లేఖల వీరుడు...!
ఆయనొస్తున్నారంటేనే టీడీపీ కార్యాలయ సిబ్బంది హడలిపోతున్నారు. ఎందుకనుకుంటున్నారా? అయితే చదవండి మరి. కడప జిల్లా టీడీపీలో కీలక బాధ్యతల్లో పనిచేసిన ఓ నేత గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వందల కొద్ది లేఖలను అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు వివిధ సమస్యలపై రాశారు. మంత్రులకు కూడా అంతకు రెట్టింపు సంఖ్యలో లేఖలు రాశారు. ఆయన రాసిన లేఖల వల్ల ఎవరికి ఏమాత్రం పనులు అయ్యాయో ఏమో కానీ చంద్రబాబు మాత్రం గత సాధారణ ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వలేదు. ఆ తరువాత ఎమ్మెల్సీ పోస్టు ఇస్తానన్నారు. ఇప్పటి వరకు అది కూడా ఇవ్వలేదు.
అయినా కూడా ఆయన అవేమీ పట్టించుకోకుండా ఎవరు ఏ చిన్న సమస్య మీద తన వద్దకు వచ్చినా వెంటనే సంబంధిత మంత్రి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శికి ఓ లేఖ రాసి పడేస్తున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు సుమారు ఐదొందలకు పైగా లేఖలు రాశారట. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మాజీలు కూడా ఇంత వరకూ టీడీపీ కార్యాలయ సిబ్బందికి తెలిసి ఇన్ని లేఖలు రాసిన దాఖలాలు లేవట. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యే గారు టీడీపీ కార్యాలయానికి వస్తున్నారని తెలిస్తే చాలు వామ్మో ఆయనొస్తున్నారు...! ఇక లేఖల మీద లేఖలు టైప్ చేయాలి..! ఈ లోగా మాకు ఏదో ఒక పని అప్పగించండని సిబ్బంది కార్యాలయ బాధ్యులను కోరుతున్నారట.