సాక్షి, కాకినాడ :
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులు, కార్మికులకు జీతాలే కాదు... వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈనెల పింఛన్‌లు అందని పరిస్థితి నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలై 36 రోజులైంది. ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమం బడుగు జీవుల పాలిట ఆశనిపాతంగా మారింది.. జిల్లాలో ప్రస్తుతం 4,38,560 పింఛన్లు ఉండగా, వీటిలో 2,04, 703 వృద్దాప్య, 1,29,107 వితంతు, 60,094 వికలాంగ, 8331 చేనేత, 2377 కల్లుగీత పింఛన్లు ఉండగా,వైఎస్సార్ అభయహస్తం పథకం కింద మరో 33,948 పింఛన్లు అందజేస్తు న్నారు. వీటి కోసం ప్రతీఏటా రూ.12కోట్ల ఖర్చు చేస్తున్నారు. 35 మండలాల పరిధిలోని 2.30 లక్షల మందితో పాటు కార్పొరేషన్లు, మున్సిపాల్టీ పరిధిలోని 70వేలమందితో పాటు ఐ.పోలవరం, కాకినాడ రూరల్ మండలాల పరిధిలోని మరో 10వేల మంది పింఛన్‌దారులకు సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా పంపిణీ జరుగుతుండగా, ఇక మిగిలిన 21 మండలాల పరిధిలోని లక్షా 28వేల మందికి ఎంపీడీఒల ద్వారా పంపిణీ జరిగేది.
పంపిణీపై సమ్మె ప్రభావం
సమైక్య ఉద్యమం కారణంగా పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. పింఛన్ కేటాయింపులు గ్రీన్‌చానల్ పరిధిలో ఉండడంతో నిధుల కేటాయింపులో ఇబ్బందుల్లేవు. నేరుగా సంబంధిత బ్యాంకులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల అకౌంట్లలో పింఛన్‌దారుల సంఖ్యను బట్టి జమవుతుంది. అదే విధంగా ఈ నెల కూడా పింఛన్ మొత్తం వారి అకౌంట్‌లలో జమైంది. దీంతో సర్వీస్‌ప్రొవైడర్స్ ద్వారా పంపిణీకి బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సమైక్య వాదులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొన్ని మండలాల్లో గతరెండురోజులుగా పంపిణీకి సర్వీస్ ప్రొవైడర్స్ శ్రీకారం చుట్టగా, తామందరం సమ్మెలో ఉంటే తమ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఏ విధంగా పంపిణీ చేస్తారంటూ కార్యదర్శులు, ఇతర రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకొని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో డబ్బులున్నప్పటికీ పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఈనెల 6 నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సమ్మెకు తెరపడే వరకు పింఛన్ల పంపిణీ సజావుగా జరిగే సూచనలు కన్పించడం లేదు.
పింఛన్ల పంపిణీపై సమ్మెప్రభావం
పింఛన్ల పంపిణీపై సమ్మె ప్రభావం తీవ్రంగానే ఉంది. సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా పంపిణీకి ఆయా బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సమైక్యవాదులు అడ్డుకుంటున్న విషయం మా దృష్టికి రాలేదు. పింఛన్ల పంపిణీ జరిగేటట్టు సహకరించాల్సిందిగా సమ్మెలో ఉన్న ఎంపీడీఓలను కూడా కోరాం. సమ్మెలో ఉన్నందున వీలుపడదని వారు తేల్చి చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆగుతాం. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
- పి.చంద్రశేఖరరాజు, డీఆర్డీఏ పీడీ
నిధులున్నా నిలిచిన పింఛన్ల పంపిణీ
Published Fri, Sep 6 2013 3:37 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement