రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనకు మీరు ఒక కారణం కాదని చెప్పగలరా? అధిష్టానం పెద్దలతో ప్యాకేజీ గురించి చర్చించిన మాట వాస్తవమా? కాదా? పదవిని వదిలిపెట్టుకోవడం ఇష్టంలేక మీరు మౌనంగా ఉన్నారా?లేదా? పదవిలో కొనసాగడం కోసం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవమా? కాదా? సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ఆర్టీసి కార్మికుల జీవితాల గురించి ఆలోచన చేస్తున్నారా? అని ముఖ్యమంత్రిపై ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పెద్దల లాబీతో సోనియా గాంధీ నియమించిన ముఖ్యమంత్రి అధికార దాహంతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు. ఈ డమ్మీ ముఖ్యమంత్రి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. పదవీ కాంక్షతో డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఈ గతి పట్టడానికి ముఖ్యమంత్రి కూడా ఒక కారణం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల పేరుతో కాలం గడుపుతున్నారన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కైయ్యారన్నారు. విభజన విషయంలో తన వాదన స్పష్టం చేయకుండా చంద్రబాబు బస్సు యాత్ర చేయడం ఏమిటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.