ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో ఏపీఎన్జీవోలు సోమవారం రాత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బీజేపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు రాజ్నాథ్కు వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ఏ విధంగా నష్ట పోతుందనే అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీమాంధ్రలో సమైక్య సెగలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. వంద రోజుల దాటి సమైక్య ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో సీమాంధ్ర మంత్రులు వైఖరిపై అశోక్ బాబు మండిపడ్డారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. 'మా దురదృష్టం.. మా కేంద్ర మంత్రులు, మా మంత్రులు చేతకాని వాళ్లు' అని విమర్శించారు. యూటీ, ప్యాకేజీలంటూ వారు మాట్లాడటం వారి అమాయకత్వమన్నారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కన్వీన్స్ అయ్యారేమో కానీ తాము మాత్రం కాదని అశోక్ బాబు తెలిపారు. ప్రధానితో జరిగిన భేటిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) ప్రాంతంగా చేయాలని ప్రధానికి విజ్ఞప్తికి చేసిన నేపథ్యంలో అశోక్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు, యూటీ ప్రాంతాలంటూ కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం తగదని సూచించారు.