pharmacy college
-
నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేస్తారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు చూడొచ్చు. కాగా, ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు. -
ఇంజనీరింగ్, ఫార్మాలో ఫీజుల వాత.. 15శాతం వరకు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి (2022–23 విద్యా సంవత్సరం) 15 శాతం మేర వార్షిక ఫీజులు పెరగబోతున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) ఈ మేరకు అనుమతినివ్వనున్నట్టు సమాచారం. ఏఎఫ్ఆర్సీ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఫీజుల పెంపు కోరుకునే అన్ని కాలేజీలు వచ్చే నెల 28లోగా తమ ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రైవేటు కాలేజీల ఆదాయ వ్యయాలను ప్రతి మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది. దీని ఆధారంగా ఫీజుల పెంపుదలకు అనుమతిస్తుంది. రాష్ట్రంలో 2019లో ఈ విధంగా అనుమతినిచ్చారు. దీని కాలపరిమితి 2021–22తో ముగిసింది. దీంతో వచ్చే మూడేళ్ళకు ఫీజుల పెంపును ఏఎఫ్ఆర్సీ ఖరారు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీస వార్షిక ఫీజు రూ.35 వేలు ఉంటే, గరిష్టంగా రూ.1.34 లక్షల వరకు ఉంది. ఎక్కువ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.75 వేలకు పైగానే ఉండటం గమనార్హం. కరోనా కాలం నో కౌంట్ ఏఎఫ్ఆర్సీ ఎప్పటిలాగే కాలేజీల నుంచి మూడేళ్ళ వివరాలు కోరింది. అయితే ఇందులో కేవలం 2019–20 కాలానికి సంబంధించిన వ్యయాన్నే పరిగణనలోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 20–21, 21–22 సంవత్సరాల్లో ఎక్కువ కాలం కరోనాతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. కాబట్టి లేబొరేటరీలు, లైబ్రరీలు ఇతర ఖర్చులన్నీ ఉండే అవకాశం లేదు. అయితే కరోనా కాలంలో సరిగా ఫీజులు వసూలు కాలేదనే కాలేజీల వాదనతోనూ కమిటీ ఏకీభవించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్ విద్యకు మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నామని, దీనికి పెద్ద మొత్తంలో ఖర్చయిందనే వాదనను తెరమీదకు తేవాలని కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నించాయి. కానీ తరహా దోపిడీపై ‘సాక్షి’ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో కమిటీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఫ్యాకల్టీ ముసుగులో అవకతవకలపై దృష్టి కాలేజీల వార్షిక వ్యయంలో సింహభాగం బోధన, బోధనేతర సిబ్బంది జీతాల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. యాజమాన్యాలు దీన్నే ప్రధానంగా ఆడిట్ లెక్కల్లో చూపుతాయి. అయితే లెక్కల్లో చూపించే విధంగా ఫ్యాకల్టీ కాలేజీల్లో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. 2019లో ఒకే అధ్యాపకుడిని రెండు, మూడు కాలేజీలు తమ ఫ్యాకల్టీగా చూపడం గమనార్హం. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) స్క్రూటినీలోనే ఇది బయటపడింది. ఈసారి ఇలాంటి అవకతవకలకు తావు లేకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఏఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. కొన్ని కాలేజీలు బోధన సిబ్బందికి సరిగా జీతాలివ్వడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడిట్ రిపోర్టులో ఎవరికి? ఏ ఖాతా ద్వారా చెల్లించారు? అనేది పరిశీలిస్తే కాలేజీల గోల్మాల్ వెలుగు చూసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా 15 శాతం ఫీజుల పెంపు అంశంపై విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఫీజులు పెంచితే ఉద్యమించక తప్పదు రెండేళ్ళుగా కరోనాతో ప్రజలు అల్లల్లాడి పోతుంటే ఫీజుల పెంచాలనే ఆలోచన ఎంతమాత్రం సహేతుకం కాదు. ప్రైవేటు దోపిడీని అడ్డుకోవాల్సిన నియంత్రణ కమిటీ, పెంపునకు మార్గం సుగమం చేయడం దారుణం. రెండేళ్ళుగా కాలేజీలే లేనప్పుడు ఖర్చు ఎలా ఉంటుంది? ఫీజులు ఎందుకు పెంచాలి? పెంపు నిర్ణయం తీసుకుంటే ఉద్యమించక తప్పదు. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) సిబ్బంది జీతాల వివరాలు బయటపెట్టాలి కరోనా సమయంలో అధ్యాపకులు, ఉద్యోగులు అర్ధాకలితో అలమటిస్తున్నా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో జీతాలు ఇవ్వలేదు. నిజంగా ఇచ్చి ఉంటే అవి బ్యాంకు ద్వారానే ఇవ్వాలి. కాబట్టి ఆ వివరాలు బయటపెట్టాలి. వాటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కాలేజీల నిర్వహణ ఖర్చుపై ఏఎఫ్ఆర్సీ ఓ నిర్ణయానికి రావాలి. అంతే తప్ప ప్రైవేటు కాలేజీల తప్పుడు లెక్కలను పరిగణనలోనికి తీసుకోకూడదు. – అయినేని సంతోష్‌కుమార్ (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) -
పనికిరాని పట్టా
శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో అందరూ (అధ్యాపకులతోపాటు ప్రిన్సిపాల్ కూడా) కాంట్రాక్టు ఉద్యోగులే.. శాశ్వత అధ్యాపకులు లేనికారణంగా పీసీఐకి బ్రేక్ పడింది. గతంలో పీసీఐ కమిటీ యూనివర్సిటీ కళాశాలకు తనిఖీలకు వచ్చినప్పుడు ప్రయోగశాలలు, గ్రంథాలయం, భవనాలు, తరగతి గదులతోపాటు వివిధ అంశాలను పరిశీలించి పలులోపాలు గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. వారుచెప్పినట్లు అధ్యాపకుల నియామక ప్రక్రియ మినహా మిగతావన్నీ విషయాల్లో సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు ప్రభుత్వం నుంచి రూపొందించి యూనివర్సిటీకి పంపించగా.. త్వరలో వర్సిటీ వివిధ విభాగాల్లో కలిపి 40 పోస్టులకు ప్రకటన విడుదల చేయనుంది. ఇందులో ఫార్మసీ విభాగంలో 18 పోస్టులున్నాయి. ఈ పోస్టులు భర్తీ అయ్యేవరకూ పీసీఐ రావడం కష్టమేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల పీసీఐ గురించి ఢిల్లీ వెళ్లిన యూనివర్సిటీ అధికారులకు వర్సిటీ త్వరలో వెలువరించే నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీచేస్తున్నట్లు సూచించారు. ఇంతలో పీసీఐ అధికారులు మరోసారి శాతవాహనకు వచ్చి తనిఖీలు నిర్వహించి సంతృప్తి చెందితేనే గుర్తింపురానుంది. లేకుంటే పోస్టుల భర్తీ అయ్యాకే పీసీఐ సంగతి తేలనుంది. 238 ఫార్మసిస్ట్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 25 జనవరి 2018న నోటిఫికేషన్ నంబర్ 04/2018 ద్వారా 238 ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 125 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 58 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 55 పోస్టులున్నాయి. ప్రకటన విడుదల చేసిన సమయంలో కేవలం ఇంటర్మీడియెట్‌తోపాటు డిఫార్మసీ చేసి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలని తెలపగా.. రెండురోజుల క్రితం డీ ఫార్మసీతోపాటు అంతకంటే హైయ్యర్కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించింది. దీంతో శాతవాహన యూనివర్సిటీ ద్వారా బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుందామంటే పీసీఐ గుర్తింపు లేకపోవడంతో అనర్హులుగా మిగిలి నిరాశచెందుతున్నారు. 200పైగా విద్యార్థులకు అనర్హత శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో 2009లో బీ ఫార్మసీ కోర్సు ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 270 మంది కోర్సులో ఉన్నారు. ఇందులో 200పైగా విద్యార్థులు పాసై ఉద్యోగాల వేటలో ఉన్నారు. వీరికి వర్సిటీకి పీసీఐ గుర్తింపు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ఫార్మసిస్ట్ ఉద్యోగాలే ఉంటాయని, వాటికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం మెడికల్ షాపులు కూడా పెట్టుకునేందుకు అవకాశం లేక ఉపాధిని కోల్పోతున్నామని మదనపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టి యూనివర్సిటీకి త్వరగా పీసీఐ గుర్తింపు తీసుకురావాలని, ఈ నోటిఫికేషన్‌కైనా పీసీఐతో సంబందం లేకుండా వారిని దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. పీసీఐతో సంబంధం పెట్టొద్దు వర్సిటీలో కోర్సు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడిచింది. ఇప్పటివరకు పీసీఐ గుర్తింపు లేదు. సమస్యపై ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. మా గోడు వెల్లబోసుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందామంటే అవకాశం లేకుండాపోతోంది. అధికారులు సమస్యను గుర్తించి పీసీఐతో సంబంధం లేకుండా నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలి. – పి.శిరీష, బీఫార్మసీ త్వరలోనే పీసీఐ కమిటీ రాక పీసీఐ అధికారులు గతంలో తనిఖీలకు వచ్చినప్పుడు పలు లోపాలు గుర్తించి సవరించుకోవాలని సూచించారు. వారు అడిగిన సమాచారంతో ఢిల్లీ వెళ్లి వచ్చాం. దీంతోపాటు యూనివర్సిటీలో శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మళ్లీ కమిటీ యూనివర్సిటీకి పరిశీలనకు రానుంది. – ఎం.కోమల్‌రెడ్డి, శాతవాహన రిజిస్ట్రార్ -
ఫార్మ్‌డీ విద్యార్ధులకు దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు
రాజంపేట: ఫార్మ్‌డీ విద్యార్ధులకు దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు మంచిగా ఉన్నాయని ఏఐటీఎస్ అధినేత చొప్పాగంగిరెడ్డి అన్నారు. అన్నమాచార్య ఫార్మశీ కళాశాలలో ఔషధాల వినియోగం, విదేశాలలో ఉద్యోగ అవకాశాలపై అర్హత పరీక్ష, ఫార్మసిస్ట్‌లకు వృత్తిపై శిక్షణ అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సునుద్ధేశించి గంగిరెడ్డి మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన మందుల తయారీ, సరఫరాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అజిముత్ కంపెనీ డైరక్టరు జోకబ్ నికోలస్ మాట్లాడుతూ ఔషదాన్ని వ్యాధిగ్రస్తునికి ఇవ్వడంలో, వ్యాధికి అవసరమైన ఔషధాలను ఉపయోగించుటలో గల మెళుకువలపై విద్యార్థులు పట్టుసాధించాలన్నారు. ఫార్మ్‌డీ విద్యార్థులకు విదేశాలలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు ఉంటాయన్నారు. వివిధ రకాల వ్యాధుల గురించి వాటిని నిర్మూలించడంలో క్లినికల్ ఫార్మసిస్ట్ చేయాల్సిన విధులను తరుచుగా తెలుసుకోవడం చాల ముఖ్యమైన అంశమన్నారు. సదస్సులో ఫార్మ్‌డీ విద్యార్ధులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
షరతులు వర్తిస్తాయి!
* 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీలకు షరతులతో అఫిలియేషన్ * పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు చేరిన కళాశాలల జాబితా * లోపాలున్న కాలేజీలకు మళ్లీ నోటీసులిచ్చిన జేఎన్టీయూహెచ్ * రేపటిలోగా వివరాలు సమర్పించాలని ఆదేశం * గేట్, జీప్యాట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా సాక్షి, హైదరాబాద్: పీజీ కళాశాలల అఫిలియేషన్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోపాలను సరిదిద్దుకోని కళాశాలలనూ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని జేఎన్టీయూహెచ్ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తమ పరిధిలో ఉన్న 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కళాశాలలకు వర్సిటీ అధికారులు షరతులతో కూడిన అఫిలియేషన్ మంజూరు చేశారు. అనంతరం సదరు జాబితాను బుధవారం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు అందజేశారు. అయితే, మరికొన్ని గంటల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అఫిలియేటెడ్ కళాశాలల జాబితా రావడంతో గేట్, జీప్యాట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకున్న గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు బుధ, గురువారాల్లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన అభ్యర్థులు వెబ్సైట్లో ఉన్న వాయిదా సమాచారం చూసి నిరాశగా వెనుతిరిగారు. వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో అధికారులు స్పష్టం చేయలేదు. కాగా, ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే పీజీఈ సెట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పూ లేదని అధికారులు పేర్కొన్నారు. ఆ కాలేజీలకు నోటీసులు... జేఎన్టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సులు నిర్వహిస్తున్న 272 ఇంజనీరింగ్ కళాశాలల్లో 145 కాలేజీలు మాత్రమే ప్రమాణాలు పాటిస్తున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మిగిలినవాటిలో 124 కళాశాలలకు జేఎన్టీయూహెచ్ బుధవారం మరోసారి నోటీసులు జారీచేసింది. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ నిష్పత్తి, బోధనేతర సిబ్బంది తదితర అంశాలపై తాజా సమాచారాన్ని అందజేయాలని అందులో ఆదేశించింది. మూడు కళాశాలల యాజమాన్యాలు మాత్రం తాము పీజీ కోర్సులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని జేఎన్టీయూహెచ్కు స్పష్టంచేశాయి. కాగా, ఎంఫార్మసీ నిర్వహిస్తున్న 104 కళాశాలల్లో లోపాలున్నట్లుగా చెబుతున్న 54 కాలేజీలకు కూడా నోటీసులు జారీఅయ్యాయి. నోటీసులు అందుకున్న కాలేజీల యాజమాన్యాలు సదరు సమాచారాన్ని శుక్రవారంలోగా యూనివర్సిటీకి అందజేయాలని అధికారులు స్పష్టంచేశారు. తీర్పునకు లోబడే ప్రవేశాలు.. పీజీఈసెట్‌లో కొన్ని కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినప్పటికీ, హైకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడే అభ్యర్థులకు అడ్మిషన్లు ఉంటాయని కన్వీనర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చే ముందు అడ్మిషన్ల విషయమై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. సదరు సమాచారాన్ని వెబ్సైట్ లో కూడా పెట్టామని వెల్లడించారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
గజ్వేల్‌రూరల్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత విద్యార్థుల నైపుణ్యం ప్రదర్శించేందుకు సైన్స్ఫెయిర్లు వేదిక కావాలని రిటైర్ట్ పరిశ్రమల శాఖ డిప్యూటీ డెరైక్టర్ అధికారి మాణయ్య అన్నారు. గురువారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ ప్రొకడెన్స్ ఫార్మసీ కళాశాలలో సైన్స్ ఫెయిర్, యువశాస్త్రవేత టాలెంట్ అవార్డు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఇలాంటి వేదికలు ఎంతగానే తోడ్పడతాయన్నారు. విద్యార్ధులు ఉపాధ్యాయులు చెప్పిన విషయలను అర్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్ధికి ఏదో ఓ రంగంపై ఆసక్తి ఉంటుందని దాని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని కోరారు. విద్యార్ధుల తల్లిదండ్రులు వారిలోని ప్రతిభను గుర్తించాలన్నారు. ప్రతి విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విషయలను ఆకళింపు చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందాలంటే సైన్స్‌ఫెయిర్ ఓ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మేనేజింగ్ కమిటీ చైర్మన్ హరిత మాట్లాడతూ ప్రొకడెన్స్ కళాశాలలో ప్రతి ఏడాది సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తామన్నారు. కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా నుంచి వందల సంఖ్యలో విద్యార్ధులు పాల్గొంటారన్నారు. మరో రెండు రోజుల పాటు సైన్స్‌ఫెయిర్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్ జయంతి, ప్రిన్సిపాల్ జస్వంత్, ఎస్ఓ నరేష్‌రెడ్డి, ఎంఓ రాయప్పరెడ్డి పాల్గొన్నారు. -
సమైక్యోద్యమం
సాక్షి, కర్నూలు: బిగిసిన ఉద్యమ పిడికిళ్లు.. గర్జించే గళాలు.. పోరుబాట వీడని అడుగులు.. జిల్లాలో సమైక్యోద్యమం ఉద్ధృతమవుతోంది. రెండు నెలలు గడిచినా.. ఆందోళనలతో ఇబ్బందులు తలెత్తుతున్నా భావి తరాల భవిష్యత్ దృష్ట్యా మౌనంగా భరిస్తూనే అన్ని వర్గాల ప్రజలు.. ఉద్యోగులు.. కార్మికులు సమైక్య వాణిని బలంగా వినిపిస్తున్నారు. విద్యార్థులు మేము సైతం అంటూ కదంతొక్కుతున్నారు. శుక్రవారం కర్నూలులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు సమరభేరి మ్రోగించారు. నంద్యాలలో ఇరిగేషన్ అధికారులు గంజి పంపిణీ చేసి విభజన జరిగితే మిగిలేది ఇదేనంటూ నిరసన తెలిపారు. పట్టణంలో చేపట్టిన రిలే దీక్షలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ-1, 2 ఎస్ఈలు జయప్రకాష్, నరసింహమూర్తి, వెంకటరమణతో పాటు కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించగా.. ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఆదోనిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఉద్యోగులు రోడ్డుపైనే స్నానాలు చేశారు. ఆళ్లగడ్డలో చిన్నకందుకూరు రైతులు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహరం నిర్మించారు. చాగలమర్రిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. శిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆలూరులో గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా.. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మద్దతు పలికారు. హొళగుందలో పోస్టాఫీసు, టెలికం కార్యాలయాలను ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. తపాలా, బ్యాంక్‌లు, ఎల్ఐసీ కార్యలయాలను మూసివేయించారు. ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్లపైనే పాఠాలు బోధించారు. వివిద పాఠశాలల విద్యార్థులు ర్యాలీగా వచ్చి సోమప్ప సర్కిల్లో మానవహరంగా ఏర్పడ్డారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్యర్యంలో ఉద్యోగులు, వ్యాపారులు, హమాలీల ఆధ్వర్యంలో ముఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కర్నూలు-గుంటూరు రహదారిపైనే బోధన నిర్వహించి నిరసన తెలిపారు. డోన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. ముస్లింలు ర్యాలీ నిర్వహించగా.. పీఈటీ టీచర్ల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు.