- ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
ఈడుపుగల్లు (కంకిపాడు) : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఏపీ ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ. అశోక్‌బాబు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్‌జీవోల సంఘం కంకిపాడు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈడుపుగల్లులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం రాత్రి జరిగింది. అశోక్‌బాబు హాజరై ప్రసంగించారు.
రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగటానికి సహకరించిన ప్రజలకు ఉద్యోగులంతా రుణపడి ఉన్నారన్నారు. విభజన ప్రభావం మరో ఇరవై ఏళ్లు ఉంటుందని, అప్పటి వరకూ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై స్పందించి పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని సూచించారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్‌జీవో హోమ్‌కు 5 సెంట్ల స్థలం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తోట్లవల్లూరు జెడ్పీటీసీ, వైఎస్సార్‌సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల హక్కులను గౌరవిస్తూ ప్రజా సమస్యలపై పని చేయాలని సూచించారు.
రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏడీ, డాక్టర్ నగేష్‌బాబు , ఎన్‌జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కంకిపాడు జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్, ఈడుపుగల్లు, కోలవెన్ను సర్పంచులు షేక్ మాబు సుబాని, తుమ్మల చంద్రశేఖర్, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర కృష్ణమోహన్ పాల్గొన్నారు. తొలుత కంకిపాడు తాలూకా యూనిట్ కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.