అశోక్‌బాబుపై చీటింగ్ కేసు పెట్టాలి
- ఏపీఎన్‌జీవో నేతపై హైదరాబాద్ టీఎన్‌జీవో నేతల ధ్వజం
- కేంద్ర హోంమంత్రిని కలిసినట్టు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినట్టు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకి పంపాలని హైదరాబాద్ టీఎన్‌జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు.
గురువారం టీఆర్‌ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను పార్లమెంట్‌లోని ఆయన చాంబర్‌లో కలిసినట్టు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎం. సత్యనారాయణగౌడ్ విజయ్‌చౌక్‌లో మీడి యాతో మాట్లాడుతూ, తాము హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసినప్పుడు అశోక్‌బాబు ఎవరో తెలియదని, ఏపీఎన్‌జీవోల నుంచి ఎవరూ తనను కలవలేదని చెప్పారని అన్నారు.
‘రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లోని ఏపీఎన్‌జీవో భవనంలో మాకు రావాల్సిన 42 శాతం వాటా కోసం దీక్షలు చేస్తే, గవర్నర్‌ను తప్పుదోవ పట్టించేలా అశోక్‌బాబు ఫిర్యాదు చేశారు’ అని సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. తెలంగాణలో ఏపీఎన్‌జీవోలకు రక్షణ లేదంటూ చేస్తున్న ఫిర్యాదుల్లో వాస్తవం లేదన్నారు. వీటిపై పూర్తి నివేదికలను కేంద్ర హోంమంత్రికి ఇచ్చినట్టు టీఎన్‌జీవో సంఘ నేత ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.