సమైక్య ద్రోహులకు రాజకీయ సమాధే!
Published Mon, Dec 9 2013 4:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర కోసం కృషి చేయని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియలో మొదటి అంకం పూర్తయ్యిందన్నారు. కేంద్ర మంత్రులు సీమాంధ్ర ప్రజలు సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియను అడ్డుకోలేదు సరికదా.. ప్రభుత్వంపై కనీసం ఒత్తిడి తెచ్చే యత్నం కూడా చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, చివరి అవకాశాన్ని వినియోగించుకుని రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం పడిపోయేలా చేయాలని సూచించారు. సోమవారం అన్ని వర్గాల ప్రజలు విద్రోహ దినం పాటించాలని పిలుపునిచ్చా రు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా గుడ్డిగా వెళుతున్న కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గుణ పాఠం చెప్పాయన్నారు.
ఏపీ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్రమంత్రుల చేతకానితనం వల్లే టీనోట్ ఆమోదం పొందిందన్నారు. కేంద్రమంత్రులు పదవులకు రాజీనామా చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగులతో కలసి వస్తే విభజనను అడ్డుకోవచ్చని ప్రజాప్రతినిధులకు సూచించారు. విభజన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పొందూరుకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ బి. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఈ సమావేశంలో ఎన్జీవో సంఘ ప్రతినిధులు హనుమంతు సాయిరాం, ఎస్‌వీ రమణ, ఈశ్వరరావు, శివారెడ్డి, మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.కాళీప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, కొంక్యాణ వేణుగోపాల్, పి.రామ్మోహనరావు, ఆర్.వేణుగోపాల్, పి.జయరాం, శిష్టు రమేష్, కిలారి నారాయణరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పూజారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement