బాబు వచ్చె..పింఛన్ పోయె..! | 14 lakh pensions cancelled by TDP govt | Sakshi
Sakshi News home page

బాబు వచ్చె..పింఛన్ పోయె..!

Published Wed, Dec 10 2014 2:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

బాబు వచ్చె..పింఛన్ పోయె..! - Sakshi

బాబు వచ్చె..పింఛన్ పోయె..!

 టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.వెయ్యి, రూ.1500 పింఛన్ అందుతుందని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంబర పడ్డారు. కష్టాలు తొలగుతాయని, ఆర్థిక ఆసరా కలుగుతుందని ఆశించారు. అయితే, వారి ఆశలు ఆవిరయ్యాయి. బాబు వేసిన రాజకీయ కమిటీలు... అసలుకే ఎసరు పెట్టాయి. పింఛన్లకు కోత వేశాయి. బతుకును దుర్భరం చేశాయి. బాబూ నాకు అన్ని అర్హతలూ ఉన్నాయి... కావాలంటే గ్రామంలో దర్యాప్తు చేయండి... పింఛన్ పునరుద్ధరించండి అంటూ అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నా పట్టించుకునేవారే లేరు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా గోడు వినిపించుకునేవారే లేరు. ఫలితం జీవిత  చరమాంకంలో పండుటాకులు పస్తులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.  
 
 పండుటాకులపై రాజకీయ కత్తి
 వీరఘట్టం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు అందజేస్తే... ఇటీవల అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం పింఛన్లపై రాజకీయ కత్తి కట్టింది. పండుటాకులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు తొలగిస్తూ ఆవేదన మిగుల్చుతోంది. సర్వే సమయంలో స్థానికంగా లేరని, రేషన్ కార్డులు, ఆధార్‌కార్డుల్లో వయసు తేడా ఉందని, ఇంకొందరికి పొలం ఉందని ఇలా సవాలక్ష సాకులు చూపి ఫించన్‌లు తొలగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరఘట్టం మండలంలోని వీరఘట్టం, చలివేంద్రి, నర్సిపురం, నడుకూరు, వండువ, తెట్టంగి, నీలానగరం, పి.ఎన్.వాడ, విక్రమపురం, కంబర, నడిమికెల్ల, కంబరవలస, దశుమంతుపురం, తలవరం తదితర గ్రామాల్లోని అర్హుల పింఛన్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీరఘట్టంకు చెందిన ఉండ్రాళ్ల తవిటమ్మ, దూడి చిన్న, వడ్డి దుర్గారావు, గూన అప్పలనర్సమ్మ, మర్రి గురుమూర్తి, బోగాది అప్పలస్వామి, కర్రి జగ్గమ్మ, మరడాన చిన్న తదితరుల పింఛన్లు తొలగించడంతో గగ్గోలు పెడుతున్నారు.  
 
 అనర్హులకే పింఛన్లు
 పాలకొండ: ప్రభుత్వం కొత్త పింఛన్ల విధానం ప్రవేశపెట్టి అర్హులకు రిక్తహస్తం చూపిస్తోంది. కంప్యూటర్‌లో వచ్చిన తప్పులు, రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి పింఛన్లు తొలగించిన అధికారులు తిరిగి మంజూరు చేయడంలో అధికార అండ ఉండేవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పింఛను పొందాలంటే కచ్చితంగా జన్మభూమి కమిటీ ఆమోద ముద్ర, టీడీపీ అండ దండలు అర్హతగా నిర్ధారించారు. దీంతో పండుటాకులు విలవిల్లాడుతున్నాయి. చివరి దశలో నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార అండదండలుంటే చాలు అనర్హులైనా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. లుంబూరు గ్రామానికి చెందిన సూర పార్వతి భర్త పూల వ్యాపారం చేస్తున్నారు. ఈమెకు మాత్రం వితంతు పింఛన్లు మంజూరు చేశారు. ఇదే గ్రామంలో నారాయణశెట్టి పద్మ, లండ దశమ్మ, ఉర్లాపు గౌరమ్మలకు భర్తలున్నప్పటికీ వితంతు పింఛన్లు అందజేస్తున్నారు. అర్హులకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు.
 
 పక్క చిత్రంలోని వృద్ధురాలి పేరు అంపిలి ఎరకమ్మ. పాలకొం డ మండలంలోని బుక్కూరు గ్రామం. ఈమె రేషన్ కార్డులో 60 సంవత్సరాలుగా వయసు నమోదైంది. అంటే ఇప్పుడు 68 సంవత్సరాలన్నమాట. భర్త చనిపోయాడు. ఈమె వృద్ధాప్య, వితంతు పింఛన్‌కు అర్హురాలే. జాబితాలో మాత్రం ఈమె పేరు లేదు. పింఛను కోసం మూడు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పింఛన్ అందలేదు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.  పక్క చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుని పేరు కింతలి లక్ష్ముం. ఈయనిది కూడా బుక్కూరు గ్రామమే. వయస్సు 65 సంవత్సరాలు. నిరుపేద. కొత్తగా ఏర్పాటైన జన్మభూమి కమిటీ పింఛన్‌ను తొలగించింది. పింఛన్ పునరుద్ధరించాలంటూ ఎంపీడీవో కార్యాలయానికి తిరుగుతున్నా ఫలితం సున్నా.  ఇన్నాళ్లు నెలనెలా అందే పింఛన్ డబ్బులతో కాలం వెళ్లదీ సేవాడు. ఇప్పుడు పస్తులతో కాలం గడుపుతున్నాడు.
 
 పొట్ట కొట్టిన నిబంధనలు
 ఎచ్చెర్ల: ఒకే ఇంటిలో ఇద్దరు వికలాంగులు ఉన్నా... వితంతువులు ఉన్నా... వారందరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉంటే ఒక్కరికే పింఛన్ వస్తుంది. ఇదీ చంద్రబాబు ప్రభుత్వం కొత్త నిబంధన. దీంతో వేలమంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పింఛన్‌కు దూరమై, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ అందక అవస్థలు పడుతున్నారు. దీనికి ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామంలోని చిగురుపల్లి దుర్గమ్మ కుటుంబమే ఉదాహరణ. దుర్గమ్మ వితంతువు. ఈమె పిల్లలు చిగురుపల్లి నిర్మల కుమారి, చిగురుపల్లి పురుషోత్తంలకు పుట్టుకతో దృష్టిలోపం. 75 శాతం వికలాంగత్వం ఉన్నట్టు రిమ్స్ వైద్యులు సర్టిఫికేట్ కూడా జారీచేశారు. ఎండలో పనిచేసేందుకు వీరి శరీరం సహకరించదు. సెంటు భూమి లేదు. స్థిరాస్తులు సైతం లేవు. ప్రభుత్వం అందజేసే ఫించనే వీరికి ఆధారం. అయితే, వీరికి తెలుపు రేషన్‌కార్డు ఉంది. అందరి పేర్లు అందులో ఉన్నాయి. అంతే.. వితంతు పింఛన్ మాత్రమే ఉంచి మిగిలిన ఇద్దరి వికలాంగుల పింఛన్లు తీసేశారు. పింఛన్ ఇచ్చి ఆదుకోండి మహా ప్రభో... అంటూ వైద్యులు అందజేసి సర్టిఫికేట్లు పట్టుకుని అధికారులు, నాయకుల కాళ్లావేళ్లా పడుతున్నా పట్టించుకునేవారే లేరు. ఇప్పటికూ సదరం పేరుతో వికలాంగులను సైతం ఫిల్టర్ చేస్తున్నారు... సదరం ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్లు తొలగించారంటే టీడీపీ ప్రభుత్వ పాలనను అర్ధం చేసుకోవచ్చు.
 
 కాటికి కాళ్లు చాపుకొని ఉన్నా..
 వీరఘట్టం సెగిడివీధిలో నివసిస్తున్న 89 ఏళ్ల వితంతువు ఉండ్రాళ్ల తవిటమ్మది లేవలేని స్థితి. రెండేళ్లుగా మంచం పట్టింది. లబ్ధిదారుల సర్వేలో ఈమె ఫించన్ తొలగించారు. అక్టోబర్‌లో అడిగితే రెండో నెల లో పింఛన్ వస్తుందన్నారు. రెండో నెలలో అడిగితే మొత్తం మూడు నెలల ఫించన్ సొమ్ము ఒకేసారి రూ.3 వేలు వస్తుందన్నారు. తీరా ఇప్పుడు అడిగితే నీకు రేషన్ కార్డు లేదు. అందుకే ఫించన్ రాలేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈమెకు గతంలో అన్నపూర్ణ కార్డు కింద 10 కేజీల ఉచిత బియ్యం ఇచ్చేవారు. తర్వాత ప్రభుత్వం ఈమెకు ఆర్‌ఏపీ-010100502499 నంబర్ తో కార్డు మంజూరు చేసింది. ఇప్పుడు పింఛన్ అందక, అటు రేషన్ సరుకులు అందక దీనావస్థలో కాలం వెల్లదీస్తోంది.
 
 నడవలేని స్థితిలో ఉన్నా...
 నా వయసు 88 ఏళ్లు. రూ.30 పింఛన్ నుంచి అందుకుంటున్నా. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాను. చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ తొలగించింది. అర్హుల జాబితాలో నా పేరు లేద ని అడిగితే పట్టించుకునేవారే లేరు. అధికారులు కూడా అధికార బలానికి తలొగ్గుతున్నారు. వృద్ధులపై కనీసం కనికరం చూపడంలేదు.
 -కర్రి జగ్గమ్మ, వృద్ధురాలు, వీరఘట్టం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement