హరికృష్ణ
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల గుండెల్లోంచి వచ్చిందని, నాయకుల నుంచి కాదని టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడిఉన్నానని ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రకటన ద్వారా రాక్షస రాజకీయ క్రీడకు యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ తెరలేపారని విమర్శించారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలను సోనియా అడ్డుకుని దమననీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
తొలుత రాష్ట్ర విభజనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన హరికృష్ణ ఆ తరువాత రాష్ట్ర విభజన తీరు బాగాలేదని నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ప్రతి తెలుగు వాడిని దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. తెలుగు వారంతా కలిసి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని, ఎవరిని అడిగి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. తెలుగువారిని విడగొట్టే హక్కు సోనియా గాంధీకి ఎవరిచ్చారని హరికృష్ణ ప్రశ్నించారు.