సాక్షి, కడప :
సమైక్య ఉద్యమంలో ప్రజలు అలుపెరగని పోరును కొనసాగిస్తున్నారు. రోజురోజుకు ఆందోళనలు ఉధృతం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు మండిపడుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, రిలే దీక్షలతో ప్రజలు సమైక్య నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఉద్యమబాట వీడబోమని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని వినూత్న రీతిలో ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 350 బస్తాల బియ్యం, కడపలో 650 మంది ఆర్టీసీ కార్మికులకు పారా మెడికల్, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో బియ్యం, బేడలు, నూనెను పంపిణీ చేసి తమవంతు చేయూత అందించారు.
కడప నగరంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ వేలాది మంది విద్యార్థులు జగన్ ఫ్ల కార్డులు చేతబూని పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ కదం తొక్కారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. 650 మంది ఆర్టీసీ కార్మికులకు మెడికల్, పారా మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో బియ్యం, బేడలు, నూనె లాంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వీటితోపాటు మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, పంచాయతీరాజ్, సాగునీటిపారుదల, వాణిజ్య పన్నులశాఖ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ, వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో సమైక్య వాదుల దీక్షలు కొనసాగాయి.
జమ్మలమడుగు పట్టణంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో వైద్యులు, నర్సులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంధులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీపీపీలో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేపట్టారు. బైక్ ర్యాలీ నిర్వహించారు.
పులివెందుల పట్టణంలో ఎన్జీఓలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ర్యాలీలో ప్రభుత్వ వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రైతు దీక్షలకు సంఘీభావం తెలిపారు.
ప్రొద్దుటూరులో క్రైస్తవుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఆస్పత్రుల్లో ఓపీని బయటే నిర్వహించి నిరసన తెలిపారు.
కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరులో జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, షిండే దిష్టిబొమ్మలకు మాస్క్‌లు తొడిగి చెప్పులు, పొరకలతో కొడుతూ నిరసన తెలిపారు. చెన్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాజంపేటలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, ఎన్జీఓల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోకాళ్లపై, వెనక్కి నడుస్తూ ఆందోళనలు చేపట్టారు. హెచ్‌ఎంఎం హైస్కూలు విద్యార్థులు విభజన జరిగితే కలిగే నష్టాలను వివరించే ఫ్ల కార్డులను చేతబూని ర్యాలీ నిర్వహించారు.
మైదుకూరులో బాలశివ హైస్కూలు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలులో రాజుపాలెం సర్పంచ్ గుత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో వెంగమాంబ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పిరమిడ్ ఆకారంలో నిరసన తెలిపారు. కాశినాయన, కలసపాడులలో ఆందోళనలు కొనసాగాయి.
రాయచోటి పట్టణంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దాతలు ఆర్టీసీ కార్మికులకు 350 బియ్యం బస్తాలను ఉచితంగా పంపిణీ చేశారు. సమైక్య జేఏసీ, న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి.
సమైక్య ఉద్యమ పోరు
Published Fri, Oct 11 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement