తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదంగా ఉంది. ఆయన కొంతమంది జర్నలిస్టులను ఉన్మాదులుగా పోల్చడం బాగోలేదు. రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలలో పనిచేస్తున్నకొందరు పాత్రికేయులు ఉన్మాదంగా మారి ప్రెస్ మీట్‌లలో లేదా జరుగుతున్న కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలలో పనిచేసే వారు మంత్రుల కార్యాలయాలు, మరికొన్ని చోట్లకు వెళ్లి కూర్చోవడంతో పాటు కొన్ని విషయాలలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా కొందరు పాత్రికేయులు అడిగే ప్రశ్నలు, ఇచ్చే కథనాలు ఆయనకు నచ్చకపోవచ్చు. లేదా కొన్ని పత్రికలపట్ల ఆయనకు వ్యతిరేకత ఉండవచ్చు. అంతమాత్రాన వారిని ఉన్మాదులతో ఎలా పోల్చారో అర్ధం కాదు.
రాజకీయ నేతల భాష గురించి పక్కనబెట్టి, పాత్రికేయుల భాష గురించి హితవు చెప్పిన రేవంత్ ఇలా మాట్లాడడం సమంజసమేనా అన్నది చూడాలి. అలా అని మీడియా అంతా వృత్తి ప్రమాణాలు పాటిస్తోందని చెప్పడం లేదు. ఏ రంగంలో అయినా అన్ని రకాలవారు ఉంటారు. అలాగే జర్నలిజంలో కూడా ఉండవచ్చు. రాజకీయ పార్టీలు పత్రికలు స్థాపించడం గురించి రేవంత్ ప్రస్తావించారు. గతంలో వామపక్షాలు పత్రికలు పెట్టుకున్న విషయాన్ని చెప్పి వాటిలో పనిచేసే జర్నలిస్టులను గౌరవంగానే మాట్లాడారు. బహుశా ఒక వామపక్షం తమకు మిత్రపక్షంగా ఉన్నందున ఆయన జాగ్రత్తపడి ఉండవచ్చు. పైగా ఒక సిపిఐ నేతకు పదవి కూడా ఇచ్చారు.మిగిలిన మీడియా సంస్థలలో ఏవి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నవో ఆయన వివరించలేదు కాని, ప్రధానంగా ఆయన ఆగ్రహం అంతా బీఆర్ఎస్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక గురించి అయి ఉండాలి. అలాగే బీఆర్ఎస్‌కు కాస్త అనుకూలంగా ఉన్న యూట్యూబ్ చానళ్ల గురించి అయి ఉండాలి.
బీజేపీ మీద కంటే ఆయన దృష్టి అధికంగా బీఆర్ఎస్ మీదే ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చి ఉండాలి. రాజకీయ నాయకులకు సహజంగానే తమపై నెగిటివ్ వార్తలు రాసే పత్రికలన్నా, సంబంధిత జర్నలిస్టులన్నా కాస్త కోపమే ఉంటుంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ మీడియానే లేదనట్లుగా ఆయన మాట్లాడడం. నిజానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అధిక మీడియా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లే లెక్క. వెలుగు దినపత్రిక యజమాని ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ ఎంపీ ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేనే. ఆ యజమాని కుటుంబం తొలుత కాంగ్రెస్ తదుపరి బీఆర్ఎస్, ఆ పిమ్మట బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది. వారు ఎటు ఉంటే దానికి అనుగుణంగా మీడియాలో కొంతవరకు వార్తలు ఇచ్చే మాట నిజమే.
అలాగే ఇతర పార్టీలకు కొంత వ్యతిరేకం అనిపించే స్టోరీలు ఇస్తుండవచ్చు. అంతమాత్రాన అది ఉన్మాదం అయిపోతుందా?. ఏ మీడియా అయినా వాస్తవాలు రాయాలని చెప్పాలి. ఒకవేళ పనికట్టుకుని అసత్యాలు రాస్తే ఖండనలు ఇస్తారు. మరీ తీవ్రమైన స్థాయిలో కల్పిత గాధలు రాస్తే వాటిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకోవడం కొత్త కాదు. కొందరు మీడియా యజమానులు కొన్ని పార్టీలకు కొమ్ముకాయడం, ఆ పార్టీల ద్వారా ప్రయోజనాలు పొందడం, వారు ఆశించిన పని జరగకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
ఇదీ చదవండి: మరకే మంచిదంటున్న చంద్రబాబు!
వారిలో ఒకరిద్దరితో ఈయనకు సత్సంబంధాలే ఉన్నాయని అంటారు. అందరూ అలా చేస్తున్నారని కాదు. మీడియా రంగంలో ఒకప్పుడు కొంతైనా నిష్పక్షపాతంగా ఉండాలన్న అభిప్రాయం ఉండేది. కాని రానురాను, అవి తమకు నచ్చిన పార్టీలను భుజాన వేసుకుంటుండంతో రాజకీయ పార్టీలు, లేదా నేతలు సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవలసి వస్తోంది. వామపక్షాలైన సిపిఐ, సిపిఎం లకు ఎప్పటి నుంచో పత్రికలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించింది. తెలుగులో కూడా కాంగ్రెస్ పక్షాన మొదటి నుంచి కొన్ని పత్రికలు ఉండేవి. కాంగ్రెస్ మాజీ ఎంపీ కెఎల్ ఎన్ ప్రసాద్ ఆంధ్రజ్యోతి పత్రికను స్థాపించారు. మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.చంద్రశేఖరరెడ్డి డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలను నిర్వహించారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి క్రానికల్ పత్రికకు సారధ్యం వహిస్తున్నారు. ఉదయం పత్రికను స్థాపించిన దాసరి నారాయణరావు తదుపరి కాంగ్రెస్ ఎంపీ అయి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. "వార్త పత్రిక యజమాని గిరీష్ సంఘీ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఈనాడు దినపత్రికను జలగం వెంగళరావు సహకారంతో ఆరంభించారు. ఆ తర్వాత కాలంలో ఆయన తనది కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అని చెప్పడం విశేషం. తొలుత తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాక చంద్రబాబును భుజాన వేసుకున్నారు.
దీనితో పాటు మరో పత్రిక ఆంధ్రజ్యోతి కూడా కొత్త యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చంద్రబాబు అనుకూల పత్రికగా మారింది. ఈ రెండు పత్రికల ఎజెండాను అర్థం చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు కూడా పత్రిక ఉండాలని భావించి తన కుమారుడు జగన్‌తో సాక్షి పత్రిక, టివిలను ఆరంభించారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ బొమ్మను సాక్షి పత్రిక, టివిలలో ప్రముఖంగా వేసుకుని నడుపుతున్నారు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెలుగు దేశం జెండా గుర్తు వేసుకోకుండా లేదా చంద్రబాబు మద్దతు దారులమని ప్రకటించకుండా పూర్తి స్థాయిలో ఆయనకు సపోర్టు ఇస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులపై ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై నీచమైన స్థాయిలో పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తుంటాయి.
చంద్రబాబుకు భజన చేసుకుంటే పర్వాలేదు కాని వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉన్మాదంగా వైఎస్సార్‌సీపీపై అధికారంలో ఉన్నప్పుడే కాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా అదే ధోరణిలో వెళుతున్నాయి. చిత్రం ఏమిటంటే ఈ రెండు మీడియాలు మరికొన్ని ఎల్లో మీడియా సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్‌కు, ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీ కూటమిని భుజాన వేసుకుని ప్రచారం చేస్తుంటాయి. ఈ మీడియాల యజమానులతో రేవంత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక మీడియా అధిపతి వద్దకు స్వయంగా రేవంత్ వెళ్లి వినయంగా వ్యవహరించిన ఘట్టం విమర్శలకు గురి అయ్యింది. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ఒక టివి, చానల్ రేవంత్ అనుచరుడిది అని చెబుతారు. నిజానికి రేవంత్ పైకి వచ్చింది మీడియా సహకారంతో అన్న విషయం అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఆయన మీడియాకు సుద్దులు చెప్పే దశకు చేరుకున్నారు .ఆలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక యూ ట్యూబ్ చానల్ లు నిర్వహించడం ...అప్పట్లో కేసిఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కధనాలు నడపించడంతో పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు .ప్రధాన మీడియా అయినా, యూ ట్యూబ్ చానల్ లు అయినా తమ పరిధులలో ఉండాలని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.
కాని చంద్రబాబు ,రేవంత్ రెడ్డి వంటి నేతలు తాము అధికారంలో ఉంటే మీడియా ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉండాలని కోరుకోవడంతోనే సమస్యలు వస్తాయి.గత కేసిఆర్ ప్రభుత్వం సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టిన మాట నిజమే. అందువల్ల ఆయనకు అప్రతిష్ట వచ్చింది. ఇప్పుడు రేవంత్ అలాంటి అంక్షలు లేవని అనడం ఆహ్వనించదగ్గదే. కాని కొంత మంది జర్నలిస్టులపై ఉన్మాద ముద్ర వేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఉన్మాద పత్రికల యజమానులతో ఆయన స్నేహ సంబంధాలు నడుపుతున్న విషయం మర్చిపోవద్దు.
:::కొమ్మినేని శ్రీనివాస రావు,
సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment