రానున్న రోజుల్లో టీడీపీ భూస్థాపితం
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర
అన్ని అంగన్‌వాడీలకూ అమృతహస్తం
మంత్రి ఈటెల రాజేందర్
హన్మకొండ: రాబోయే సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓర్వలేక ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్ పది నుంచి ఆసరా పథకం ద్వారా అర్హులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు.
అవసరమైతే గతంలో ఉన్న పింఛన్ల సంఖ్య కంటే జిల్లాకు వెయ్యి వంతున ఎక్కువగా... రాష్ట్రవ్యాప్తంగా పది వేల పింఛన్లు అందిస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగ లోపం వల్ల ఎక్కడైనా అర్హులకు పింఛను అందకపోతే, తిరిగి సర్వే చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం పేరుమీదుగా పింక్ కార్డులుగా మార్చుతామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లకు బీపీటీ రకం బియ్యం అందిస్తామన్నారు. అమృతహస్తం పథకాన్ని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు వర్తింప చేస్తామని వివరించారు. అంగన్‌వాడీలో ఉన్న శిశువులు, బాలలందరికీ నెలకు 30 గుడ్లు సరఫరా చేస్తామని చెప్పారు.
త్వరలో కాకతీయ కళా ఉత్సవాలు
కాకతీయ కళా ఉత్సవాలను ప్రపంచస్థాయిలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ సంకల్పించినట్లు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి ఏర్పాటు వల్ల ఐదు వందల మంది కళాకారులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.