మా పింఛన్లు తొలగిస్తారా..?
టెక్కలి: బాబ్బాబు ఎన్నో ఏళ్లుగా పింఛను పొందు తున్నా.. అయినా ఇప్పుడు తొలగించారు.. దీంతో నేను ఎలా బతికేదంతూ చాయమ్మ అనే వృద్ధురాలు గ్రామపెద్ద కోత చిన్నబాబు కాళ్లపై పడి మొక్కిన సంఘటన సోమవారం పెద్దసాన జన్మభూమి గ్రామసభలో సంభవించింది. పరశురాంపురం, పెద్దసాన గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పలువురు పింఛన్లు కోల్పోయిన లబ్ధిదారులు అధికా రులను నిలదీసిన సంఘటనలు చోటుచేసుకున్నా యి. ఎంపీపీ మట్ట సుందరమ్మ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఎస్.హరిహరరావు పరశురాంపురంలో జన్మభూమి గ్రామసభలను నిర్వహించారు.
కార్యక్రమం ప్రారంభంలో సాఫీగా జరిగినప్పటికీ పింఛన్ల ప్రస్తావన వచ్చే సరికి మాత్రం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీశారు. పరశురాంపురంలో అంగన్‌వాడీ కేంద్రం పనితీరు అధ్వానంగా ఉందని పలువురు ఫిర్యాదు చేయగా అంగన్‌వాడీ కార్యకర్తకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్‌ఐ శంకరరావుతో పాటు సిబ్బంది రంగ ప్రవేశం చేసి సమస్యను సద్దుమనిగించారు. తహశీల్దార్ ఆర్.అప్పలరాజు ఆధ్వర్యంలో పెద్దసాన జన్మభూమిలో కండికపేట గ్రామస్తులతో పాటు పలువురు అర్హుల ను పింఛన్ జాబితా నుంచి తొలగించారంటూ అర్హులమైన తమ పేర్లను తొల గించి భూములు కలిగిన వారి వివరాలు నమోదు చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక పైకి దూసుకువెళ్లి తమ గోడును వెలిబుచ్చారు. జెడ్పీటీసీ కర్ని క సుప్రియ, ప్రత్యేకాధికారి జి.సుజాత, సర్పంచ్‌లు వాకాడ రామారావు, కోత శివరామరాజు పాల్గొన్నారు.
గ్రామసభకు ముందు పోలీస్ హెచ్చరికలా?
జన్మభూమి కార్యక్రమంలో సమస్యల పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీస్తే అటువంటి వారిపై చర్యలు చేపడతామని పోలీస్‌లు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారంటూ పరశురాంపురం గ్రామంలో చర్చ సాగింది. సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్నకార్యక్రమంలో పోలీసులు హుకుం జారీ చేయడంపై విమర్శలొచ్చాయి.