కలెక్టరేట్, నూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం అవిశ్రాంతంగా ఉవ్వెత్తున కొనసాగుతోంది. విభిన్న, వినూత్న ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమకారులు హోరెత్తిస్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలు బైక్ ర్యాలీలు నిర్వహించగా క్రైస్తవ సోదరులు ప్రదర్శన, ప్రార్థనలు జరిపారు. పాలకొండలో వందలాది ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణాన్ని దిగ్బంధిం చారు. పాతపట్నంలో సమైక్యాంధ్ర, తెలంగాణ గుర్రాల పోటీ నిర్వహించగా పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, వంటావార్పు, మానవహారాలు కొనసాగాయి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలతోపాటు కుల సంఘాల వారు కూడా పాలుపంచుకున్నారు.
శ్రీకాకుళంలో జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ అరసవల్లిలో ప్రారంభమై.. సూర్యమహల్, రామలక్ష్మణ, డే అండ్ నైట్ జంక్షన్, వైఎస్‌ఆర్ కూడలి మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుంది. పట్టణ దేవాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్‌జీవో హోం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్, వాసవి వనిత క్లబ్, ఆవోపాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జేసీస్ ఫెమినా మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ జరిపారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ చేపట్టిన ర్యాలీ, మహిళా కళాశాల రోడ్డులోని క్రైస్తవారాధన మందిరం నుంచి సూర్యామహల్, జీటీ రోడ్డు మీదుగా వైఎస్‌ఆర్ కూడలికి చేరుకుంది. సూర్యమహల్ , వైఎస్‌ఆర్ కూడళ్లలో క్రైస్తవులు మోకాళ్లపై కూర్చుని ప్రార్ధనలు చేశారు. అక్కడి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్ కూడలి చేరుకొని ప్రార్ధనలు నిర్వహించారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక మహిళా విభాగం కన్వీనర్ వై.గీత ఆధ్వర్యంలో మహిళలు పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఆమదాలవలస మండలం వంజంగి గ్రామస్తులు పాలకొండ రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ జరిపి మానవహారం నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డును దిగ్బంధించారు. వంజంగిపేట యువకులు గ్రామ సమీపంలోగల సెల్‌టవర్ ఎక్కి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పొందూరు మండలం లోలుగులో ఉద్యమకారులు ర్యాలీ తీసి రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరుబుజ్జిలి సెంటర్‌లో యువకులు రోడ్డు దిగ్బంధం నిర్వహించారు. చిగురువలస, పురుషోత్తపురం, షళంత్రి గ్రామాల వద్ద రోడ్లపై ఉద్యమకారులు బైఠాయించారు. పాలకొండలో జైభీమ్ నాటుబండ్ల సంఘం ఆధ్వర్యంలో నాటుబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలవారు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో బైఠాయింపు, రాస్తారోకో, సోనియా దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు జరిగాయి. భామిని మండలం ఘనసరలో బంద్ నిర్వహించారు. బాలేరు గ్రామంలో రోడ్డుపై వంటావార్పు చేపట్టారు.
అనంతరం భోజనాలు చేశారు. భామినిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. రాజాంలో కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన తెలిపారు. నరసన్నపేటలో దేవాంగులు, విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ ప్రతినిధులు ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొత్తూరులో సమక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. వందలాదిమంది యువకులు నాలుగు రోడ్ల కూడలిలో మానవహరంగా ఏర్పడ్డారు. వంగర బస్టాండ్ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు ధర్నా చేశారు. రణస్థలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామతీర్థం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సారవకోట మండలం దబడులక్ష్మిపురంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
లావేరు మండలం కేశవరాయునిపాలెంలో మానవహారం నిర్వహించారు. పలాస-కాశీబుగ్గలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు. మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాశీబుగ్గ మూడు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పలాస కాశీబుగ్గ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నాలుగో రోజు కూడా రిలేనిరాహార దీక్షలు కొనసాగాయి.
మరింత పెరిగిన ఉద్యమ జోరు
Published Mon, Aug 12 2013 3:11 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement
Advertisement