1989 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ ఐ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఐ కి 181 సీట్లు రాగా, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. సీపీఐ ఎనిమిది, సీపీఎం ఆరు, బీజేపీ ఐదు, జనతా ఒకటి, ఎం.ఐ.ఎం నాలుగు సీట్లు సాధించాయి. పదిహేను మంది ఇండిపెండెంట్లు గెలిచారు. తెలంగాణ ప్రాంతం వరకు పరిశీలిస్తే, 107 స్థానాలకు గాను కాంగ్రెస్ ఐ 58 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి 19 స్థానాలే దక్కాయి. సీపీఐ ఎనిమిది, సీపీఎం నాలుగు, బీజేపీ ఐదు, జనతా ఒకటి గెలుచుకోగా, ఎనిమిది మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. విశేషం ఏమిటంటే ఆంధ్రలో పరిస్థితులకు భిన్నంగా తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఐ, టీడీపీలతో పాటు మరో ఐదు పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునేవి.
1994 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. తెలుగుదేశం 216 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ ఐ 26 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ 19, సీపీఎం 15 స్థానాలలో విజయకేతనం ఎగురవేశాయి. బీజేపీ మూడు చోట్ల, ఎమ్.బి.టి (ఎమ్.ఐ.ఎమ్.చీలికవర్గం) రెండు, ఎమ్.ఐ.ఎమ్. ఒక స్థానం దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్లు పన్నెండు మంది నెగ్గారు. వీరిలో కూడా కొందరు టీడీపీ మద్దతుతో గెలిచారు. తెలంగాణ వరకు గమనిస్తే, 107 సీట్లకు గాను టీడీపీకి 69 స్థానాలు రాగా, కాంగ్రెస్ ఐ కేవలం ఆరు చోట్ల మాత్రమే నెగ్గింది. తెలంగాణలో ఇంత తక్కువ స్థానాలు గతంలో రాలేదు. అలాగే ఆ తర్వాత ఎన్నికలలో కూడా ఆ పరిస్థితి ఎదురుకాలేదు. టీడీపీ మిత్ర పక్షాలైన సీపీఐ 13, సీపీఎం 8 చోట్ల గెలవగా, బీజేపీ మూడు, ఎమ్.బిటి రెండు, ఎమ్.ఐ.ఎమ్. ఒకటి గెలచుకున్నాయి. ఐదుగురు ఇండిపెండెట్లు నెగ్గారు.
1999 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఏపీలో మరోసారి టీడీపీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా టీడీపీ ఆనాటి ప్రధాని వాజ్ పేయి పట్ల ఏర్పడిన సానుభూతి పవనాలు టీడీపీకి బాగా ఉపయోగపడ్డాయి. దాంతో ఎన్టీఆర్‌ను 1995లో పదవీచ్యుతుడిని చేసి టీడీపీని కైవసం చేసుకున్న ఆయన అల్లుడు చంద్రబాబు కు మరోసారి అధికారం వచ్చింది. టీడీపీకి 180 సీట్లు, కాంగ్రెస్ ఐ కి 91 సీట్లు, బీజేపీకి 12, ఎం.ఐ.ఎం. 4, సీపీఎం 2 రెండు చోట్ల గెలవగా, ఇండిపెండెంట్లు ఐదుగురు నెగ్గారు. తెలంగాణ వరకు చూస్తే 107 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశంకు 50, కాంగ్రెస్ ఐ కి 42, బీజేపీకి ఎనిమిది, సీపీఎం రెండు, ఎం.ఐ.ఎం నాలుగు సీట్లు పొందగా, ఇండిపెండెంట్ ఒక్కరే గెలిచారు.
2004 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఐ విజయం సాధించింది. కాంగ్రెస్ ఐ కి 185 సీట్లు రాగా, టీడీపీకి 47 సీట్లే వచ్చాయి. టిఆర్ఎస్‌కు 26, సిపిఎంకు తొమ్మిది, సిపిఐకి ఆరు స్థానాలు లభించగా, బీజేపీ రెండు సీట్లు గెలచుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి పొత్తు పెట్టుకుని పోటీచేయడం విశేషం. జనతా రెండు, సమాజ్ వాది పార్టీ ఒకటి, బీఎస్పి ఒకటి, ఎమ్.ఐ.ఎమ్. నలుగురు, ఇండిపెండెంట్లు పదకుండు మంది గెలిచారు. జనతా, సమాజవాది పార్టీ టిక్కెట్లపై గెలిచినవారు కూడా కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో వారు ఆ టిక్కెట్లపై పోటీచేసి తదుపరి కాంగ్రెస్‌లో చేరిపోయారు. తెలంగాణలో 107 సీట్లకు గాను కాంగ్రెస్ ఐ కి 48, టీడీపీకి 11, టిఆర్ఎస్ 26, సీపీఎం ఆరు, సీపీఐ నాలుగు, బీజేపీ ఒకచోట గెలిచాయి. జనతా రెండు, సమాజవాది ఒకటి, మజ్లిస్ నాలుగు, ఇండిపెండెంట్లు నలుగురు గెలిచారు.
ఉమ్మడి ఏపీలో చివరిసారిగా 2009 లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈసారి టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి మహా కూటమి పేరుతో పోటీ చేసినా, కాంగ్రెస్ ఐ మళ్లీ విజయం సాధించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ఐ కి 156, తెలుగుదేశంకు 92, ప్రజారాజ్యం పార్టీకి 18, టిఆర్ఎస్‌కు పది, ఎమ్.ఐ.ఎమ్.కు ఏడు, సీపీఐ నాలుగు, బీజేపీ రెండు, సీపీఎం ఒకటి, లోక్ సత్తా ఒకటి, ఇండిపెండెంట్లు ముగ్గురు నెగ్గారు. తెలంగాణ ప్రాంతంలో ఈ సారి డీలిమిటేషన్‌లో సీట్లు 107 నుంచి 119 కి పెరిగాయి. కాంగ్రెస్‌కు 50 సీట్లు, టీడీపీకి 39, టిఆర్ఎస్‌కు పది, ఎమ్.ఐ.ఎమ్. కు ఏడు, సిపిఐ కి నాలుగు, బీజేపీ రెండు, ప్రజారాజ్యం రెండు, సిపిఎం ఒకటి, లోక్ సత్తా ఒకటి గెలవగా, ఇండిపెండెంట్లు ముగ్గురు విజయం సాధించారు.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment