విభజనకు కారకుడు చంద్రబాబు: కొడాలి నాని
హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన బ్లాంక్ చెక్ లాంటి లేఖతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించే ధైర్యం చేసిందన్నారు.
2009 డిసెంబరు 9న తెలంగాణకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసిన తరువాత చంద్రబాబు తమతో రాజీనామా చేయించినట్లు చెపారు. రెండు చోట్ల పార్టీ ఉండాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావో చెప్పాలని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
విభజనపై వైఎస్ఆర్ సిపి మొదట్నుంచి చెబుతున్న అంశాన్నే చంద్రబాబు ఇప్పుడు కాపీ కొట్టారన్నారు. చంద్రబాబు కాపీ రాయుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజనపై చంద్రబాబు అఖిలపక్షానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా? అని నాని ప్రశ్నించారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు లక్షల కోట్లు కావాలన్నది నిజం కాదా? అని అడిగారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో వెన్నుముక లేని వ్యక్తులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు అని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్లు బతికుంటే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెన్నులో వణుకు పుట్టేదని చెప్పారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు రాజీనామాలు చేసి తమ వైఖరి స్పష్టం చేయాలని నాని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే మిగిలినవారు కూడా రాజీనామా చేసి ఉంటే రాష్ట్ర విభజన ప్రకటించేవారు కాదన్నారు.
వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాగోలా దెబ్బకొట్టాలని చంద్రబాబు టిఆర్ఎస్తో జతకట్టి తెలంగాణ ఇచ్చివేయమని 2008లో లేఖ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరంలేదని లేఖ ఇచ్చారన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు చెబుతుంటారని, అది పచ్చి అబద్ధం అన్నారు. వాస్తవానికి వైఎస్ఆరే అభివృద్ధి చేశారని చెప్పారు.