రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన బ్లాంక్ చెక్ లాంటి లేఖతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించే ధైర్యం చేసిందన్నారు. 2009 డిసెంబరు 9న తెలంగాణకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసిన తరువాత చంద్రబాబు తమతో రాజీనామా చేయించినట్లు చెపారు. రెండు చోట్ల పార్టీ ఉండాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావో చెప్పాలని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.