జన్మభూమి కమిటీ సిఫార్సుకే పింఛన్లు | Pensions Committee recommended that the center of Janmabhoomi | Sakshi
Sakshi News home page

జన్మభూమి కమిటీ సిఫార్సుకే పింఛన్లు

Published Mon, Aug 17 2015 2:58 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

జన్మభూమి కమిటీ సిఫార్సుకే పింఛన్లు - Sakshi

జన్మభూమి కమిటీ సిఫార్సుకే పింఛన్లు

నెల్లూరు(రెవెన్యూ) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఏరుదాటకా తెప్ప తగలేసినట్లు టీడీపీ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించింది. అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను నియమించింది. గత ఏడాది పింఛన్లు పరిశీలన ప్రక్రియ చేపట్టింది. జన్మభూమి కమిటీ సభ్యులు పరిశీలించి సిఫార్సు చేసిన పింఛన్ లబ్ధిదారులు పేర్లు మాత్రమే జాబితాలో ఉంచారు. సిఫార్సు చేయని పింఛన్లను తొలగించారు. అర్హులని అధికారులు చెబుతున్నా వినకుండా వేలాది పింఛన్లను తొలగించారు.

దగదర్తి మండలానికి చెందిన ఎం. సుబ్బమ్మకు 72 ఏళ్లు, భర్త మరణించాడు. ఆమెకు వస్తున్న పింఛన్‌ను తొలగించారు. రాపూరు మండలానికి చెందిన మస్తాన్‌కు 78 ఏళ్లు. అయితే వృద్ధాప్య పింఛన్‌కు అర్హుడవు కావని సాకు చూపి పింఛన్‌ను రద్దు చేశారు. నాయుడుపేటకు చెందిన రమేష్  వికలాంగుడు. గ్రామ సభలోకి పాకుకుంటూ వచ్చి రేషన్, ఆధార్ కార్డులు, వికలాంగత్వం వంద శాతం ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించిన సర్టిఫికెట్లు చూపించాడు. అతడ్ని కూడా అర్హుడవుకావంటూ కమిటీ సభ్యులు నిర్ణయించారు. తాపిగా నడుచుకుంటూ వచ్చిన స్వల్పలోపం ఉన్న వికలాంగుడికి పింఛన్ మంజూరు చేశారు.

ఈ విషయాన్ని అధికారులు ఖండించినా కమిటీ సిఫార్స్ చేసిన వారికే పింఛన్లు ఇవ్వమని అధికారపార్టీ నాయకుల నుంచి ఒత్తిడి చేశారు. టీడీపీకి ఓటు వేయలేదనే సాకుతో వేలాది పింఛన్లను జన్మభూమి కమిటీలు రద్దు చేశాయి. పింఛన్లు తొలగించడంతో బాధితులందరూ జిల్లా అధికారులకు తమ గోడును వినిపించుకునేందుకు కలెక్టరేట్‌లో బారులు తీరారు. గ్రీవెన్స్‌డేలో అధిక శాతం మంది పింఛన్లు బాధితులే ఉండేవారు. అర్హులైన తమ పింఛన్లు తొలగించారని వేలాది మంది కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించారు. జిల్లాలో సుమారు 45 వేల పింఛన్లు తొలగించారు. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను కలసి పలుమార్లు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో దిగి వచ్చిన ప్రభుత్వం తొలగించిన పింఛన్లను పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పరిశీలన అనంతరం 20 వేల పింఛన్లను పునరుద్ధరించారు. 25 వేల మంది అర్హులైన లబ్ధిదారులు పింఛన్లు కోల్పోయి అవస్థలుపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు పింఛన్లు కోల్పోయి ఇబ్బందులుపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2.48 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నారు. గ్రామ సభల్లో పింఛన్ల కోసం 48 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 13 వేల మందిని అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం అనుమతిస్తే 13 వేల మందికి పింఛన్లు మంజూరవుతాయి. కాగా తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని బాధితులు కోరుతున్నారు.

 అర్హుల పింఛన్లు పునరుద్ధరించాం
 పరిశీలన అనంతరం పలువురి పింఛన్లు రద్దు చేశాం. రద్దు చేసిన వారిలో అనేక మంది అర్హులు ఉన్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. పరిశీలన చేసిన అర్హుల పింఛన్లు పునరుద్ధరించాం. పింఛన్ల కోసం దరఖాస్తులు వేల సంఖ్యలో వచ్చాయి. వాటిలో 13 వేల మంది అర్హులను గుర్తించాం. ప్రభుత్వం అనుమతిస్తే వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం.
 - చంద్రమౌళి, డీఆర్‌డీఏ పీడీ

Related News By Category

Related News By Tags

Advertisement