అశోక్‌బాబూ! తెలంగాణ గురించి తెలుసుకో.!
Published Thu, Sep 19 2013 4:02 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
అనంతగిరి, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమం గురించి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాల గురించి ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలుసుకొని మాట్లాడాలని, ఇందుకోసం ఆయన ఈ నెల 22న వికారాబాద్‌లో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నందకుమార్ ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న వికారాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ పునర్నిర్మాణం - మన కర్తవ్యం’ సదస్సు వాల్‌పోస్టర్లను స్థానిక అతిథిగృహంలో బుధవారం ఆవిష్కరించారు.
అనంతరం నందకుమార్ మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. సీమాంధ్రకు ఎలాంటి అన్యాయాలు జరిగాయి, ఏ విధంగా నష్టపోయిందీ వికారాబాద్ సదస్సుకు వచ్చి అశోక్‌బాబు వివరించాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది ప్రాణాలర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రకటన వచ్చిందన్న సంగతిని విస్మరించరాదన్నారు.
జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్, ముఖ్య సలహాదారు చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌లు మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు తమ జీతాలను త్యాగం చేసి పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. యువత, మేధావులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో పాల్గొని 22నాటి సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, డాక్టర్స్ జేఏసీ చైర్మన్ మెతుకు ఆనంద్, ఉద్యోగ జేఏసీ నాయకులు రవీందర్ రెడ్డి, అమర్‌శెట్టి, సుశీల్, అజయ్, ప్యాట మల్లేశం, వీరభద్రయ్య పాల్గొన్నారు.
Advertisement