Asokbabu
-
అశోక్‌బాబుపై చీటింగ్ కేసు పెట్టాలి
ఏపీఎన్జీవో నేతపై హైదరాబాద్ టీఎన్జీవో నేతల ధ్వజం కేంద్ర హోంమంత్రిని కలిసినట్టు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపాటు సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినట్టు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకి పంపాలని హైదరాబాద్ టీఎన్జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు. గురువారం టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను పార్లమెంట్‌లోని ఆయన చాంబర్లో కలిసినట్టు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎం. సత్యనారాయణగౌడ్ విజయ్‌చౌక్‌లో మీడి యాతో మాట్లాడుతూ, తాము హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసినప్పుడు అశోక్‌బాబు ఎవరో తెలియదని, ఏపీఎన్జీవోల నుంచి ఎవరూ తనను కలవలేదని చెప్పారని అన్నారు. ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవో భవనంలో మాకు రావాల్సిన 42 శాతం వాటా కోసం దీక్షలు చేస్తే, గవర్నర్‌ను తప్పుదోవ పట్టించేలా అశోక్‌బాబు ఫిర్యాదు చేశారు’ అని సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. తెలంగాణలో ఏపీఎన్జీవోలకు రక్షణ లేదంటూ చేస్తున్న ఫిర్యాదుల్లో వాస్తవం లేదన్నారు. వీటిపై పూర్తి నివేదికలను కేంద్ర హోంమంత్రికి ఇచ్చినట్టు టీఎన్జీవో సంఘ నేత ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
ప్రజల కోసమే పనిచేయాలి
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఈడుపుగల్లు (కంకిపాడు) : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ. అశోక్‌బాబు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోల సంఘం కంకిపాడు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈడుపుగల్లులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం రాత్రి జరిగింది. అశోక్‌బాబు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగటానికి సహకరించిన ప్రజలకు ఉద్యోగులంతా రుణపడి ఉన్నారన్నారు. విభజన ప్రభావం మరో ఇరవై ఏళ్లు ఉంటుందని, అప్పటి వరకూ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై స్పందించి పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని సూచించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్జీవో హోమ్‌కు 5 సెంట్ల స్థలం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తోట్లవల్లూరు జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల హక్కులను గౌరవిస్తూ ప్రజా సమస్యలపై పని చేయాలని సూచించారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏడీ, డాక్టర్ నగేష్‌బాబు , ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కంకిపాడు జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్, ఈడుపుగల్లు, కోలవెన్ను సర్పంచులు షేక్ మాబు సుబాని, తుమ్మల చంద్రశేఖర్, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర కృష్ణమోహన్ పాల్గొన్నారు. తొలుత కంకిపాడు తాలూకా యూనిట్ కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
సమైక్య ద్రోహులకు రాజకీయ సమాధే!
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర కోసం కృషి చేయని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియలో మొదటి అంకం పూర్తయ్యిందన్నారు. కేంద్ర మంత్రులు సీమాంధ్ర ప్రజలు సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియను అడ్డుకోలేదు సరికదా.. ప్రభుత్వంపై కనీసం ఒత్తిడి తెచ్చే యత్నం కూడా చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, చివరి అవకాశాన్ని వినియోగించుకుని రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం పడిపోయేలా చేయాలని సూచించారు. సోమవారం అన్ని వర్గాల ప్రజలు విద్రోహ దినం పాటించాలని పిలుపునిచ్చా రు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా గుడ్డిగా వెళుతున్న కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గుణ పాఠం చెప్పాయన్నారు. ఏపీ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్రమంత్రుల చేతకానితనం వల్లే టీనోట్ ఆమోదం పొందిందన్నారు. కేంద్రమంత్రులు పదవులకు రాజీనామా చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగులతో కలసి వస్తే విభజనను అడ్డుకోవచ్చని ప్రజాప్రతినిధులకు సూచించారు. విభజన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పొందూరుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బి. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఈ సమావేశంలో ఎన్జీవో సంఘ ప్రతినిధులు హనుమంతు సాయిరాం, ఎస్వీ రమణ, ఈశ్వరరావు, శివారెడ్డి, మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.కాళీప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, కొంక్యాణ వేణుగోపాల్, పి.రామ్మోహనరావు, ఆర్.వేణుగోపాల్, పి.జయరాం, శిష్టు రమేష్, కిలారి నారాయణరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పూజారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
అశోక్‌బాబూ! తెలంగాణ గురించి తెలుసుకో.!
అనంతగిరి, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమం గురించి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాల గురించి ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలుసుకొని మాట్లాడాలని, ఇందుకోసం ఆయన ఈ నెల 22న వికారాబాద్‌లో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నందకుమార్ ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న వికారాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ పునర్నిర్మాణం - మన కర్తవ్యం’ సదస్సు వాల్‌పోస్టర్లను స్థానిక అతిథిగృహంలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం నందకుమార్ మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. సీమాంధ్రకు ఎలాంటి అన్యాయాలు జరిగాయి, ఏ విధంగా నష్టపోయిందీ వికారాబాద్ సదస్సుకు వచ్చి అశోక్‌బాబు వివరించాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది ప్రాణాలర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రకటన వచ్చిందన్న సంగతిని విస్మరించరాదన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్, ముఖ్య సలహాదారు చిగుళ్లపల్లి రమేష్కుమార్లు మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు తమ జీతాలను త్యాగం చేసి పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. యువత, మేధావులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో పాల్గొని 22నాటి సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, డాక్టర్స్ జేఏసీ చైర్మన్ మెతుకు ఆనంద్, ఉద్యోగ జేఏసీ నాయకులు రవీందర్ రెడ్డి, అమర్‌శెట్టి, సుశీల్, అజయ్, ప్యాట మల్లేశం, వీరభద్రయ్య పాల్గొన్నారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు
హైదరాబాద్: సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎల్బి స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సభ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందనరాలేదన్నారు. సభకు అనుమతిపై రేపు పోలీసులు చెప్పకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సమైక్యరాష్ట్రంకోరుకునే ప్రతిఒక్కరూ ఈ సభకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజకీయ అజెండా లేకుండావస్తే పార్టీ నేతలనూ ఆహ్వానిస్తామని అశోక్‌బాబు చెప్పారు. సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తూ లక్ష మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే రోజు తాము కూడా హైదరాబాద్‌లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ జేఏసీ నేతలు చెప్పారు. దీంతో సెప్టెంబరు 7న హైదరాబాద్‌లో ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభజన కొట్టవచ్చినట్లు కనపడుతోంది. పోటాపోటీగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యమాలు నడుపుతున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో బహిరంగ సభకు పోలీసులు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు