సమైక్యతే లక్ష్యంగా.. | united andhra prdesh is our target | Sakshi
Sakshi News home page

సమైక్యతే లక్ష్యంగా..

Published Sat, Sep 14 2013 4:08 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

united andhra prdesh is our target

 సాక్షి, రాజమండ్రి :
 పాలపొంగులా అణగిపోతుందన్న పాలకపక్షం అంచనాను తలకిందులు చేస్తూ సమైక్య ఉద్యమం నానాటికీ తీవ్రతరమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయంపై కన్నెర్రజేస్తున్న సమైక్యవాదులు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ విశ్రమించేది లేదంటున్నారు. శుక్రవారం జిల్లాలోని ఓఎన్‌జీసీ, రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి కే ంద్రాలను ముట్టడించారు. బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా, ఎల్‌ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్, జీవిత బీమా, ఎఫ్‌సీఐ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలను స్తంభింపజేశారు.
 
 కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, రైతులు, ఉపాధి కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందిన సుమారు 5000 మంది ఉదయం ఓడలరేవులోని ఓఎన్‌జీసీ టెర్మినల్‌ను ముట్టడించారు. ప్లాంటు లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ప్లాంటు మూసివేసి సమైక్యాంధ్ర పరిరక్షణకు సహకరించాలని డిమాండ్ చేశారు. చర్చల అనంతరం చివరికి ఉత్పత్తి నిలిపివేస్తున్నట్టు అధికారులు లిఖితపూర్వకంగా ప్రకటించారు. మరోవైపు తాళ్లరేవు మండలం గాడిమొగలోని రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని సమైక్యవాదులు ముట్టడించి ఉత్పత్తి నిలుపు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ, కోనసీమ ప్రాంతాల నుంచి ప్లాంటు వద్దకు చేరుకుని సమైక్య నినాదాలు చేశారు. ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ప్లాంటులోని ‘ఎ’ షిఫ్టులో ఉత్పత్తి నిలుపు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పడంతో సమైక్యవాదులు వెనుదిరిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్లాంటులో ఉత్పత్తి నిలుపుచేశారు. కాగా ఈ నెల 16 నుంచి నిరవధికంగా ఉత్పత్తి నిలుపు చేసేలా ఈ ప్లాంటుపై ఒత్తిడి తెస్తామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.
 
 సమైక్యవాదులు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, కార్యకలాపాలను స్తంభింప చేశారు. రాజమండ్రిలో ఏపీఎన్‌జీఓలు ఓఎన్‌జీసీ, గెయిల్, సెంట్రల్ ఎక్సైజ్, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ల్, తపాలా శాఖ కార్యాలయాలను ముట్టడించి ఉద్యోగులను బయటికి పంపారు. ఎన్‌జీఓల సంఘం అధ్యక్షులు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ధవళేశ్వరంలో ఏపీఎన్‌జీఓలు ఓఎన్‌జీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. అమలాపురంలో ఆదాయపు పన్ను శాఖ, పోస్టాఫీసు, బీఎస్‌ఎన్‌ల్ కార్యాలయాలను ముట్టడించారు. ముమ్మిడివరంలో టెలిఫోన్ ఎక్సేంజి, పోస్టల్ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించి సమైక్య నినాదాలు చేశారు. సామర్లకోటలో భారత ఆహార సంస్థ కార్యాలయాన్ని, పెద్దాపురంలో జీవిత బీమా సంస్థ కార్యాలయాలను ఎన్‌జీఓల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మూయించారు.
 
 ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు
 జిల్లావ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. రాజమండ్రిలో విద్యుత్తు ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కార్యాలయం గేటుకు తాళం వేసి సమైక్య నినాదాలు చేశారు. ఓ పక్క అత్యవసర సర్వీసులను పర్యవేక్షిస్తూ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. బొమ్మూరు 220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. కాకినాడ రామారావుపేట విద్యుత్తు సబ్‌స్టేషన్ ఎదుట దీక్షలు చేపట్టారు. అమలాపురం డివిజన్‌కు చెందిన 200 మంది విద్యుత్తు ఉద్యోగులు కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. ఈదరపల్లి వంతెన వద్ద విద్యుత్తు ఉద్యోగులు రాస్తారోకోచేశారు. వీరికి ఆర్డీఓ సంపత్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద  మానమహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెం వద్ద విద్యుత్తు శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేసి దీక్షల్లో పాల్గొన్నారు. రాజానగరంలో విద్యుత్తు ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో పాల్గొన్నారు. వారికి స్థానిక జేఏసీలతో పాటు రాజమండ్రి నుంచి మోటార్ సైకిళ్లపై విద్యుత్తు ఉద్యోగులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. విద్యుత్తు ఉద్యోగులు జగ్గంపేట సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.
 
 ప్రదర్శనలు, బంద్‌లు..
 రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉద్యోగులు సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మన్న, శ్రీనాథ కవిసార్వభౌముడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి తదితర వేషధారణలతో సమైక్య నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అంబాజీపేటలో  పదిమంది సర్పంచ్‌లు కళ్లకు గంతలతో జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్‌లో ఉపాధ్యాయుల జేఏసీ భిక్షాటన చేపట్టింది. పి.గన్నవరంలో భారీ జాతీయ పతాకంతో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. షణ్యుఖ, సీతారామ యోగ శిక్షణా కేంద్రాల అభ్యాసకులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు. వ్యాపార సంస్థలు, విద్యాలయాలను మూయించారు. రోడ్లపై ర్యాలీచేసి నినాదాలు చేశారు. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో బంద్ సందర్భంగా ప్రధాన కూడళ్లలో సమైక్యవాదులు రాస్తారోకోలు చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీ చేసి బంద్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతుగా పెద్దాపురంలో తోపుడు బండ్ల సంఘం రోడ్డుపై తోపుడు బండ్లు పెట్టి ఐదు గంటల పాటు రాస్తారోకో చేశారు.  జేఏసీ పిలుపు మేరకు ఏలేశ్వరంలో 48 గంటల బంద్ కొనసాగుతోంది.
 
 అంతటా సమైక్య నాదమే
 రాజమండ్రిలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. కంబాలచెరువు వద్ద విద్యార్థులు ర్యాలీ చేసి సమైక్య నినాదాలు చేశారు. బొమ్మూరు పాలిటెక్నిక్ ఉద్యోగులు ఒక్కరోజు రిలే దీక్ష చేపట్టారు. మోరంపూడి సెంటర్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు, జెడ్పీ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. జేఏసీ శిబిరం వద్ద ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. అమలాపురం మండలం ఎన్.కొత్తపల్లిలో టైలర్లు ర్యాలీ చేసి జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. ఉప్పలగుప్తంలో వాయిద్య కళాకారులు రాస్తారోకో చేశారు. రాజోలులో ఎల్‌ఐసీ ఏజెంట్లు రిలే దీక్షలు ప్రారంభించారు. సఖినేటి పల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఉద్యోగులు కార్లు తుడిచి  నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో టేకిశెట్టిపాలెంలో కొవ్వొత్తుల ప్రదర్శ చేశారు. తుని పట్టణంలో టాటా మేజిక్ వాహన నిర్వాహకులు ర్యాలీ చేసి చాంబర్ ఆఫ్ కామర్స్ జేఏసీ చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షా శిబిరాలను ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఆటో కార్మికులు రాస్తారోకో చేశారు. రౌతులపూడిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. జ గ్గంపేటలో వివేకానంద పాఠశాల విద్యార్థులు రోడ్డుపై డ్రిల్లు చేస్తూ సమైక్య నినాదాలు చేశారు. గోకవరంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులురోడ్డు ఊడ్చి  నిరసన తెలిపారు. మండపేట కలువపువ్వు సెంటర్‌లో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకారంలో మానవ హారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.
 
 విద్యార్థిని సమైక్య పరుగు
 రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సునంద అనే విద్యార్థిని రామచంద్రపురం మండలం జువ్విపాడు నుంచి ఎల్‌ఐసీ భవనం వరకూ ఎనిమిది కిలోమీటర్లు సమైక్య పరుగు చేపట్టింది. ఆమెకు మద్దతుగా ఉపాధ్యాయులు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కె.గంగవరం మండలం కుందూరులో ఉపాధ్యాయులు పాదయాత్ర చేశారు. రాజవొమ్మంగిలో ఉపాధ్యాయులు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్‌లో ముస్లింలు  వంటా వార్పూ చేపట్టారు.
 
 ఇంటింటా సమైక్య పతాకాలు
 ప్రతి ఇంటిపై సమైక్య జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంలో భాగంగా జేఏసీ రాజానగరం మండల కలవచర్ల నుంచి కార్యక్రమం ప్రారంభించింది. మహిళలు ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంటి ఇల్లాలికి బొట్టు పెట్టి వారికి సమైక్య పతాకాన్ని అందించారు. కలవచర్లలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని ముట్టడించి ప్రధాన గేటుకు తాళం వేశారు. సీతానగరం మండలం ముగ్గళ్లలో సమైక్యవాదులు వంటా వార్పూ చేపట్టారు. సీతానగరంలో కొనసాగుతున్న జేఏసీ రిలే దీక్షల్లో 9 మంది సర్పంచ్, ఉప సర్పంచ్‌లు దీక్షలు చేపట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement