలను సరిదిద్దుకోని కళాశాలలనూ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని జేఎన్‌టీయూహెచ్‌ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తమ పరిధిలో ఉన్న 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కళాశాలలకు వర్సిటీ అధికారులు షరతులతో కూడిన అఫిలియేషన్ మంజూరు చేశారు. అనంతరం సదరు జాబితాను బుధవారం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు అందజేశారు.

అయితే, మరికొన్ని గంటల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అఫిలియేటెడ్ కళాశాలల జాబితా రావడంతో గేట్, జీప్యాట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకున్న గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు బుధ, గురువారాల్లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన అభ్యర్థులు వెబ్‌సైట్లో ఉన్న వాయిదా సమాచారం చూసి నిరాశగా వెనుతిరిగారు.

వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో అధికారులు స్పష్టం చేయలేదు. కాగా, ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే పీజీఈ సెట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పూ లేదని అధికారులు పేర్కొన్నారు.

ఆ కాలేజీలకు నోటీసులు...
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సులు నిర్వహిస్తున్న 272 ఇంజనీరింగ్ కళాశాలల్లో 145 కాలేజీలు మాత్రమే ప్రమాణాలు పాటిస్తున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మిగిలినవాటిలో 124 కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్ బుధవారం మరోసారి నోటీసులు జారీచేసింది. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ నిష్పత్తి, బోధనేతర సిబ్బంది తదితర అంశాలపై తాజా సమాచారాన్ని అందజేయాలని అందులో ఆదేశించింది.

మూడు కళాశాలల యాజమాన్యాలు మాత్రం తాము పీజీ కోర్సులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని జేఎన్‌టీయూహెచ్‌కు స్పష్టంచేశాయి. కాగా, ఎంఫార్మసీ నిర్వహిస్తున్న 104 కళాశాలల్లో లోపాలున్నట్లుగా చెబుతున్న 54 కాలేజీలకు కూడా నోటీసులు జారీఅయ్యాయి. నోటీసులు అందుకున్న కాలేజీల యాజమాన్యాలు సదరు సమాచారాన్ని శుక్రవారంలోగా యూనివర్సిటీకి అందజేయాలని అధికారులు స్పష్టంచేశారు.

తీర్పునకు లోబడే ప్రవేశాలు..
పీజీఈసెట్‌లో కొన్ని కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినప్పటికీ, హైకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడే అభ్యర్థులకు అడ్మిషన్లు ఉంటాయని కన్వీనర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చే ముందు అడ్మిషన్ల విషయమై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. సదరు సమాచారాన్ని వెబ్‌సైట్ లో కూడా పెట్టామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement