Joint Andhra Pradesh
-
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు.. ఆసక్తికర విశేషాలు
1989 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ ఐ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఐ కి 181 సీట్లు రాగా, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. సీపీఐ ఎనిమిది, సీపీఎం ఆరు, బీజేపీ ఐదు, జనతా ఒకటి, ఎం.ఐ.ఎం నాలుగు సీట్లు సాధించాయి. పదిహేను మంది ఇండిపెండెంట్లు గెలిచారు. తెలంగాణ ప్రాంతం వరకు పరిశీలిస్తే, 107 స్థానాలకు గాను కాంగ్రెస్ ఐ 58 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి 19 స్థానాలే దక్కాయి. సీపీఐ ఎనిమిది, సీపీఎం నాలుగు, బీజేపీ ఐదు, జనతా ఒకటి గెలుచుకోగా, ఎనిమిది మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. విశేషం ఏమిటంటే ఆంధ్రలో పరిస్థితులకు భిన్నంగా తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఐ, టీడీపీలతో పాటు మరో ఐదు పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునేవి. 1994 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. తెలుగుదేశం 216 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ ఐ 26 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ 19, సీపీఎం 15 స్థానాలలో విజయకేతనం ఎగురవేశాయి. బీజేపీ మూడు చోట్ల, ఎమ్.బి.టి (ఎమ్.ఐ.ఎమ్.చీలికవర్గం) రెండు, ఎమ్.ఐ.ఎమ్. ఒక స్థానం దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్లు పన్నెండు మంది నెగ్గారు. వీరిలో కూడా కొందరు టీడీపీ మద్దతుతో గెలిచారు. తెలంగాణ వరకు గమనిస్తే, 107 సీట్లకు గాను టీడీపీకి 69 స్థానాలు రాగా, కాంగ్రెస్ ఐ కేవలం ఆరు చోట్ల మాత్రమే నెగ్గింది. తెలంగాణలో ఇంత తక్కువ స్థానాలు గతంలో రాలేదు. అలాగే ఆ తర్వాత ఎన్నికలలో కూడా ఆ పరిస్థితి ఎదురుకాలేదు. టీడీపీ మిత్ర పక్షాలైన సీపీఐ 13, సీపీఎం 8 చోట్ల గెలవగా, బీజేపీ మూడు, ఎమ్.బిటి రెండు, ఎమ్.ఐ.ఎమ్. ఒకటి గెలచుకున్నాయి. ఐదుగురు ఇండిపెండెట్లు నెగ్గారు. 1999 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఏపీలో మరోసారి టీడీపీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా టీడీపీ ఆనాటి ప్రధాని వాజ్ పేయి పట్ల ఏర్పడిన సానుభూతి పవనాలు టీడీపీకి బాగా ఉపయోగపడ్డాయి. దాంతో ఎన్టీఆర్‌ను 1995లో పదవీచ్యుతుడిని చేసి టీడీపీని కైవసం చేసుకున్న ఆయన అల్లుడు చంద్రబాబు కు మరోసారి అధికారం వచ్చింది. టీడీపీకి 180 సీట్లు, కాంగ్రెస్ ఐ కి 91 సీట్లు, బీజేపీకి 12, ఎం.ఐ.ఎం. 4, సీపీఎం 2 రెండు చోట్ల గెలవగా, ఇండిపెండెంట్లు ఐదుగురు నెగ్గారు. తెలంగాణ వరకు చూస్తే 107 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశంకు 50, కాంగ్రెస్ ఐ కి 42, బీజేపీకి ఎనిమిది, సీపీఎం రెండు, ఎం.ఐ.ఎం నాలుగు సీట్లు పొందగా, ఇండిపెండెంట్ ఒక్కరే గెలిచారు. 2004 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఐ విజయం సాధించింది. కాంగ్రెస్ ఐ కి 185 సీట్లు రాగా, టీడీపీకి 47 సీట్లే వచ్చాయి. టిఆర్ఎస్కు 26, సిపిఎంకు తొమ్మిది, సిపిఐకి ఆరు స్థానాలు లభించగా, బీజేపీ రెండు సీట్లు గెలచుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి పొత్తు పెట్టుకుని పోటీచేయడం విశేషం. జనతా రెండు, సమాజ్ వాది పార్టీ ఒకటి, బీఎస్పి ఒకటి, ఎమ్.ఐ.ఎమ్. నలుగురు, ఇండిపెండెంట్లు పదకుండు మంది గెలిచారు. జనతా, సమాజవాది పార్టీ టిక్కెట్లపై గెలిచినవారు కూడా కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో వారు ఆ టిక్కెట్లపై పోటీచేసి తదుపరి కాంగ్రెస్‌లో చేరిపోయారు. తెలంగాణలో 107 సీట్లకు గాను కాంగ్రెస్ ఐ కి 48, టీడీపీకి 11, టిఆర్ఎస్ 26, సీపీఎం ఆరు, సీపీఐ నాలుగు, బీజేపీ ఒకచోట గెలిచాయి. జనతా రెండు, సమాజవాది ఒకటి, మజ్లిస్ నాలుగు, ఇండిపెండెంట్లు నలుగురు గెలిచారు. ఉమ్మడి ఏపీలో చివరిసారిగా 2009 లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈసారి టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి మహా కూటమి పేరుతో పోటీ చేసినా, కాంగ్రెస్ ఐ మళ్లీ విజయం సాధించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ఐ కి 156, తెలుగుదేశంకు 92, ప్రజారాజ్యం పార్టీకి 18, టిఆర్ఎస్కు పది, ఎమ్.ఐ.ఎమ్.కు ఏడు, సీపీఐ నాలుగు, బీజేపీ రెండు, సీపీఎం ఒకటి, లోక్ సత్తా ఒకటి, ఇండిపెండెంట్లు ముగ్గురు నెగ్గారు. తెలంగాణ ప్రాంతంలో ఈ సారి డీలిమిటేషన్లో సీట్లు 107 నుంచి 119 కి పెరిగాయి. కాంగ్రెస్‌కు 50 సీట్లు, టీడీపీకి 39, టిఆర్ఎస్కు పది, ఎమ్.ఐ.ఎమ్. కు ఏడు, సిపిఐ కి నాలుగు, బీజేపీ రెండు, ప్రజారాజ్యం రెండు, సిపిఎం ఒకటి, లోక్ సత్తా ఒకటి గెలవగా, ఇండిపెండెంట్లు ముగ్గురు విజయం సాధించారు. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
సంక్షేమానికి చిరునామా
ప్రజా సంక్షేమమే పరమ ధర్మంగా అహరహం శ్రమించిన వైఎస్ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా దేనికీ ఆయన తన పేరును, తన కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకోకపోవడమే ప్రజలపట్ల ఆయన అంకిత భావానికి నిదర్శనం. స్వర్ణయుగం... అవును.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004- 2009 మధ్యన తెలుగు ప్రజలకే కాదు, దేశానికే స్వర్ణయుగాన్ని కళ్లెదుట ఆవిష్కరించింది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతోపాటు అభి వృద్ధి పథంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. అంతకు ముందెన్నడూ లేని రీతిలో ఏ పథకమైనా పరిమితులు, కోటాలు లేకుండా సంతృప్తి స్థాయిలో అమలు జరిగిందంటే అది వైఎస్ హయాంలోనే. ఆయన అధికారంలోకి రాక ముందు చంద్రబాబు నాయుడి పాలనలో రైతులు, బడుగు బలహీనవర్గాలే కాదు అన్ని వర్గాల ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ఆ తరుణంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ వారి పాలిట నిజంగా దేవుడిగానే మారారు. ఇటు దుర్భిక్ష పరిస్థితులు, అటు ప్రభుత్వ నిరాదరణ, వేధింపులతో యమయాతనలు పడు తున్న రైతాంగానికి ప్రత్యేకించి వైఎస్ పాలన ఆశల వేకువే అయ్యింది. వ్యవసాయాన్ని పండగ చేసిన మహానేత అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేయడమే గాక ఆ క్షణం నుంచే అమల్లోకి తెచ్చి ఆయన చరిత్రను సృష్టించారు. అంతకు ముందు విద్యుత్తు లేక చేతికం దాల్సిన పంటలు ఎండిపోయో, కరవుకాటకాలతోనో రైతులు దివాలా తీయడం, విధిలేక ఆత్మహత్యలు చేసుకోవడమో నిత్యకృత్యమైనా నాటి ప్రభుత్వం కని కరించలేదు సరికదా... పంట రుణాల వసూళ్లు, విద్యుత్తు బకాయిల పేరిట రైతులను ఆరెస్టు చేయిం చడం, వారి ఆస్తులను జప్తు చేయించడం యథేచ్ఛగా సాగించింది వైఎస్ అధికారంలోకి రాగానే రైతుల విద్యుత్తు బకాయిలు రూ.1,300 కోట్లను ఒక్క సంత కంతో రద్దుచేయించారు. ఎన్టీఆర్ హయాంలో ఒక హెచ్‌పీ విద్యుత్తుకు రూ.50గా ఉన్న చార్జీలను రూ. 625 పెంచిన చంద్రబాబు వైఎస్ ఉచిత విద్యుత్తును అపహాస్యం చేస్తూ కరెంటు తీగెలపై దుస్తులు ఆరేసు కోవాల్సిందేనని విమర్శించారు. వైఎస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని 30 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తును అందించారు. వైఎస్ రెండున్నరేళ్లలోనే విద్యుత్తు కొనుగోళ్లకోసమే రూ. 6,500 కోట్లు వెచ్చించి రైతాంగానికి విద్యుత్తు సక్రమంగా అందేలా శ్రద్ధ వహించారు. ఆయన పాలనలో పరిశ్రమల విద్యుత్తు వినియోగం 40 శాతం పెరిగినా ఆ రంగం ఎలాంటి ఇబ్బందినీ ఎదుర్కొనలేదు. సాగునీటి ప్రాజక్టులకు ప్రాధాన్యం చంద్రబాబు తొలి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర దుర్భిక్షం, కరవుకాటకాలతో అల్లాడింది. ఆయన ప్రాజెక్టుల నిర్మాణం ఊసే ఎత్తలేదు. వైఎస్ 81 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టగా అందులో 12 పూర్త య్యాయి. మరో 13 పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టులపై చంద్రబాబు 9 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ ఐదేళ్లలో రూ. 32 వేలు కోట్లు ఖర్చు చేసి అదనంగా 19 లక్షల ఎకరాలకు నీరందించారు. చంద్రబాబు పాలనలో వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధికంగా కేటాయించినది రూ. 4,280 కోట్లు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క 2008-09 బడ్జెట్లోనే వ్యవసాయానికి రూ. 32,076 కోట్లు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం బకాయిలను కట్ట మంటూ రెతులను పీడిస్తే, వైఎస్ రైతుల రుణమాఫీ పథకాన్ని ప్రకటించి 63 లక్షల మంది రైతులకు చెందిన రూ. 12వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. రుణమాఫీ పరిధిలోకి రాని 37 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు అకౌంట్లలో మొత్తం రూ. 1,600 కోట్లు జమ చేయించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుం బాలకు రూ. 9,650 కోట్లు అందించారు. ఇందిర ప్రభ పథకం కింద 6.4 లక్షల ఎకరాల భూమిని నిరుపేద రైతులకు అందించారు. పంటలకు ఇన్పుట్ సబ్సిడీని ఎకరాకు రూ. 600 నుంచి రూ. 1,800 పెంచారు. వరి గిట్టుబాటు ధరను రూ. 190 నుంచి రూ. 350కి పెంచారు. పత్తి గిట్టుబాటు ధరను రూ.575 నుంచి రూ. 1,075కి పెంచారు. అందరికీ ఆరోగ్యం, విద్య, ఇళ్లు వీరూ వారూ అని లేకుండా పేదలు, బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా వైఎస్ దేశంలోనే వినూత్నమైన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం చేపట్టారు. పేదలకు రూ.2 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సదుపాయాన్ని కల్పించి, 942 రోగాలకు దాన్ని వర్తింపచేశారు. దేశంలోనే మొదటిసారిగా 108, 104 సేవలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే 108కు ఫోన్ చేస్తే చాలు నిము షాల్లోనే అంబులెన్సులు వచ్చే ఏర్పాటు చేశారు. ఇక 104 కింద మారుమూల ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలందించేందుకు అన్నిరకాల మందులు, ఇతర పరికరాలతో డాక్టర్లు వెళ్లేవారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు కడితే, వైఎస్ హయాంలో నాలుగున్నరేళ్లలోనే 45 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించారు. గతంలో రేషన్‌కార్డులు కావాలంటే లబ్దిదా రులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. వైఎస్ హయాంలో 50 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా అర్హులైన వారం దరికీ కార్డులందేలా చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు పేద, బడుగు బలహీనవర్గాలకు కలగా ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్ సహాఉన్నత సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులను 100 శాతం ఫీజు రీయంబర్స్‌మెంటుతో వైఎస్ పేదలు, బడుగు బలహీనవర్గాల వారికి అందుబాటులోకి తెచ్చారు. జిల్లాకొక యూనివర్సిటీ చొప్పున 17 యూనివర్సి టీలు ఆయన హయాంలో ఏర్పడ్డాయి. హైదరా బాద్‌లో బిట్స్ పిలానీతోపాటూ, జాతీయ స్థాయి ఐఐటీ, ఐఐఐటీలకు దీటుగా గ్రామీణ ప్రాంత విద్యా ర్థులకోసం ట్రిపుల్ ఐటీలను ఇడుపులపాయ, నూజి వీడు, బాసరలో ఏర్పాటుచేశారు. ఉద్యోగాల కల్పనలో సరికొత్త రికార్డు వైఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలపై నిషేధం తొలగించి లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పిం చారు. నిర్దేశిత సమయంలో పీఆర్సీని అమలు చేయిం చారు. అయిదేళ్లలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో 55 వేల ఉద్యోగాలు లభించాయి. 50 వేల మంది టీచర్లు నియమితులయ్యారు. 17 వేల మంది పోలీసుల నియామకం జరిగింది. ఐటీకి ఆద్యుడినని చెప్పుకొనే చంద్రబాబు హయాంలో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.5 వేల కోట్లు. అలాంటిది 2008-09లో ఐటీ ఉత్పత్తులు రూ 26 వేల కోట్లకు పెరిగాయి. పారి శ్రామిక వృద్ధిలోనూ రాష్ట్రం పరుగులు పెట్టింది. చంద్ర బాబు హయాంలో కేవలం హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాలకే పారిశ్రామిక వృద్ధిలోనూ పరి మితం కాగా వైఎస్ హయాంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్ కరీంనగర్ ఇలా అన్ని జిల్లాలకు ఇది విస్తరించింది. చంద్రబాబు హయాంలో ప్రజా ప్రతినిధులను డమ్మీలుగా మార్చి నోడల్ ఆఫీసర్లు, జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థల వ్యవస్థలు నిర్వీర్య మయ్యాయి. వైఎస్ అధికారంలోకి రాగానే నోడల్ ఆఫీసర్లను, జన్మభూమి కమిటీలను రద్దు చేశారు. నాలుగేళ్లలోనే రూ, 6,110 కోట్ల నిధులను స్థానిక సంస్థలకు అందించి, వాటిని బలోపేతం చేశారు. వృద్ధులకు ఆసరా సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు తన గత తొమ్మి దేళ్ల పాలనలో రూ. 10వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ హయాంలో ఒక్క 2008-09 బడ్జెట్లోనే రూ. 30వేల కోట్లు కేటాయించారు. బీసీలకు అండగా ఉన్న వైఎస్ బీసీ బడ్జెట్‌ను రూ. 363 కోట్ల నుంచి 1,600 కోట్లకు పెంచారు. మైనారిటీల బడ్జెట్‌ను రూ 30 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచారు. తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 3 లక్షల చేనేత కార్మికుల కుటుంబాల రూ. 327 కోట్ల రుణ బకాయిలను వైఎస్ రద్దు చేయించారు. అభయ హస్తం పథకం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.2,200కు పెంచేలా ఐకేపీ లైఫ్ ఇన్సూరెన్సు పథకం ప్రారంభించారు. తనకు ముందు ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు అందిన రుణాలు రూ.1,660 కోట్లు కాగా వైఎస్ హయాంలో రూ.16,535 కోట్లకు పెంచారు. ప్రజా సంక్షేమమే పరమ ధర్మంగా అహరహం శ్రమించిన వైఎస్ ఎన్ని ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా దేనికీ ఆయన తన పేరును, తన కుటుం బసభ్యుల పేర్లను పెట్టుకోకపోవడమే ప్రజలపట్ల ఆయన అంకితభావానికి నిదర్శనం. - సీహెచ్ శ్రీనివాసరావు సాక్షి, ఏపీ బ్యూరో -
పెద్ద మనసున్న ప్రజల మనిషి
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనపట్ల సోనియాగాంధీ, పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కానీ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్న కాలంలో కూడా ఆమె ఆయనపట్ల అక్కసుతో వ్యవహరించిన తీరు సన్నిహితులకే తెలుసు. పార్టీ పట్ల, నాయకత్వంపట్ల ఆయన చూపిన విధేయత వల్ల అది బయటకు రాలేదు. ప్రజ లలో ఆయనకున్న ఆకర్షణ, ఆదరణ వల్లనే కాంగ్రెస్ ఆయనను ముట్టుకోలేదు. లేకపోతే ఏపీలో మరోసారి ముఖ్యమంత్రుల మార్పిడి ప్రహసనాన్ని చూసి ఉండేవాళ్లం. మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఎట్లా పని చేస్తున్నది? ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అన్నిటినీ నెరవేర్చడానికి నిజాయితీగా కృషి చేస్తున్నదా? మనం సరైన ప్రభుత్వాన్నే ఎన్నుకున్నామా లేక పొరపాటు జరిగిందా? అని ప్రజలు తీరికగా సమీక్షించుకునే అవకాశం కనుక కలిగినట్టయితే చాలా ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం ఖాయం. ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాలని కోరుకోవడం సహజమే. కానీ ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా పని చేయడం ద్వారానే మళ్లీ అధికారంలోకి రావా లని తపనపడేవారు అరుదు. అటువంటి అరుదైన నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎల్లుండి జూలై ఎనిమిది ఆయన జయంతి. జనం నాడి ఎరిగిన విజయ సారధి 2004లో, పదేళ్ల విరామం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన వాడాయన. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర జరిపి ప్రజల కష్టాలను తెలుసుకుని, సమస్యలను అధ్యయనం చేసి పార్టీ గెలుపునకు వ్యూహం కూడా రచించు కున్నారు. కాబట్టే 2004 ఎన్నికల ఫలితాన్ని ముందుగానే అంత కచ్చితంగా చెప్పగలిగారు. ఒక్కటి కూడా తగ్గకుండా ఆయన చెప్పినన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో గెలిచింది. 2004లో అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన రాజశేఖరరెడ్డి 2009 ఫలితాలను ఆత్మవిమర్శగా స్వీకరించారు. ఆ ఆత్మవిమర్శ ఆయన మౌనంగా, ఒంటరిగా, నాలుగు గోడల మధ్య చేసుకున్నది కాదు. బాహాటంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష సమా వేశంలో చేసిన ప్రసంగంలోనే ఆయన... ప్రజలు మనకు ఈసారి పాస్ మార్కులు మాత్రమే వేశారు, ఈ ఐదేళ్లూ కష్టపడి ప్రజల మన్నన పొంది మంచి మార్కులు తెచ్చుకుని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసు కోవాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికీ మంచి పేరు రావడం ఆ కుటుంబానికి ఇష్టం ఉండదు. ఐదేళ్లపాటూ కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించి, దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆయన మరణించాక కాంగ్రెస్, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనపట్ల ఎంత అవమానకరంగా ప్రవర్తించిందీ మనందరికీ తెలుసు. నిన్నగాక మొన్న ఆయన జీవిత చరిత్ర ‘హాఫ్ లయన్’ తెలుగులో ‘నరసింహుడు’ పేరిట వెలువడిన సందర్భంగా మరొక్కసారి ఆ విషయంపై చర్చ జరిగింది. అందరం విన్నాం. కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత్రికి ఇంతకుముందే చెప్పుకున్నట్టు తమ కుటుంబానికి తప్ప మరెవరి కీర్తి ప్రతిష్టలు ఇనుమడించడం ఇష్టం ఉండదు. రెండుసార్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడయిన రాజ శేఖరరెడ్డిని సైతం సోనియా గాంధీ, ఆమె కుటుంబం గౌరవంగా చూడలేదు. కాంగ్రెస్ వైఎస్ రుణం తీర్చుకున్న తీరు 2009లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ఉండకపోతే యూపీఏ 2 అధికారంలోకి రావడం అంత సులభం అయ్యేదే కాదు. యూపీఏ 1 సమయంలో తోడున్న వామపక్షాలు లేక పోవడమే గాక, కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిష్ట కొంత మసకబారుతున్న సమయంలో... ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలన్నీ మహా కూటమి పేరుతో ఏకమయినా రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో రాష్ట్రంలో పార్టీ ప్రచారాన్ని నిర్వ హించారు. అక్కడా, ఇక్కడా మళ్లీ అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేశారు. 2009 గెలుపునకు ఏ నాయకుడైనా మరే కారణమైనా చెబితే అది ఆత్మ ద్రోహం అవుతుంది. ఇంత చేసిన రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ దాని అధినేత్రి ఎట్లా వ్యవ హరించారో అందరికీ తెలుసు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చ దలచిన రాజశేఖరరెడ్డి కుమారుడు, అప్పటి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టే వరకూ, ఆ తరువాత కేసులు పెట్టి వేధించే వరకూ ఏం జరిగిందో చూస్తే... తమకు తప్ప మరెవరికి కీర్తి ప్రతిష్టలు రావడాన్నీ సహించలేని గాంధీ-నెహ్రూ కుటుంబం ధోరణి ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాదు జీవించిలేని రాజశేఖరరెడ్డి పేరును నిందితునిగా చార్జిషీట్లో చేర్చి మరీ కాంగ్రెస్ ఆయన రుణాన్ని తీర్చుకుంది. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ముఖ్యమంత్రి కావడానికి డాక్టర్ రాజశేఖరరెడ్డి 26 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 1978లో మొదటిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయిన దగ్గరి నుంచి 2004 వరకూ ఆయన కాంగ్రెస్‌లోని అంతర్గత విరోధులతో తలపడుతూనే, నిత్య అసమ్మతివాది అనే విమర్శను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోగలిగారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనపట్ల సోనియాగాంధీ, పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని అధికారంలోకి తేవడా నికి ఆయన ప్రయత్నిస్తున్న కాలంలో కూడా కాంగ్రెస్ అధినాయకురాలు రాజశేఖరరెడ్డితో వ్యవహరించిన పద్ధతి చాలా కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. అసమ్మతివాది అనే ముద్ర ఉన్నా ఆయన పార్టీపట్ల, నాయకత్వంపట్ల ఎప్పుడూ విధేయుడిగా ఉండటమే అందుకు కారణం. రాజశేఖరరెడ్డి సీఎం కావడం లేదా కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకు దక్కడం సోనియాకి, కాంగ్రెస్ పెద్దలకు ఎప్పుడూ ఇష్టం లేదు. ఆయనకున్న ప్రజాకర్షణ, సీఎంగా ప్రజల్లో ఆయనపట్ల పెరిగిన ఆద రణా చూసి, ఏమీ చేయలేని స్థితిలోనే కాంగ్రెస్ ఆయనను ముట్టుకోలేదు. లేక పోతే మళ్లీ ఒకసారి ఏపీలో సీఎంల మార్పిడి ప్రహసనాన్ని చూసి ఉండేవాళ్లం. దట్ ఈజ్ వైఎస్ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం వైఎస్ పాదయాత్ర చేస్తున్న రోజులు అవి. తెలంగాణ జిల్లాల పాదయాత్రను ముగించుకుని, ఆంధ్ర ప్రాంతంలోకి అడుగు పెట్టాక ఆయన రాజమండ్రి దగ్గర అనారోగ్యం పాల య్యారు. దీంతో ఆయన అక్కడే ఓ ఊరి బయట విశ్రాంతి తీసుకుంటున్న రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా మరెక్కడికో వెళుతూ విశాఖపట్నం విమానాశ్రయంలో కాసేపు ఆగారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి కఠోర యాత్ర చేస్తూ రాజశేఖరరెడ్డి అస్వస్తులయ్యారు, ఎలాగూ మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి స్వయంగా వెళ్లి ఆయనను పలకరిస్తే బాగుంటుంది, ఆయనకే కాదు పార్టీ శ్రేణులకు కూడా కొత్త ఉత్సాహం కలుగుతుంది అని కొందరు సూచించారు. దానికి సోనియా ఇచ్చిన జవాబుకు ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘‘దట్ ఈజ్ హిజ్ హెడ్ ఏక్’’ (అది ఆయన తలనొప్పి) నేనెందుకు పలకరించాలి అన్న అర్థం వచ్చేట్టు మాట్లాడి, ఆ సూచనను నిరాకరించారు. రాజశేఖరరెడ్డి వంటి సీనియర్ నాయకుడి పట్లనే అధినేత్రి వైఖరి ఇట్లా ఉంటే ఏమనుకోవాలి? ఆ తరువాత రాజ శేఖరరెడ్డి ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించుకుని నేరుగా తిరుపతి వెళ్లి తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని పార్టీ అధ్యక్షురాలిని కలుసుకోడానికి అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. తిరుమలలో స్వామివారి దర్శనం అయినంత సులభంగా ఆయనకు పార్టీ అధ్యక్షురాలి దర్శనం కాలే దనేది అప్పుడు ఆయన వెంట ఉన్న వారికి తెలుసు. 90కి పైగా శాసనసభా స్థానాలుగల బలమైన ప్రతిపక్షనేత, ప్రజాకర్షణగల నాయకుడు, పైగా కొన్ని వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసి వచ్చినా అధినేత్రి అపాయింట్మెంట్ దొరకడం కష్టం అయింది. ఇదీ కాంగ్రెస్ అధిష్టానం తన నాయకులను గౌరవించే తీరు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కాంగ్రెస్ పార్టీనే మరిపించే తీరున పరిపాలన సాగించి ప్రజా హృదయాలపై తన సొంత ముద్రను బలంగా వేశారు. అయినా ఆయన పార్టీ విధేయతను మరచి పోలేదు. కాబట్టే ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానికి నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టడం జరిగింది. దట్ ఈజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! జూలై 8 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
జీవించే హక్కే వేదవాక్కు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణలో ఎన్కౌంటర్ల పేరుతో ఇప్పటివరకు 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టార్గెట్లు, ఇన్ఫార్మర్ల పేరుతో నక్సలైట్లు చంపిన వారి సంఖ్య 2,300 దాకా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలోని ఎన్కౌంటర్లు, రక్తపాతం గురించి కూడా చాలాసార్లు చర్చకు వచ్చింది. అటువంటి హింసలేని ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని అందరం ఉద్యమ సమయంలో ఎలుగెత్తి చాటాం. కానీ శ్రుతి, విద్యాసాగర్‌ల ఎన్కౌంటర్ ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతున్నది. వ్యక్తి చేస్తే అది పొరపాటు. అధికార వ్యవస్థ చేస్తే అది తప్పవుతుంది. పాలించే ప్రభుత్వమే మనిషిని చంపితే దాన్ని నేరమే అనాలి. రాజ్యం తప్ప మరెవ్వరు చేసినా దాన్ని సమర్థించుకోవచ్చు. కానీ ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థే నేరానికి పాల్పడితే సమర్థించుకోజాలదు. వ్యక్తికి జీవించే హక్కును ప్రసాదించిన రాజ్యాంగం ప్రభుత్వాలకూ, రాజ్యాలకూ కొన్ని నియమాలను విధించింది. పౌరుల స్వేచ్ఛకు పాలకుల అధికారాలు అడ్డంకి కాకూడదు. జీవించే స్వేచ్ఛను హరించకూడదు. రాజ్యాంగ రచనా సభ చర్చలను గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. ‘ఈ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వానికే కాకుండా, ప్రజలకూ హక్కులు కల్పించాలి. ప్రజల జీవితాలను, స్వేచ్ఛను ప్రభుత్వ అధీనంలోకి నెట్టకూడదు. చాలా విషయాలను ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వాలకు దఖలు పరిచారు. ఇది నియంతృత్వ పోకడలకు దారితీయకూడదు. అందువల్ల ప్రజల స్వేచ్ఛ, భద్రత, జీవించే హక్కు లాంటివి ప్రాథమిక హక్కులుగా ఉండాలి.’ అంటూ ఆర్టికల్-21 పై 1949, సెప్టెంబర్ 16న జరిగిన చర్చలో ప్రముఖులు వాదనలు వినిపించారు. దానిని న్యాయస్థానాలలో ప్రశ్నించడానికి వీలుగా ప్రాథమిక హక్కులలో చేర్చారు. కానీ ప్రజల ఓట్లతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న ప్రభుత్వాలే, వారి జీవితాలను నియంత్రించే హక్కును అనధికారికంగా సొంతం చేసుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. ఇది మొదటిది కాదు. కానీ నవ తెలంగాణలో ఇదే చివరిది కావాలని కోరుకుందాం. కట్టుకథలు మారవా? ఇటీవల వరంగల్ జిల్లాలోని ములుగు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో శ్రుతి, విద్యాసాగర్‌లు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. కానీ, శ్రుతి మరణించిన తీరు, వాతావరణం హత్యేనని రుజువుచేస్తున్నాయన్నది మృతుల బంధువులు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల వాదన. వారిని ముందుగా పట్టుకొని, చిత్రహింసలు పెట్టి, కాల్చి చంపారని వారు ఆరోపిస్తున్నారు. ఎప్పటిలాగే పోలీసుల వాదన మరోలా ఉంది. వారి కట్టు కథలు కూడా సుపరిచితమే. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీపీఐ (ఎంఎల్) నాయకులు మధుసూదన్రాజ్ ఎన్‌కౌంటర్‌పై దాఖలైన రిట్ పిటిషన్‌ను స్వీకరిస్తూ, జస్టిస్ ఎం.ఎన్.రావు ఇచ్చిన విలక్షణ తీర్పును ఇప్పుడు ప్రస్తావించడం అవసరం. మధుసూదన్రాజ్ నిజమైన ఎన్కౌంటర్లో చనిపోలేదని, హైదరాబాద్‌లోని గాంధీనగర్ ప్రాంతం నుంచి పట్టుకొచ్చి, వరంగల్‌లో కాల్చివేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపైనే జస్టిస్ ఎం.ఎన్ రావు, ఎన్కౌంటర్లో చనిపోయిన నక్సలైట్లుగానీ, ఎవరైనా చనిపోయిన సంఘటనతో గానీ సంబంధం ఉన్న పోలీసు అధికారులపై ముందుగా హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని, ఒక వేళ న్యాయస్థానం విచారణలో వాళ్లు నిర్దోషులని తేలితే తప్ప, అంత వరకు వారు నిందితులుగానే ఉంటారని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పును ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అందువల్ల దానిని అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ జస్టిస్ ఎం.ఎన్.రావు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాల చేతిలో అధికారం, పోలీసుల చేతుల్లో తుపాకులు. ఈ రెండింటికీ ఎదురులేదనే భావన ఇప్పటికీ ప్రామాణికంగా కొనసాగుతున్నది. కానీ చట్టాలలో పేర్కొన్న విధానాల ప్రకారం తప్ప ప్రజల ప్రాణాలకు, భద్రతకు, స్వేచ్ఛకు ఎటువంటి హానీ తలపెట్టకూడదని ఆర్టికల్ 21 ఘోషిస్తోంది. కాబట్టి ప్రజలను కాల్చిచంపి, ఇది చట్టం, న్యాయాల రక్షణకేనని ప్రకటించడం సరికాదు. ఇదే విషయంపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. ఇది ప్రమాదకర ధోరణి కొంతమంది దొంగలు, గ్యాంగస్టర్ల విషయంలో పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని పట్టణ మధ్యతరగతి, ధనికవర్గాలు నమ్ముతున్నాయి. నక్సలైట్లు, టైస్టులు కూడా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని, అందువల్ల వారిని పట్టుకొని చంపినా, ఎన్కౌంటర్లు చేసినా తప్పు లేదనే వాదనలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ కారణంగానే దొంగలను, స్త్రీలపై హింసకు పాల్పడిన వారిని ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలనే వాదనలను సాధారణ ప్రజలే కాకుండా ప్రజాసంఘాలు కూడా చేస్తుండడం ఒక విచిత్రమైన పరిస్థితి. ఇది ప్రమాదకరమైన వైఖరి. ప్రాణం తీసే హక్కును ప్రభుత్వానికీ, పోలీసులకూ ప్రజలే అప్పగించినట్టవుతుంది. అది ఒక దొంగ విషయంలో జరగొచ్చు. నక్సలైటు కనుక, వాళ్లు కూడా మనుషులను చంపుతున్నారు కనుక శ్రుతిని కానీ, మరెవ్వరినైనా కానీ పాశవికంగా చంపొచ్చు అనే ఆటవిక పోకడలకు మద్దతివ్వడమే. రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులను ఇచ్చింది. ఒకవేళ ప్రజలు, వ్యక్తులుగా, సంస్థలుగా నేరాలు చేస్తే, వాళ్ల కారణంగా ఇతరులకు ఇబ్బందులైతే చూస్తూ కూర్చోవాలని ఎవరూ అనడం లేదు. ప్రభుత్వాలు అలాంటి వ్యక్తులను, సంస్థలను అదుపులోకి తీసుకోవాలి. విచారణ జరిపి, చట్టాలకు లోబడి శిక్షించాలి. అట్లా చేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ చర్చ అంతా ఆ ప్రభుత్వాలే ఇంకొక వైపు, విచారణ లేకుండా, చట్ట వ్యతిరేకంగా ప్రజలను కాల్చి చంపడం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆయుధాలతో ప్రజలను చంపడం, దానిని అరికట్టడానికి వెళ్లిన వారిని, సైన్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని కాల్పులు జరిపిన సందర్భాలు ఎదురైతే, అప్పుడు ఎదురు కాల్పులు జరిపితే అటు, ఇటు రెండు వైపులా నష్టం జరిగితే అది నిజమైన ఘర్షణ. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, దేశవ్యాప్తంగా ఏక పక్షంగా జరిగిన ఎన్కౌంటర్లే ఎక్కువ. ఎన్నో నిజనిర్ధారణ కమిటీలు దీనిని నిరూపించాయి. 1975-77 ఎమర్జెన్సీ కాలంలోనూ, అంతకు ముందు జరిగిన ఘటనల్లోనూ అక్రమంగా కాల్చి వేయడం వల్ల మరణించిన వారే ఎక్కువని జస్టిస్ భార్గవ కమిషన్ వెల్లడించింది. ప్రజాస్వామిక, పౌర హక్కుల సంఘాలతో రూపొందిన తార్కుండే కమిటీ కూడా ఇదే చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణలో ఎన్కౌంటర్ల పేరుతో ఇప్పటివరకు 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టార్గెట్లు, ఇన్ఫార్మర్ల పేరుతో నక్సలైట్లు చంపిన వారి సంఖ్య 2,300 దాకా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలోని ఎన్కౌంటర్లు, రక్తపాతం గురించి కూడా చాలాసార్లు చర్చకు వచ్చింది. అటువంటి హింసలేని ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని అందరం ఉద్యమ సమయంలో ఎలుగెత్తి చాటాం. కానీ శ్రుతి, విద్యాసాగర్‌ల ఎన్కౌంటర్ ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతున్నది. కేవలం నక్సలైట్లే కాదు, సాధారణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా దీన్ని ఖండించారు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఇది పరిష్కారం కాదు, కాలేదు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్కౌంటర్ ఘటనపై విస్తృత ప్రజాస్వామిక వేదిక ఏర్పాటైంది. ఇది బలపడుతోన్న ఉద్యమ ఐక్యతకు సంకేతం. దీనిని ప్రభుత్వం గుర్తించి తీరాలి. నిజానికి గతంలో ఉన్న విధంగా నక్సలైట్ల కార్యకలాపాలు, హింసాయుత సంఘటనలు ఇప్పుడు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఉద్యమం ఒక ప్రజాస్వామ్య భావనకు పునాదిగా భావించాం. ఇప్పుడు చేయాల్సింది ‘నక్సలైట్ల’ను ఏరివేయడం కాదు. ఆ ఉద్యమ మూలాలను వెతికి, అందుకు కారణమైన ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించాలి. దానికి తెలంగాణలో మిషన్ కాకతీయ, దళితులకు భూమి లాంటి కొన్ని విధానాలను అమలు చేస్తున్న మాట నిజమే. కానీ అవి చాలవు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న నిరాశ, నిస్పృహలను అర్థం చేసుకోవాలి. అది అసహనంగా మారకుండా చూడాలి. ఇప్పటికే తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులుగా, అర్ధ నిరుద్యోగులుగా ఉన్నారు. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని, లేదంటే ఏదో ఉపాధి లభిస్తుందని యువతరం భావించింది. మనందరం అదే అభిప్రాయాన్ని కలిగించాం. కానీ సమగ్రమైన ఉద్యోగ, యువజన విధానాన్ని రూపొందించలేకపోయాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వేసి, కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చాం. కానీ ప్రభుత్వ సంస్థలలో లక్షమందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలం. మిగతా లక్షలాది మంది గురించి మన ప్రణాళికలేమిటో స్పష్టం చేయలేదు. ఇది పెద్ద సవాల్. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న సంస్థలు, పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులలో లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో స్థానికులు తక్కువ. ఎక్కువమంది ఇతర రాష్ట్రాల వారు. దానికి కారణం వాళ్లకున్న నైపుణ్యం. మన దగ్గర యాభై లక్షల మందికి పైగా యువకులు ఉన్నారు. వీరిలో సగానికి సగం ఎటువంటి నైపుణ్యంలేనివారేనని లెక్కలు చెబుతు న్నాయి. అందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన యువకులకు ఉపాధిలో నైపుణ్యం కలిగించే అంశం మీద దృష్టి సారించాలి. కనీసం 80 శాతం మందికి స్థానిక సంస్థల్లో, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి. మిషన్ కాకతీయ లాగా మిషన్ ఎంప్లాయ్‌మెంట్‌ను స్థాపించాలి. ప్రభుత్వాలు మనకు రక్షణగా ఉంటాయనే భరోసానివ్వాలి. అంతేకానీ ఎన్కౌంటర్ల పేరుతో పౌరులను కాల్చి చంపడం సరియైంది కాదు. అది సమస్యకు పరిష్కారం కూడా కాదు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
అప్పుడు.. ఇప్పుడూ వరంగల్ ఫస్ట్
విద్యారణ్యపురి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 2002, 2003, 2004 విద్యా సంవత్సరాల్లో ఎస్సెస్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లా వరుసగా మూడు సార్లు మొదటిస్థానం సాధించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ, భారీ నీటిపారుదలశాఖమంత్రిగా పనిచేశారు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా కడియం శ్రీహరి ఉండడం... ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో వరంగల్ జిల్లా మొదటిస్థానం సాధించడం విశేషం. -
‘సాఫ్ట్’గా దోచేశారు..!
ఆర్థిక శాఖలో కంప్యూటరీకరణ పేరిట రూ.175 కోట్ల దుర్వినియోగం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు, ఓ ఉన్నతాధికారి కుమ్మక్కై రూ.175 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అడ్డగోలు నిర్ణయానికి ప్రతిఫలంగా భారీ ఎత్తున ముడుపులు దండుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 14, 2008న ఆర్థికశాఖను కంప్యూటరీకరించి.. లావాదేవీలను ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు.. వాణిజ్య పన్నుల వసూళ్లు.. విద్యార్థులకు ఉపకారవేతనాలు.. ఉద్యోగులకు వేతనాల చెల్లింపు తదితర అన్ని లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ భావన. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖజానా శాఖలో అప్పటి డెరైక్టర్ ఎన్సీ నాగార్జునరెడ్డి తన శాఖలో కొందరు మెరికల్లాంటి అధికారుల సహకారంతో అన్ని లావాదేవీలను ఆన్లైన్లో నిర్వహించేలా సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్-సీఎఫ్ఎంఎస్)ను రూపొందించారు. భద్రత లేదనే సాకు చూపి.. ప్రభుత్వ సిబ్బంది రూపొందించిన సీఎఫ్ఎంఎస్, హెచ్ఆర్ఎంఎస్ల సాఫ్ట్‌వేర్‌లో రికార్డులకు భద్రత లేదని, సరికొత్త వ్యవస్థను రూపొందించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారుచేయడానికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థను కన్సల్టెన్సీగా నియమిద్దామని ప్రభుత్వ పెద్దలకు ఓ ఉన్నతాధికారి ప్రతిపాదించారు. నాగార్జునరెడ్డి నేతృత్వంలోని బృందం రూపొందించిన తరహాలోనే కన్సల్టెన్సీ సంస్థ కూడా డీపీఆర్‌ను తయారుచేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.5 కోట్లను కన్సల్టెన్సీ ఫీజు కింద ప్రభుత్వం సమర్పించుకుంది. అందులో సగానికిపైగా ఓ ఉన్నతాధికారికి పర్సంటేజీ కింద కన్సల్టెన్సీ సంస్థ ముట్టజెప్పినట్లు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. రూ.2 కోట్లకు.. రూ.175 కోట్లు! సదరు సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను అధ్యయనం చేసిన నాగార్జునరెడ్డి.. ప్రస్తుతం అమల్లో ఉన్న సీఎఫ్ఎంఎస్, హెచ్ఆర్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు అది భిన్నంగా లేకపోవడాన్ని పసిగట్టారు. భద్రత చర్యలు తీసుకోడానికి రూ.2 కోట్లు సరిపోయేదానికి రూ.350 కోట్లు ప్రతి పాదించటాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీంతో భయపడిన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఈ మొత్తాన్ని రూ. 175 కోట్లకు తగ్గించేశారు. అంతేగాక నాగార్జున రెడ్డిని పదవి నుంచి తప్పించారు. తాము లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకే ఆ పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. అక్టోబర్ 1, 2012న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయగా రెండు సంస్థలే టెండర్లో పాల్గొనగా అందులో ఓ సంస్థకు పనులను అప్పగించేసి భారీ ఎత్తున ముడుపులు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేజిక్కించుకుని రెండున్నరేళ్లు కావస్తోన్నప్పటికీ కాంట్రాక్టు సంస్థలో చలనం కనిపించడం లేదు. కంప్యూటరీకరణను చేయడానికి వీలుగా రెండేళ్ల క్రితం జిల్లాలకు(ఏపీ, తెలంగాణ) కాంట్రాక్టు సంస్థ చేరవేసిన మానిటర్లు, సీపీయూలు, సర్వుర్లు తుప్పుపట్టిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కొత్త పద్ధతి అందుబాటులోకి రాకపోవడంతో పాత పద్ధతిలోనే ఆర్థికశాఖలు(ఏపీ, తెలంగాణ) లావాదేవీలు సాగిస్తున్నాయి. -
తెలంగాణ అప్పు.. రూ. 61,710 కోట్లు
ఉమ్మడి ఏపీ అప్పును పంపిణీ చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ అప్పువాటా రూ. 86.34 వేల కోట్లు నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులను కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ మేరకు వారం కిందటే నోటిఫై చేసింది. వివాదాలు లేని అప్పులను విభజించి ఎవరి వాటా ఎంత అని తేల్చింది. సెక్యూరిటీల విక్రయం, నాబార్డు, చిన్నమొత్తాల పొదుపు సంస్థ నుంచి చేసిన అప్పులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఏపీలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిణీ చేసింది. ఉమ్మడి ఏపీకి మొత్తంగా 1.48 లక్షల కోట్ల అప్పు ఉండగా, అందులో తెలంగాణకు రూ. 61.71 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.86.34 వేల కోట్లు అప్పుగా తేల్చా రు. విదేశీ ఆర్థిక సంస్థలు, కేంద్రం మంజూరు చేసిన 18.43 వేల కోట్ల రూపాయల అప్పులో రెండు రాష్ట్రాల వాటా తేల్చాల్సి ఉంది. ఈ అప్పుల్లో నిర్దిష్టంగా ఒక ప్రాంతానికి లేదా ఒక జిల్లాకు సంబంధించి ప్రాజెక్టు కోసం వ్యయం చేస్తే... ఆ అప్పు ఆ ప్రాంతాలు, జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే వెళ్తుంది. జిల్లాల్లో వెచ్చించిన వ్యయం ఆధారంగా ఆ అప్పులను పంపిణీ చేయాలంటే అందుకు తగిన లెక్కలు ఉన్నాయా లేదా అనేది అకౌంటెంట్ జనరల్ పరిశీలించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి వివిధ పథకాల కింద మంజూరు చేసిన రుణాన్ని రాష్ట్రం అంతటికీ వినియోగించారు. ఈ రుణాలను రెండింటికి పంపిణీ చేయడానికి ఏ విధానం అవలంభిం చాలనేది వాస్తవికత ఆధారంగా అకౌంటెంట్ జనరల్ నిర్ధారించాల్సి ఉంది. కేసీ కెనాల్ ఆధునీకరణకు విదేశీ సంస్థ నుంచి చేసిన అప్పులు ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని, అలాగే హుస్సేన్‌సాగర్ నీటిశుద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన అప్పులు తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ర్టం విడిపోవడానికి ముందు అంటే గతేడాది మే 31వ తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రానికి అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.1.66 లక్షల కోట్లు. ఇందులో వివాదం లేని అప్పును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విధంగా పంపిణీ చేసింది. వివాదం లేని ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.1.48 లక్షల కోట్లు మార్కెట్లో సెక్యురిటీల విక్రయం ద్వారా చేసిన అప్పు రూ.1.17 లక్షల కోట్లు నాబార్డు, చిన్న మొత్తాల సంస్థ, ఇతర సంస్థల నుంచి అప్పు రూ.31 వేల కోట్లు. -
ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి రుణాలు
రాష్ట్రంలో గత ఏడాది నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువత స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రాయితీ పొందేందుకు అనుమతులు కూడా వచ్చాయి. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ రావటం, సార్వత్రిక ఎన్నికలు జరగటంతో కార్పొరేషన్ నుంచి వచ్చే స్వయం ఉపాధి రాయితీలు ఆగిపోయాయి. ఏడాది దాటింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే ఏదైనా స్వయం సహాయక సంస్థ ద్వారా ఉపాధి పొందొచ్చని, ఆర్థికంగా కొంత మెరుగుపడగలమని లబ్ధిదారులు ఎంతోమంది రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్టంలో తమ బతుకులు మారతాయని వెనుకబడిన వర్గాల యువత ఎంతో ఆసక్తితో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 2013-14 సంవత్సరంలో ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి షరతులు లేకుండా స్వయం సహాయక రుణాలు అందివ్వాలి. అలాగే వయసు ప్రతిపాదనతో ఉన్న జీవో 101ను తొలగించాలి. మాట తప్పని నేత కేసీఆర్ వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు గత ఏడాది మంజూరు చేసిన రుణాలు వెంటనే ఇప్పించాలి. అలాగే ఈ సంవత్సరం కూడా కొత్తగా స్వయంసహాయక రుణాలను మంజూరు చేయాలని మనవి. బుర్రి శేఖర్ ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా -
జాప్యంతో నెత్తిన భారం
సకాలంలో పూర్తికాక పెరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల భారం ఉమ్మడి రాష్ట్రంలో తొలి, సవరించిన అంచనాల వ్యత్యాసం రూ. 57,554 కోట్లు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోందని వెల్లడించింది. సకాలంలో పనులు జరగక ఆశించిన ప్రయోజనాలు సైతం ఒనగూరడం లేదని స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు సీఎం స్థాయి లో సమావేశాలు జరిగినా పనుల్లో వేగం పెరగలేదని అభిప్రాయపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల్లో పనుల తొలి అంచనాలను సవరించి రూ. 57,554 కోట్లకు పెంచగా... అందులో ఒక్క తెలంగాణలోని ప్రాజెక్టుల్లో రూ. 37,327 కోట్ల మేరకు అంచనాలు పెంచినట్లు కాగ్ వెల్లడించింది. కాగ్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ప్రాజెక్టుల తొలి అంచనాలు 61,717.38 కోట్లుకాగా... సవరించిన వ్యయంతో అది రూ. 99.044 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక 2013 నాటికి ప్రాజెక్టుల కోసం జరిగిన మొత్తం ఖర్చు రూ. 40,255.36 కోట్లుగా వెల్లడించింది. -
వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం
►ఒకే ఏడాది 23 లక్షల కొత్త పెన్షన్లు.. కాగ్ నివేదికలో వెల్లడి ►ఇందిరమ్మ, రచ్చబండ కార్యక్రమాల ద్వారా కొత్తవారికి అవకాశం ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 72.36 లక్షల మంది పింఛనుదారులు సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 23 లక్షల మందికి ఒకే ఏడాదిలో కొత్త పింఛన్లు మంజూరయ్యాయని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. 2007-08తో పోల్చితే 2008-09 సంవత్సరంలో ఇలా ఇన్ని లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడాది అంతకు ముందు ఏడాదికన్నా ఈ రంగానికి 80 శాతం మేర అదనంగా బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపినట్టు కాగ్ నివేదిక స్పష్టంచేసింది. 2006లో ఇందిరమ్మ పథకాన్ని అప్పటి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టడం.. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు దరఖాస్తులు నేరుగా తీసుకోవడమే పింఛనుదారుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు కాగ్ పేర్కొంది. 2008 -13 మధ్య ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్లపై కాగ్ పరిశీలన జరిపి తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయగా.. సంబంధిత నివేదికను 13 జిల్లాల ఏపీ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పేదలకు 39.15 లక్షల ఇళ్లు వైఎస్ హయాంలో ఇందిరమ్మ పథకం కింద మూడేళ్లలోనే సాధ్యం సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలందరికీ గూడు కల్పించేందుకు చేపట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే ఏకంగా 39.15 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ వాస్తవాన్ని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సామాన్య-సామాజిక రంగాలపై కాగ్ నిర్వహించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించింది. ఆ నివేదికలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వాస్తవ ప్రగతిని పట్టిక రూపంలో వివరించారు. రాజశేఖరరెడ్డి హయాంలో 2006-07, 2007-08, 2008-09 ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా పేదల కోసం ఇందిరమ్మ పథకం కింద 44.98 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వాటిలో ఆ మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే 39.15 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశారని కాగ్ పేర్కొంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల ఇళ్ల నిర్మాణాన్ని అటకెక్కించినట్లు స్పష్టం చేసింది.