వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం | 23 lakhs new pensions in the one year | Sakshi
Sakshi News home page

వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం

Published Sun, Sep 7 2014 1:55 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం - Sakshi

వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం

ఒకే ఏడాది 23 లక్షల కొత్త పెన్షన్లు.. కాగ్ నివేదికలో వెల్లడి
ఇందిరమ్మ, రచ్చబండ కార్యక్రమాల ద్వారా కొత్తవారికి అవకాశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 72.36 లక్షల మంది పింఛనుదారులు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 23 లక్షల మందికి ఒకే ఏడాదిలో కొత్త పింఛన్లు మంజూరయ్యాయని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. 2007-08తో పోల్చితే 2008-09 సంవత్సరంలో ఇలా ఇన్ని లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడాది అంతకు ముందు ఏడాదికన్నా ఈ రంగానికి 80 శాతం మేర అదనంగా బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపినట్టు కాగ్ నివేదిక స్పష్టంచేసింది.

2006లో ఇందిరమ్మ పథకాన్ని అప్పటి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టడం.. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు దరఖాస్తులు నేరుగా తీసుకోవడమే పింఛనుదారుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు కాగ్ పేర్కొంది. 2008 -13 మధ్య ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్లపై కాగ్ పరిశీలన జరిపి తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయగా.. సంబంధిత నివేదికను 13 జిల్లాల ఏపీ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
 
పేదలకు 39.15 లక్షల ఇళ్లు
వైఎస్ హయాంలో ఇందిరమ్మ పథకం కింద మూడేళ్లలోనే సాధ్యం

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలందరికీ గూడు కల్పించేందుకు చేపట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే ఏకంగా 39.15 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ వాస్తవాన్ని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సామాన్య-సామాజిక రంగాలపై కాగ్ నిర్వహించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించింది.

ఆ నివేదికలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వాస్తవ ప్రగతిని పట్టిక రూపంలో వివరించారు. రాజశేఖరరెడ్డి హయాంలో 2006-07, 2007-08, 2008-09 ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా పేదల కోసం ఇందిరమ్మ పథకం కింద 44.98 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వాటిలో ఆ మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే 39.15 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశారని కాగ్ పేర్కొంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల ఇళ్ల నిర్మాణాన్ని అటకెక్కించినట్లు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement